Tirumala Brahmotsavam History : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వెయ్యేళ్లకు పైగా చరిత్ర - నాటి నుంచి నేటి వైభవం వరకు ఇలా...
Tirumala Brahmotsavam History : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వెనుక శతాబ్దాల నాటి సుదీర్ఘ చరిత్ర ఉంది. పల్లవ రాణి దాన శాసనాల నుంచి విజయనగర రాజవంశాల పోషణ, టీటీడీ ఏర్పాటు వరకు ఈ మహోత్సవం అత్యంత వైభవంగా కొనసాగుతూ వస్తోంది.
తిరుమల కొండల్లో బ్రహ్మోత్సవాలంటే కేవలం తొమ్మిది రోజుల పాటు సాగే వేడుక మాత్రమే కాదు. అది భక్తి పారవశ్యంతో ఏడు కొండలూ మార్మోగిపోయే ఒక అలౌకిక మహోత్సవం. ధ్వజారోహణంతో ప్రారంభమై చక్రస్నానంతో ముగిసే ఈ ఉత్సవాల్లో, రోజువారీ ఉదయం-సాయంత్రం వాహన సేవలు, లక్షలాది మంది భక్తులు చేసే గోవింద నామస్మరణలు తిరుమలను కైలాసంగా మారుస్తాయి.

నేడు మన కంటికి కనిపిస్తున్న ఈ అద్భుత వైభవం ఒకే ఒక్క రోజులో లేదా కొద్ది సంవత్సరాల్లో రూపుదిద్దుకున్నది కాదు. శతాబ్దాల తరబడి వివిధ రాజవంశాలు, రాజులు, రాణులు, సామంతులు, అధికారులు ,అనన్య భక్తులు అందించిన దానధర్మాలు, ఆలయ పరిపాలనా సంస్కరణలు, ఆగమ సంప్రదాయాలు ఈ ఉత్సవ స్వరూపాన్ని తీర్చిదిద్దాయి.
ఆ చరిత్రకు పురాణాలు మాత్రమే ఆధారం కాదు. తిరుమల ఆలయ గోడలపై చెక్కిన శాసనాలే ఈ ఉత్సవ పరిణామానికి అత్యంత విలువైన చారిత్రక ఆధారాలు. టీటీడీ ప్రచురించిన శాసన సంపుటాలు, చారిత్రక గ్రంథాలు ఈ వైభవానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను టీటీడీ ఓ ప్రకటన ద్వారా పేర్కొంది. ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం……
చరిత్ర ఇలా….
శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆవిర్భావానికి పురాణ పరంపరలో ప్రత్యేకమైన కథనం ఉంది. శ్రీనివాసుడు వెంకటాద్రిపై అవతరించిన సందర్భంగా బ్రహ్మదేవుడు తొలిసారిగా ఉత్సవాలను నిర్వహించాడని అందుకే ఈ ఉత్సవానికి ‘బ్రహ్మోత్సవం’ అనే పేరు వచ్చిందని పురాణ ప్రాశస్త్యం.
పల్లవ రాజవంశానికి చెందిన రాణి సామవై పెరుందేవి శ్రీ వేంకటేశ్వరస్వామివారికి వెండి భోగ శ్రీనివాసమూర్తిని సమర్పించింది. ఆమె అనేక ఆభరణాలతో పాటు ఉత్సవాల నిర్వహణకు భూములను కూడా దానం చేసింది. ఆమె దానశాసనం తిరుమల ఆలయ మొదటి ప్రాకారంలోని ఉత్తర గోడపై చెక్కబడి ఉంది.
ఈ శాసనం ఆధారంగా 10వ శతాబ్దంలోనే బ్రహ్మోత్సవాలు వ్యవస్థీకృతంగా నిర్వహించబడుతున్నట్లు తెలుస్తోంది. పెరటాసి మాసంలో ప్రధాన బ్రహ్మోత్సవంతో పాటు మార్గశిర మాసంలో మరో బ్రహ్మోత్సవం నిర్వహించేందుకు సామవై ఏర్పాట్లు చేసింది. ఆమె దానం చేసిన భోగ శ్రీనివాసమూర్తి ఆలయ ఉత్సవ సంప్రదాయంలో మరో ముఖ్యమైన అధ్యాయానికి నాంది పలికింది.
రెండు ఉత్సవాల నుంచి… ఐదు బ్రహ్మోత్సవాల వరకు
10వ శతాబ్దంలో కనిపించే ఈ సంప్రదాయం అక్కడితో ఆగలేదు. చోళుల కాలంలో బ్రహ్మోత్సవాల సంఖ్య క్రమంగా పెరిగింది. పెరటాసి, మార్గళి తర్వాత పాంగుని బ్రహ్మోత్సవాన్ని యాదవరాయ సామంతుడు వీర నరసింహ యాదవరాయ కాలానికి ఆపాదించారు. 1254లో చోళ రాజు విజయ గండగోపాలదేవుని కాలంలో చిత్తిరై బ్రహ్మోత్సవం చేరింది. 1300–1330 మధ్య మరో యాదవరాయ సామంతుడి ఆధ్వర్యంలో ఆడి బ్రహ్మోత్సవం ఏర్పడింది.
అలా విజయనగర సామ్రాజ్యం ఏర్పడే నాటికి తిరుమలలో సంవత్సరానికి ఐదు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడ్డాయి. వాటిలో మూడు చోళుల కాలంలో, రెండు యాదవరాయుల కాలంలో ఏర్పడ్డాయి.
సంగమ, సాళువ, తుళువ, ఆరవీడు వంశాల కాలంలో ఆలయంలో ఉత్సవాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. సంగమ వంశం కాలంలో కొత్త బ్రహ్మోత్సవాలు చేరగా, తరువాత తుళువుల కాలంలో మరిన్ని ఉత్సవాలు ఏర్పడ్డాయి. 15వ శతాబ్దం నాటికి తిరుమలలో సంవత్సరానికి అనేక బ్రహ్మోత్సవాలు నిర్వహించే స్థాయికి ఈ సంప్రదాయం చేరింది.
విజయనగర కాలం చివరి దశకు వచ్చేసరికి శాసనాల్లో సంవత్సరానికి పది బ్రహ్మోత్సవాల వరకు నమోదయ్యాయి. 1539 నుంచి 1616 మధ్య పది వార్షిక బ్రహ్మోత్సవాల ప్రస్తావనలు శాసనాల్లో కనిపిస్తాయి.
అంటే… నేడు సంవత్సరంలో ఒకటి లేదా అధికమాసం వచ్చినప్పుడు రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామన్న విషయం వెనుక, ఒకప్పుడు సంవత్సరానికి అనేక బ్రహ్మోత్సవాలు నిర్వహించిన సుదీర్ఘ చరిత్ర దాగి ఉంది.
శ్రీకృష్ణదేవరాయల కాలంలో….
విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల పేరు లేకుండా తిరుమల చరిత్రను చెప్పడం అసాధ్యం. 1513 ఫిబ్రవరి 10న ఆయన తొలిసారి తిరుమలను దర్శించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. 1513లో తన జన్మమాసమైన తై మాసంలో కొత్త బ్రహ్మోత్సవాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. అంటే ఆయన సేవ కేవలం ఆభరణాలు, నిర్మాణాలు, కానుకలకే పరిమితం కాలేదు. శ్రీవారి ఉత్సవ సంప్రదాయాన్ని విస్తరించడంలోనూ ఆయన పాత్ర ఉంది.
కృష్ణదేవరాయల తరువాత అచ్యుతరాయల కాలంలోనూ ఉత్సవాలకు రాజపోషణ కొనసాగింది. 1533లో కార్తీక బ్రహ్మోత్సవానికి సంబంధించిన తొలి ప్రస్తావన కనిపిస్తుంది. 1534లో ఈ ఉత్సవానికి విరాళం అందించినట్లు ఒక శాసనం చెబుతోంది. అచ్యుతరాయల కాలంలో ఈ ఉత్సవానికి నిరంతరంగా దానాలు అందడం, అది రాజ ప్రోత్సాహంతోనే ఏర్పడినట్లు చరిత్రకారులు భావించడానికి ఆధారంగా నిలుస్తోంది.
1539లో తాళ్లపాక పెద తిరుమలయ్యంగార్ ఆధ్వర్యంలో ఆణి బ్రహ్మోత్సవం ఏర్పడటంతో వార్షిక బ్రహ్మోత్సవాల సంఖ్య మరోసారి పెరిగింది. ఇది తిరుమల ఉత్సవాల చరిత్రలో ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతోంది. కాలానుగుణంగా కొత్త ఉత్సవాలు చేరుతూ, కొన్ని మారుతూ, మరికొన్ని నిలిచిపోతూ ఒక సజీవ సంప్రదాయంగా అభివృద్ధి చెందింది.
1339 ప్రాంతం నుంచి మలయప్పస్వామివారు ఉత్సవమూర్తిగా ఉపయోగించబడుతున్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామివారికి వివాహోత్సవాలు, ఇతర ఉత్సవాలతో పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించే సంప్రదాయం ఏర్పడింది. నేడు మనం వాహన సేవల్లో దర్శించే శ్రీ మలయప్పస్వామి సంప్రదాయానికి ఇదే చారిత్రక నేపథ్యం.
మహంతుల కాలం నుంచి టీటీడీ వరకు…
19వ శతాబ్దంలో తిరుమల ఆలయ పరిపాలనలో మరో పెద్ద మార్పు వచ్చింది. 1843లో ఆలయ పరిపాలనా బాధ్యతలు హథీరాంజీ మఠాధిపతుల ఆధీనంలోకి వెళ్లాయి. మహంతుల పరిపాలన 1933 వరకు కొనసాగింది. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పడటంతో మహంతుల పరిపాలన ముగిసి, ఆలయాలు కొత్త సంస్థాగత పరిపాలనా వ్యవస్థలోకి వచ్చాయి. ఆ తరువాత శ్రీవారి ఆలయంతో పాటు ఇతర దేవాలయాల ఉత్సవాలను కూడా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే వ్యవస్థ బలపడింది.
అక్కడి నుంచి బ్రహ్మోత్సవం కేవలం ఆలయ ఉత్సవంగా కాకుండా భక్తుల సౌకర్యం, వసతి, రవాణా, భద్రత, వైద్య సేవలు, అన్నప్రసాదం, సమాచార వ్యవస్థ, ప్రత్యక్ష ప్రసారాలు వంటి అనేక విభాగాలతో కూడిన భారీ సంస్థాగత కార్యక్రమంగా రూపాంతరం చెందింది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల పరిణామం - వివరాలు
- 966 CE — పల్లవ రాణి సామవై పెరుందేవి దానశాసనం; భోగ శ్రీనివాసమూర్తి ప్రతిష్ఠ, ఉత్సవాల కోసం భూములు, ఆభరణాల దానం; పురట్టాసి, మార్గళి ఉత్సవాలకు ఆధారాలు.
- 1209–1263 — వీర నరసింహ యాదవరాయ కాలానికి పాంగుని బ్రహ్మోత్సవం ఆపాదన.
- 1254 — విజయ గండగోపాలదేవుని కాలంలో చిత్తిరై బ్రహ్మోత్సవం.
- 1300–1330 — యాదవరాయుల కాలంలో ఆడి బ్రహ్మోత్సవం చేరిక.
- 1339 ప్రాంతం — మలయప్పస్వామి ఉత్సవమూర్తిగా ప్రాచుర్యంలోకి వచ్చిన దశ.
- 14వ–15వ శతాబ్దాలు — విజయనగర కాలంలో బ్రహ్మోత్సవాల సంఖ్య, ఉత్సవాల వైభవం విస్తరణ.
- 1513 — శ్రీకృష్ణదేవరాయలు తై మాసంలో కొత్త బ్రహ్మోత్సవాన్ని ఏర్పాటు చేశారు.
- 1533–1534 — కార్తీకై బ్రహ్మోత్సవానికి శాసన ఆధారాలు.
- 1539 — తాళ్లపాక పెద తిరుమలయ్యంగార్ ఆధ్వర్యంలో ఆణి బ్రహ్మోత్సవం; వార్షిక బ్రహ్మోత్సవాల సంఖ్య పది దశకు చేరిన కాలం.
- 1803 — మెకంజీ సర్వేలో తిరుమలలో 28 ఉత్సవాల ప్రస్తావన; అయితే రికార్డులో కొన్ని మినహాయింపులు, అసమానతలు ఉన్నట్లు చరిత్ర గ్రంథం పేర్కొంటుంది.
- 1843 — హథీరాంజీ మఠ మహంతుల ఆధ్వర్యంలో ఆలయ పరిపాలన.
- 1933 — తిరుమల తిరుపతి దేవస్థానముల ఏర్పాటు; మహంతుల పరిపాలనకు ముగింపు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

