తిరుమలకు వెళ్తున్నారా..? ఉచితంగా వసతి, లాకర్ల సదుపాయం..! మీరు తెలుసుకోవాల్సిన పూర్తి సమాచారం
Tirumala Accommodation Facilities : తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన వసతి, ఉచిత లాకర్ సౌకర్యాలను కల్పిస్తోంది. ఐదు యాత్రికుల వసతి సముదాయాల్లో (PAC) అందుబాటులో ఉన్న సౌకర్యాలు, గదుల కేటాయింపు నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి….
Tirumala Accommodation Facilities : కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ ప్రపంచ నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తిరుమలకు విచ్చేస్తున్నారు. ఈ వేసవి సెలవుల వేళ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వారి సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అనేక వసతులను కల్పిస్తోంది. వసతి, విశ్రాంతి, లాకర్, స్నాన, అన్నప్రసాదం వంటి సదుపాయాలను భారీ స్థాయిలో ఏర్పాటు చేసింది.

వసతి గదుల కేటాయింపు ప్రక్రియ…
తిరుమలలో వసతి పొందాలనుకునే భక్తులు ముందుగా సీఆర్వో (CRO) జనరల్ కౌంటరును సంప్రదించాలి. అక్కడ మీ ఫోన్ నంబర్, గుర్తింపు కార్డు వివరాలను నమోదు చేసుకోవాలి. గది కేటాయించబడగానే…. ఆ గది నంబరు, ఏ ప్రాంతంలో ఉంది అనే వివరాలు మీ మొబైల్‌కు ఎస్ఎంఎస్ ద్వారా అందుతాయి. అనంతరం సంబంధిత ఉప విచారణ కార్యాలయంలో డిజిటల్ పద్ధతిలో (UPI/Card) చెల్లింపు చేసి గదిని పొందవచ్చు.
తిరుమలలో స్థలాభావం వల్ల 7800 గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందుకే కుటుంబాలతో వచ్చే భక్తులకు టీటీడీ తొలి ప్రాధాన్యత ఇస్తుంది. ఒంటరి వ్యక్తులకు లేదా అవివాహిత జంటలకు గదులు కేటాయించరు.
యాత్రికుల వసతి సముదాయాలు (PAC)….
వసతి గదులు లభించని భక్తుల కోసం తిరుమలలో టీటీడీ ఐదు భారీ యాత్రికుల వసతి సముదాయాలను నిర్మించింది. వీటిలో ఉచిత లాకర్లు, విశ్రాంతి గదులు అందుబాటులో ఉన్నాయి.
1. పీఏసీ-1 (గోవర్ధన్ సత్రం ఎదురుగా):
సీఆర్వో సమీపంలో ఉండే ఈ సముదాయంలో 4 పెద్ద హాళ్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 1256 లాకర్లు ఉండగా….. ప్రస్తుతం పునరుద్ధరణ పనుల కారణంగా 870 లాకర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ అన్నప్రసాదం సౌకర్యం కూడా ఉంది.
2. పీఏసీ-2 (మాధవ నిలయం):
బాలాజీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ఈ నిలయంలో 12 హాళ్లు, ఏకంగా 3300 లాకర్లు ఉన్నాయి. ఇక్కడ బస చేసే భక్తులకు అన్నప్రసాదం, తలనీలాలు సమర్పించే సదుపాయం, ప్రథమ చికిత్స కేంద్రం వంటి సౌకర్యాలు ఉన్నాయి.
3. పీఏసీ-3:
జీఎన్సీ టోల్ గేట్ నుండి రాంభగీచా బస్ స్టాండ్‌కు వెళ్లే ఔటర్ రింగ్ రోడ్డులో ఇది ఉంది. ఇందులో 9 హాళ్లు, 1420 లాకర్లు ఉన్నాయి. తలనీలాలు సమర్పించే వీలుంది.
4. పీఏసీ-4 (పద్మనాభ నిలయం):
బాలాజీ బస్ స్టాండ్ లోపల ఉన్న ఈ కేంద్రంలో 3 హాళ్లు, 960 లాకర్లు ఉన్నాయి. ప్రయాణికులకు ఇది ఎంతో అనువుగా ఉంటుంది.
5. పీఏసీ-5 (వేంకటాద్రి నిలయం):
ఇది అత్యంత ఆధునికమైన సముదాయం. 2025 సెప్టెంబర్ 25న దీనిని భారత గౌరవ ఉపరాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రారంభించారు. సీఆర్వో వెనుక ఉన్న ఈ భవనంలో 16 హాళ్లు, 2400 లాకర్లు ఉన్నాయి. అన్ని రకాల వైద్య, ఆహార వసతులు ఇక్కడ లభిస్తాయి.
9336 ఉచిత లాకర్లు.. మరిన్ని సదుపాయాలు…
తిరుమలలోని ఈ ఐదు పీఏసీలలో కలిపి మొత్తం 9336 లాకర్లు భక్తులకు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఉచిత వేడి నీటి స్నాన గదులు, చాపలు, రగ్గుల పంపిణీ, అన్నప్రసాదం మరియు శుద్ధమైన తాగునీరు వంటి సదుపాయాలుంటాయి.
దర్శనం ముగిసిన వెంటనే ఇతర భక్తుల సౌకర్యార్థం లాకర్లను ఖాళీ చేసి, తీసుకున్న చాపలు, రగ్గులను తిరిగి అప్పగించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భక్తులు ఈ ఉచిత సదుపాయాలను వినియోగించుకుని స్వామివారి దర్శనాన్ని ప్రశాంతంగా చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
1. తిరుమలలో వసతి గదులు ఎలా బుక్ చేసుకోవాలి….?
జవాబు: తిరుమలకు చేరుకున్నాక సీఆర్వో (CRO) కౌంటర్ వద్ద మీ వివరాలను నమోదు చేసుకోవాలి. లభ్యతను బట్టి ఎస్ఎంఎస్ ద్వారా గది కేటాయింపు జరుగుతుంది. లేదా టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.
2. ఉచిత లాకర్లను ఎలా పొందాలి?
జవాబు : తిరుమలలోని ఐదు యాత్రికుల వసతి సముదాయాలలో (PAC 1-5) మీ వివరాలు నమోదు చేసి ఉచితంగా లాకర్లను పొందవచ్చు. దీనికోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
3. ఒంటరిగా వచ్చే భక్తులకు గదులు ఇస్తారా?
జవాబు : నిబంధనల ప్రకారం, భద్రతా కారణాల దృష్ట్యా తిరుమలలో ఒంటరి వ్యక్తులకు వసతి గదులను కేటాయించరు. అటువంటి వారు యాత్రికుల వసతి సముదాయాల్లోని (PAC) హాళ్లను వినియోగించుకోవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

