శ్రీ వకుళామాత సన్నిధిలో జూలై 3 నుండి చిన్నారులకు అక్షర గోవిందం, అన్నప్రాశన సేవలు
తిరుపతి శ్రీ వకుళామాత సన్నిధిలో “అక్షర గోవిందం”కు శ్రీకారం చుట్టింది టీటీడీ. జూలై 3 నుండి చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాశన సేవలు ఉండనున్నాయి.
చిన్నారుల్లో సనాతన ధర్మ సంప్రదాయాలపై ఆసక్తి పెంపొందించి, వారి విద్యారంభం, జీవితారంభం దైవానుగ్రహంతో శుభప్రదంగా సాగాలనే సంకల్పంతో టీటీడీ జూలై 3 నుండి తిరుపతిలోని శ్రీ వకుళామాత ఆలయంలో నూతనంగా “అక్షర గోవిందం”, అన్నప్రాశన కార్యక్రమాలను ప్రారంభించనుంది.

జూలై 03వ తేదీ మధ్యాహ్నం 12.00 నుండి 12.30 గంటల వరకు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆశీస్సులతో, శ్రీ వకుళామాత సన్నిధిలో చిన్నారులకు సంప్రదాయబద్ధంగా అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. కార్యక్రమం అనంతరం ఆశీర్వచనం, ప్రసాదం, ప్రత్యేక “అక్షర గోవిందం కిట్” అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో 3 నుండి 5 సంవత్సరాల వయస్సు గల చిన్నారులు పాల్గొనవచ్చు. అక్షర గోవిందం కిట్‌లో రాతపలక, బలపాలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, శ్రీవారి కంకణం, ఫటిక బెల్లం, శ్రీ వకుళామాత, శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ సరస్వతీదేవి చిత్రపటాలు, గోవింద నామాలు, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, పెద్దబాలశిక్ష తదితర పూజా, విద్యా సామగ్రిని ఉచితంగా అందజేస్తారు.
అదేవిధంగా ఆలయ అర్చకుల పర్యవేక్షణలో వేదమంత్రోచ్ఛారణల మధ్య చిన్నారులకు తొలి అన్నప్రాశనను ఆగమోక్తంగా నిర్వహించి, శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ వకుళామాతల ఆశీస్సులను అందజేస్తారు.
జూలై 4 నుండి మంగళవారం మినహా అన్ని రోజుల్లో వకుళమాత ఆలయ అర్చకులు నిర్ణయించిన శుభ ముహూర్తంలో ఆలయంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ బ్యాచ్ కు 25 మంది చిన్నారులు చొప్పున రెండు బ్యాచ్‌లలో మొత్తం 50 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు గంట ముందస్తుగా ఆలయ ప్రాంగణంలో నమోదు చేసుకోవాలి. చిన్నారులు తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో కలిసి సంప్రదాయ వస్త్రధారణలో హాజరుకావాలని టీటీడీ సూచించింది.
శ్రీ వకుళామాత, శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్య అనుగ్రహంతో తమ పిల్లల విద్యారంభం, అన్నప్రాశనను పవిత్రంగా నిర్వహించుకునేందుకు ఈ ప్రత్యేక సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


