ముగిసిన తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు - హుండీ ద్వారా రూ.25.79 కోట్ల ఆదాయం! లెక్కలు ఇలా
Tirumala Navaratri Brahmotsavam 2026 : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. 8 రోజుల్లో 6.46 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.25.79 కోట్ల ఆదాయం లభించింది.
Tirumala Navaratri Brahmotsavam 2026 Updates : తిరుమల క్షేత్రంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో విజయవంతంగా ముగిశాయి. అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు సాగిన ఈ ఉత్సవాల్లో భారీ వర్షాలు కురిసినప్పటికీ భక్తుల భక్తిప్రపత్తులకు ఎలాంటి విఘాతం కలగలేదు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు అంకితభావంతో అహోరాత్రులు సేవలందించారు.

రికార్డు స్థాయిలో దర్శనాలు, హుండీ ఆదాయం
ఈ 8 రోజుల బ్రహ్మోత్సవాల వ్యవధిలో మొత్తం 6.46 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారి హుండీకి రూ.25.79 కోట్ల ఆదాయం లభించింది. అదేవిధంగా భక్తుల ఆకలి తీర్చేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల కాలంలో ఏకంగా 22.60 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. శ్రీవారి ప్రసాదంగా 34.34 లక్షల లడ్డూలను అందించగా, 2.44 లక్షల మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
దేశంలోని 26 రాష్ట్రాలతో పాటు ఖతర్, దుబాయ్ దేశాల నుంచి వచ్చిన 6,777 మంది కళాకారులు తమ అద్భుతమైన నృత్య, సంగీత ప్రదర్శనలతో బ్రహ్మోత్సవాలకు మరింత ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకొచ్చారు. తిరుమల వీధులన్నీ విదేశీ, సంప్రదాయ పుష్పాలతో పరిమళించాయి. దాదాపు 60 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 5 లక్షల కట్ ఫ్లవర్స్‌తో స్వామివారి ఆలయం, మాడ వీధులను శోభాయమానంగా అలంకరించారు. ఎన్నడూ లేని విధంగా విద్యుత్ దీపాలంకరణలు తిరుగిరులను రంగులమయంగా మార్చి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు, నిరంతర సేవలు
తిరుమలకు వచ్చిన భక్తులకు రవాణా, వైద్యం, భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ పక్కా వ్యూహంతో వ్యవహరించింది. 39 ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా సుమారు 7 లక్షల మంది భక్తులకు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించారు. 4,500 మంది శ్రీవారి సేవకులు నిరంతరం అందుబాటులో ఉంటూ భక్తులకు సేవలందించారు. ఆరోగ్య పరిరక్షణ కోసం 75 మంది వైద్యులు, 20 అంబులెన్సులతో వైద్య సేవలు అందుబాటులో ఉంచారు. భద్రత కోసం 2,800 మంది పోలీసులు, 2,000 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
ప్రత్యేకంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన గరుడసేవ రోజున కురిసిన వర్షంలోనూ భక్తులకు నిరంతరాయంగా పారిశుద్ధ్య సేవలు అందించిన 3,500 మంది సిబ్బంది కృషి అభినందనీయం.
విద్యుత్, పుష్పాలంకరణలు, భక్తుల సౌకర్యాలు, భద్రత, పారిశుద్ధ్యం తదితర విభాగాల్లో అంకితభావంతో పనిచేసిన ప్రతి ఉద్యోగి, అధికారి, శ్రీవారి సేవకుడు, కళాకారుడు, పోలీసు, వైద్య సిబ్బందితో పాటు బ్రహ్మోత్సవాల విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ టీటీడీ పాలకమండలి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.
త్వరలోనే అత్యంత ఆధునికంగా రూపుదిద్దుకున్న శ్రీ వేంకటేశ్వర మ్యూజియాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు, సేవలు అందించడమే లక్ష్యంగా టీటీడీ పనిచేస్తోందని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ శ్రీవారి ఆశీస్సులతో తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి సంతృప్తికరమైన దర్శనం, దివ్యానుభూతి కల్పించేందుకు మరింత మెరుగైన ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

