...
...
Next Story

భోగాపురం హైవేపై విషాదం.. ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఢీకొట్టిన కారు.. ఐదుగురి దుర్మరణం!

Road Accident : విజయనగరం జిల్లా భోగాపురం జాతీయ రహదారిపై సుందరపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీముఖలింగం దర్శనం చేసుకుని వస్తుండగా ఆగి ఉన్న ట్యాంకర్‌ను కారు ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు.

Published on: Nov 24, 2026, 11:07:11 IST
Advertisement

దైవదర్శనం చేసుకుని ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వస్తున్న కుటుంబాల ప్రయాణం విషాదాంతమైంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందరపేట సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆగి ఉన్న భారీ ట్యాంకర్‌ను వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ పెను ప్రమాదం సంభవించింది.

భోగాపురం హైవేపై రోడ్డు ప్రమాదం
భోగాపురం హైవేపై రోడ్డు ప్రమాదం

విశాఖ జిల్లా భీమిలి, తగరపువలస ప్రాంతాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు కారులో శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీముఖలింగం ఆలయానికి వెళ్లారు. అక్కడ స్వామివారి దర్శనం పూర్తి చేసుకుని తిరిగి స్వస్థలాలకు బయలుదేరారు. మార్గమధ్యలో విజయనగరం జిల్లా భోగాపురం హైవేపై సుందరపేట వద్దకు రాగానే, రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఓ ట్యాంకర్‌ను వీరి కారు అత్యంత వేగంతో ఢీకొట్టింది.

ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జయి ట్యాంకర్ కిందకు చొచ్చుకుపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తీవ్ర గాయాలతో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మరొకరిని స్థానికులు, పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది.

పోలీసులు మృతదేహాలను బయటకు తీసి, వారి వద్ద ఉన్న ఆధారాల ద్వారా వివరాలు సేకరించారు. మృతుల్లో రెండు జంటలు ఉండటం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. భీమిలి వాసులు కొండా సూరిబాబుతోపాటుగా బొర్రా సతీశ్, ఆయన భార్య శ్రుతి. తగరపువలస వాసులు వాకలపూడి శ్రీను, ఆయన భార్య కుసుమరంజని మృతి చెందారు. ఒకేసారి ఐదుగురు మృతి చెందడంతో భీమిలి, తగరపువలస ప్రాంతాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆస్పత్రి ఆవరణ దద్దరిల్లింది.

సమాచారం అందుకున్న వెంటనే భోగాపురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో, క్రేన్ సాయంతో ధ్వంసమైన కారును పక్కకు తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

జాతీయ రహదారులపై ఎలాంటి హెచ్చరిక సూచికలు లేకుండా భారీ వాహనాలను ఇష్టారాజ్యంగా నిలిపివేయడం వల్లే ఇలాంటి ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీకటి లేదా వేగంగా ప్రయాణించే సమయంలో ఆగి ఉన్న వాహనాలు కనిపించక డ్రైవర్లు అదుపుతప్పుతున్నారని, హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఇలాంటి పార్కింగ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks