జనవరి 25వ తేదిన రథ సప్తమి వేడుకలను టీటీడీ, జిల్లా, పోలీసు యంత్రాంగం, ఏపీఎస్ ఆర్టీసీ, శ్రీవారి సేవకుల సమిష్టి కృషితో అంగరంగవైభవంగా నిర్వహించామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలియజేశారు. రథ సప్తమి వేడుకలు విజయవంతమవ్వడంతో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడారు. తిరుమలలో భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని గతంలో ఎన్నడూలేని విధంగా భక్తులు తిరుమలకు వస్తున్నారని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, భక్తుల నుండి సేకరించిన అభిప్రాయాలు, సలహాలు, సూచనలతో మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రథ సప్తమి రోజున నిర్విరామంగా కష్టపడిన అర్చక స్వాములు, వాహన బేరర్లు, శ్రీవారి సేవకులకు ధన్యవాదాలు తెలిపారు. వాహనాల రద్దీ నేపథ్యంలో తిరుమలలో మల్టీ లెవెల్ కారు పార్కింగ్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నామన్నారు.
అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ రథ సప్తమి సందర్భంగా భక్తుల నుండి వాట్సాప్, ఐవీఆర్ఎస్, శ్రీవారి సేవకుల ద్వారా అభిప్రాయాలు సేకరించామన్నారు. భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. ఉత్తరమాడ వీధిలో ఒక భక్తుడు కూడా సదుపాయాలు బాగాలేవని చెప్పకపోవడం టీటీడీ కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. పలువురు భక్తులు గ్యాలరీల్లో అదనపు మరుగుదొడ్లు, స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సూచించారని అందుకు తగిన విధంగా చర్యలు చేపడతామని తెలియజేశారు.
సమావేశంలోని కీలక విషయాలు
- గతంలో ఎన్నడూలేనివిధంగా ఈ ఏడాది రికార్డుస్థాయిలో 3.45 లక్షల మంది భక్తులు మాడ వీధుల్లో వాహన సేవలు వీక్షణ. అన్ని విభాగాల సమన్వయంతో రద్దీ నిర్వహణ, భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో సఫలీకృతం.
- రథ సప్తమి రోజున గ్యాలరీల్లోని భక్తులందరికీ ఉదయం నుండి రాత్రి వరకు విరివిగా అన్న ప్రసాదాలు, పానీయాలు పంపిణీ.
- 9.42 లక్షల మందికి అన్న ప్రసాదాలు, 6.30 లక్షల మందికి పానీయాలు, 2.90 లక్షల మందికి పాలు, 2.15 లక్షల మందికి వాటర్ బాటిళ్లు పంపిణీ.
- ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా, పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుని 1800 మంది పోలీసులు, 1414 మంది విజిలెన్స్ సిబ్బంది, 150 మంది ట్రాఫిక్ సిబ్బంది సేవలు వినియోగం.
- గతంలో ఎన్నడూలేని విధంగా 3.56 లక్షల గ్యాడ్జెట్స్, బ్యాగులు లగేజీ కేంద్రాల్లో డిపాజిట్. ఇది గత ఏడాది కంటే 73 శాతం అధికం.
- భక్తులను తిరుమలకు చేరవేయడంలో ఏపీఎస్ ఆర్టీసీ అద్భుతమైన సేవలు. తిరుపతి నుండి తిరుమలకు 1932 ట్రిప్పుల ద్వారా 60425 మంది భక్తులు ప్రయాణించగా, తిరుమల నుండి తిరుపతికి 1942 ట్రిప్పుల ద్వారా 82,241 మంది భక్తులు ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుపతికి వచ్చారు.
- రథ సప్తమి రోజున 23 వేల మంది భక్తులకు వైద్య సేవలు, 94 మందిని అంబులెన్సుల ద్వారా తిరుపతిలోని ఆస్పత్రులకు తరలింపు.