తిరుమలకు నడక మార్గంలో వచ్చే భక్తులకు అప్డేట్.. పసుపు, కుంకుమ క్వాలిటీ తప్పనిసరి

TTD : తిరుమల నడకమార్గంలో మెట్లపూజకు నాణ్యమైన పసుపు, కుంకుమ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఆదేశించింది. నిబంధనలు పాటించాలని తెలిపింది.

Published on: Nov 28, 2026, 18:25:49 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులు అలిపిరి, శ్రీవారిమెట్ల మార్గంలో మెట్ల పూజకు నాణ్యమైన పసుపు, కుంకుమ వినియోగించేలా చర్యలు చేపట్టాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో సుధర్మ సమావేశ మందిరంలో శనివారం టీటీడీ,మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం

ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. అలిపిరి వద్ద పూజ సామాగ్రి విక్రయాల్లో నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నడక మార్గంలో భక్తులు జారిపడకుండా నాణ్యమైన పసుపు, కుంకుమను మాత్రమే విక్రయించేలా నిబంధనలు కఠినతరం చేయాలని చెప్పారు. ఈ మేరకు సూచిక బోర్డుల ఏర్పాటు చేసి విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో టీటీడీ ఎస్ఈ-2 వేణు గోపాల్, ఎస్టేట్ ఆఫీసర్ వేంకటేశ్వర్లు, హెల్త్ డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, తిరుపతి మున్సిపాలిటీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 06 నుండి 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ప్రతి ఏటా తొమ్మిది రోజుల పాటు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ.

ఉత్సవాలకు ముందు కార్యక్రమాలు

డిసెంబర్ 01: బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ శుద్ధి కోసం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.

డిసెంబర్ 05: ఉదయం లక్ష కుంకుమార్చన, సాయంత్రం అంకురార్పణ.

వాహన సేవలు

బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి.

06.12.2026 (ఆదివారం) ధ్వజారోహణం చిన్నశేష వాహనం

07.12.2026 (సోమవారం) పెద్దశేష వాహనం హంస వాహనం

08.12.2026 (మంగళవారం) ముత్యపుపందిరి వాహనం సింహ వాహనం

09.12.2026 (బుధవారం) కల్పవృక్ష వాహనం హనుమంత వాహనం

10.12.2026 (గురువారం) పల్లకీ ఉత్సవం గజ వాహనం

11.12.2026 (శుక్రవారం) సర్వభూపాల వాహనం స్వర్ణరథం, గరుడ వాహనం

12.12.2026 (శనివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

13.12.2026 (ఆదివారం) రథోత్సవం అశ్వ వాహనం

14.12.2026 (సోమవారం) పంచమీ తీర్థం ధ్వజావరోహణం

15.12.2026 (మంగళవారం) పుష్పయాగం

తిరుచానూరు ఆలయ స్థల పురాణం ప్రకారం, శ్రీ పద్మావతి అమ్మవారు పద్మసరోవర పుష్కరిణిలో బంగారు పద్మం నుండి ఆవిర్భవించినట్లు ప్రతీతి. అందుకే ఈ ప్రదేశానికి పద్మావతిపురం అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అదే తిరుచానూరుగా మారింది. ఈ పవిత్ర పుష్కరిణి అమ్మవారి ఆలయం వెనుక భాగంలో ఉంది.

సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు 12 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత, కార్తీక మాస శుక్లపక్ష పంచమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం, శుక్రవారం నాడు అభిజిత్ లగ్నంలో, బంగారు వర్ణంతో అమ్మవారు బంగారు పద్మం నుండి ఉద్భవించారు. ఆ పవిత్రదినానికి తొమ్మిది రోజుల ముందు నుంచే శ్రీ పాంచరాత్ర ఆగమానుసారం బ్రహ్మోత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.

బ్రహ్మోత్సవాల చివరి రోజైన పంచమీ తీర్థం నాడు పద్మసరోవరంలో చక్రస్నానం జరుగుతుంది. ఈ పుష్కరిణిలో స్నానం ఆచరిస్తే సప్త సముద్రాలు, ముక్కోటి తీర్థాల్లో స్నానమాచరించిన పుణ్యఫలం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని, చక్రస్నాన సమయంలో పుష్కరిణిలో స్నానమాచరించి పునీతులవుతారు.

ఆర్జిత సేవల రద్దు

డిసెంబర్ 01 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు, కుంకుమార్చన, బ్రేక్ దర్శనం రద్దు చేశారు. డిసెంబర్ 05 నుండి 16 వరకు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలు, కుంకుమార్చన, వేదాశీర్వచనం, బ్రేక్ దర్శనాలు రద్దు అయ్యాయి.

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.