Tirumala Robot Dog : తిరుమల కాలిబాటలో రోబోట్ డాగ్ - భక్తుల భద్రతకు అత్యాధునిక నిఘా…!

Tirumala Robot Dog : తిరుమల కాలిబాట ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను పసిగట్టేందుకు టీటీడీ క్వాడ్రుపెడ్ రోబోట్‌ను పరిశీలించింది. ఏఐ, థర్మల్ కెమెరాలతో పనిచేసే ఈ రోబోట్ భక్తుల భద్రతను పటిష్టం చేయనుంది.

Published on: Aug 21, 2026, 12:48:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tirumala Robot Dog : తిరుమల గిరుల్లో ఆధ్యాత్మిక యాత్రకు వచ్చే లక్షలాది మంది భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సరికొత్త దిశగా అడుగులు వేస్తోంది. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు, భక్తులకు పూర్తి రక్షణ కల్పించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అత్యంత వినూత్నమైన క్వాడ్రుపెడ్ రోబోట్ (నాలుగు కాళ్ల రోబోట్ డాగ్) పనితీరును గురువారం తిరుమలలో పరిశీలించారు.

తిరుమల కాలిబాటలో రోబో డాగ్
తిరుమల కాలిబాటలో రోబో డాగ్

తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్ద ఈ రోబోట్ డాగ్ ట్రయల్ రన్‌ను టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. సాధారణంగా అడవుల్లో మనుషులు వెళ్లడానికి వీలుకాని, ప్రమాదకరమైన ప్రదేశాల్లో వన్యప్రాణుల కదలికలను ముందస్తుగా కనిపెట్టేందుకు ఈ రోబోట్ ఏ విధంగా ఉపయోగపడుతుందనే అంశాలపై సాంకేతిక నిపుణుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అత్యాధునిక సాంకేతికతల సమాహారం……

ఈ రోబోట్ డాగ్‌లో అత్యంత క్లిష్టమైన వాతావరణంలోనూ పనిచేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అమర్చారు. ఇందులో ఆప్టికల్ కెమెరా, థర్మల్ ఇమేజింగ్ కెమెరా, 360 డిగ్రీల లైడార్ (LiDAR), వివిధ రకాల సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సిస్టమ్‌లు ఉన్నాయి. దట్టమైన చీకటి లేదా పొగమంచు ఆవరించి ఉన్నప్పటికీ వన్యప్రాణుల సంచారాన్ని ఇది కచ్చితత్వంతో గుర్తుపట్టగలదు.

ఈ రోబోట్‌లోని ఏఐ వ్యవస్థ పెద్ద జంతువులు, మనుషులు, వాహనాలు, పశువులను స్పష్టంగా గుర్తించి వర్గీకరించగలదని అధికారులు వెల్లడించారు. ఏదైనా వన్యప్రాణి సంచారాన్ని గుర్తించిన వెంటనే, ఈ రోబోట్ జియో - ట్యాగ్‌డ్ అలర్ట్‌లను పంపడమే కాకుండా, లైవ్ వీడియో ఫీడ్ మరియు థర్మల్ చిత్రాలను నేరుగా కంట్రోల్ రూమ్‌తో పాటు క్షేత్రస్థాయిలో పెట్రోలింగ్ చేసే సిబ్బందికి చేరవేస్తుంది.

ముఖ్యంగా అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే కాలిబాట మార్గానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో చిరుతలు, ఇతర క్రూర మృగాల కదలికలను ముందస్తుగా గుర్తించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. క్రూర జంతువులు భక్తులు నడిచే బాటల వైపు వచ్చినప్పుడు, రోబోట్‌లోని సౌండ్, లైట్ యూనిట్లను ఉపయోగించి ఎలాంటి భౌతిక తాకిడి లేకుండానే వాటిని తిరిగి అడవిలోకి మళ్లించే వీలుంది. దీనివల్ల భక్తులను ముందుగానే అప్రమత్తం చేయడంతో పాటు మనుషులు, వన్యప్రాణుల మధ్య జరిగే ముఖాముఖి ఘర్షణలను అరికట్టవచ్చు.

ఇప్పటికే తిరుమల కొండలపై అందుబాటులో ఉన్న కెమెరా ట్రాప్‌లు, ఫుట్ పెట్రోలింగ్, విజిలెన్స్ నిఘా వ్యవస్థలకు ఇది ఒక శక్తివంతమైన మొబైల్ మానిటరింగ్ వ్యవస్థగా అదనపు బలాన్ని ఇస్తుందని అదనపు ఈవో వెల్లడించారు. జంతువుల సంచారం ఎక్కువగా ఉండే సున్నితమైన ప్రాంతాల్లో దీనిని అత్యంత వేగంగా మోహరించవచ్చు. దీని ద్వారా సేకరించిన థర్మల్ చిత్రాలు, వీడియోలను విశ్లేషించి వన్యప్రాణుల సంచార విధానాన్ని అర్థం చేసుకోవడానికి… తద్వారా నిఘా సమయాలను మెరుగుపరచడానికి వీలవుతుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More