TTD : తిరుమలలో భక్తులకు ఉప విచారణ కార్యాలయాల ద్వారా వసతి గదుల కేటాయింపు
TTD : తిరుమలలో భక్తులకు ఉప విచారణ కార్యాలయాల ద్వారా సులభంగా వసతి గదుల కేటాయిస్తున్నారు. డిస్‌ప్లే బోర్డులు, ఎస్ఎంఎస్ ద్వారా గది సమాచారం తెలుసుకోవచ్చు.
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు గదుల కోసం ఇబ్బంది పడకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. గతంలో సీఆర్వో వద్ద గదుల కోసం భక్తులు గంటల కొద్దీ వేచి ఉండే విధానాన్ని మార్పు చేస్తూ భక్తుల అవస్థలు, సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ఉప విచారణ కార్యాలయాల ద్వారా గదులు కేటాయించే విధానాన్ని అమలు చేస్తోంది. భక్తులు ముందుగా తిరుమలలోని కేంద్రీయ విచారణ కార్యాలయం(సీఆర్వో) వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 5 గంటల నుండి సీఆర్వో కార్యాలయం తెరుచుకుంటుంది. గదుల అందుబాటులో ఉన్నంత వరకు సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

భక్తులు క్యూలైన్‌లో నిలబడి తమ వంతు వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద తమ ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా జిరాక్స్ కాపీని తీసుకెళ్లి ఫోన్ నెంబర్ వివరాలు తెలియజేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. కౌంటర్ వద్ద రెండు కేటగిరీలకు సంబంధించిన గదుల్లో తమకు నచ్చిన కేటగిరీని ఎంచుకోవచ్చు.
A కేటగిరీలో రూ.50, రూ.100 గదులు, B కేటగిరీలో రూ.1000 గదులు ఉంటాయి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే భక్తులకు ఒక అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ కేటాయిస్తారు. క్యూలైన్ల వద్ద భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, అన్న ప్రసాదం, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
గదుల కోసం మార్గదర్శకాలు
గదులు పొందడానికి 21 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
ఒకసారి గదిని పొందిన వ్యక్తి 30 రోజుల వరకు తిరిగి గదిని పొందలేరు.
ఒక కుటుంబం నుండి ఒక వ్యక్తి మాత్రమే క్యూ లైన్ లోకి రావాలి.
ఒంటరి వ్యక్తికి లేదా అవివాహితులకు గదులు కేటాయించరు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత సీఆర్వో వద్ద ఉన్న డిస్‌ప్లే బోర్డులలో వరుస క్రమంలో రిజిస్ట్రేషన్ సంఖ్య కనిపిస్తుంది. తమ క్రమ సంఖ్య కనిపించిన 15 నిమిషాలలోపు తమ సెల్ ఫోన్ కు కేటాయించిన గదికి సంబంధించిన సమాచారం మెసేజ్ రూపంలో అందుతుంది.
ఒకవేళ డిస్‌ప్లే బోర్డుల్లో తమ రిజిస్ట్రేషన్ క్రమ సంఖ్య వచ్చినప్పటికీ మెసేజ్ రాకపోతే సీఆర్వో వద్ద ఏర్పాటు చేసి కీయోస్క్ మిషన్లలో తమ స్లాప్ స్కాన్ చేస్తే తమకు కేటాయించిన గది వివరాలు చూపిస్తుంది. అనంతరం భక్తులు వారికి గది కేటాయించిన ప్రాంతంలోని ఉప విచారణ కార్యాలయాలకు చేరుకుని గదికి సంబంధించిన రుసుమును ఆన్‌లైన్(ఫోన్ పే/ గూగుల్ పే/యూపీఐ/క్రిడిట్ కార్డు/డెబిట్ కార్డు) ద్వారా మాత్రమే చెల్లించి తాళాలు తీసుకోవాల్సి ఉంటుంది.
తిరుమలలోని ఉప విచారణ కార్యాలయాల వివరాలు
అంజనాద్రి నగర్ కాటేజస్, శ్రేషాద్రి నగర్ కాటేజస్, శంఖుమిట్ట కాటేజస్, గరుడాద్రి నగర్ కాటేజస్, హిల్ వ్యూ కాటేజస్, సుదర్శన సత్రం, గోవర్ధన్ సత్రం, కళ్యాణి సత్రం, సప్తగిరి విశ్రాంతి గృహం, రామ్ భగిచా విశ్రాంతి గృహం-2, వరాహ స్వామి విశ్రాంతి గృహం -1, వరాహ స్వామి విశ్రాంతి గృహం -2, అష్ట వినాయక విశ్రాంతి గృహం, కౌస్తుభం విశ్రాంతి గృహం, పాంచజన్యం విశ్రాంతి గృహం, మాతృశ్రీ వకుళామాత విశ్రాంతి గృహం, నందకం విశ్రాంతి గృహం, సూరాపురం తోటలో కార్యాలయాలు ఉన్నాయి.
భక్తులు పాటించాల్సిన నిబంధనలు
గదులు 24 గంటలకు మాత్రమే కేటాయిస్తారు. ఒకవేళ 24 గంటలు దాటితే టారీఫ్ 200 శాతం, 48 గంటలు దాటితే 400 శాతం పెరుగుతుంది.
నీరు, విద్యుత్ ను వృథా చేయకూడదు.
తిరుమలలో ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లను ఉపయోగించరాదు.
జగ్గులు, నీటి గ్లాసులను ఉపయోగించాలి, వాటిని శుభ్రంగా ఉంచాలి.
తడి, పొడి చెత్తను వాటికి వేరువేరుగా కేటాయించిన చెత్త బుట్టలలో వేయాలి.
భక్తులు వారి వస్తువులను వారే బాధ్యత వహించాలి.
గదులు పొందిన భక్తుడు/భక్తురాలు మాత్రమే గది ఖాళీ చేయాల్సి ఉంటుంది. లేకుంటే కాషన్ డిపాజిట్ తిరిగి ఇవ్వరు.
తమ గదిని వేరొకరికి ఇవ్వడం పూర్తిగా నిషిద్ధం. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకోరు.
భక్తులు పైనిబంధనలను, టీటీడీ సూచనలను పాటిస్తూ కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడుతూ టీటీడీకి సహకరించగలరని కోరింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


