...
...
Next Story

Tirumala : త్వరలో కూరగాయల విరాళాల కోసం తిరుమలలో టీటీడీ ప్రత్యేక పాలసీ, ఆన్‌లైన్ సిస్టమ్

శ్రీవారి అన్న ప్రసాద విత‌ర‌ణ‌లో కూరగాయల దాతల సేవలు అత్యంత కీలకమైన‌వని టీటీడీ అద‌న‌పు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌద‌రి అన్నారు. నాలుగైదు నెలలుగా తిరుమలలో రోజుకు సుమారు 4 లక్షల మందికి అన్నప్రసాదం అందిస్తున్నామని చెప్పారు.

Published on: Aug 19, 2026, 06:30:15 IST
Advertisement

శ్రీవారి అన్న ప్రసాద విత‌ర‌ణ‌లో కూరగాయల దాతల సేవలు అత్యంత కీలకమైన‌వ‌ని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని ప‌ద్మావ‌తి అతిథిగృహంలో సుధ‌ర్మ స‌మావేశ మందిరంలో మంగ‌ళ‌వారం అన్న ప్రసాదాల త‌యారీకి కూరగాయలు విరాళంగా అందిస్తున్నదాతలతో ఆయ‌న స‌మావేశం నిర్వహించారు. అన్న ప్రసాద‌ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కూరగాయల సరఫరా, రవాణా, నిల్వ, వినియోగం, నాణ్యత, భవిష్యత్ అవసరాలు తదితర అంశాలపై దాతలతో చర్చించారు.

తిరుమలలో కూరగాయల దాతలతో సమావేశం
తిరుమలలో కూరగాయల దాతలతో సమావేశం

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గత నాలుగైదు నెలలుగా తిరుమలలో రోజుకు సుమారు 4 లక్షల మందికి అన్నప్రసాదం అందిస్తున్నామని, ఇందుకోసం రోజుకు సుమారు 13–14 టన్నుల బియ్యం, 8 టన్నులకు పైగా కూరగాయలు వినియోగిస్తున్నామని చెప్పారు. ఇంత భారీ స్థాయిలో కూరగాయలను నిరంతరం దాతల ద్వారా సమకూర్చడం విశేషమన్నారు.

గత 25-30 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని ప‌లు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున దాతలు కూరగాయలను అందిస్తున్నారని వెంకయ్య చౌదరి తెలిపారు. ప్రస్తుతం మూడు, నాలుగు రాష్ట్రాల నుంచి సుమారు 30 మంది దాతలు 33 రకాల కూరగాయలను స‌మ‌కూరుస్తున్నార‌ని చెప్పారు.

అన్నప్రసాదం అవసరాలకు అనుగుణంగా ఏ సమయంలో ఏ కూరగాయ ఎంత అవసరమో ముందుగానే ప్రణాళిక రూపొందించి, దాతలతో సమన్వయం చేసుకుని కూరగాయలను స్వీకరిస్తున్నామని వివరించారు. దీంతో కూరగాయల రిజెక్షన్, నష్టాలను గణనీయంగా నియంత్రించగలిగామని చెప్పారు. నాణ్యత, ప్యాకింగ్, రవాణా తదితర అంశాల్లో దాతలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అభినందించారు.

కూరగాయలు త్వరగా పాడయ్యే స్వభావం కలిగినవైనందున వాటి నిల్వ, వినియోగంపై ప్రత్యేక ప్రణాళిక అవసరమని అదనపు ఈవో తెలిపారు. కోల్డ్ స్టోరేజీ సదుపాయాన్ని వినియోగించుకుంటూ, ఎక్కువ కాలం నిల్వ చేయగల కూరగాయలను తగిన విధంగా నిల్వ చేసి, త్వరగా పాడయ్యే కూరగాయలను ముందుగా వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

కూరగాయల దాతలు ఎదుర్కొంటున్న రవాణా, లాజిస్టిక్స్ తదితర సమస్యలను తెలుసుకోవడంతో పాటు, టీటీడీ వైపు నుంచి కూరగాయల స్వీకరణలో ఉన్న సమస్యలను కూడా చర్చించేందుకు ఈ సమన్వయ సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. సమావేశంలో దాతల నుంచి విలువైన సూచనలు అందాయని తెలిపారు.

భవిష్యత్తులో కూరగాయల విరాళాల కోసం ప్రత్యేక పాలసీ, ఆన్‌లైన్ సమన్వయ వ్యవస్థను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎక్కడి నుంచి ఏ కూరగాయ ఎంత అవసరమో రియల్‌టైమ్‌లో ఆన్‌లైన్ ద్వారా దాతలకు తెలియజేయడం, దాతలు కూడా ఆన్‌లైన్‌లో స్పందించే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేస్తే కమ్యూనికేషన్ మరింత వేగవంతం అవుతుందని అన్నారు. దీనివల్ల మరింత మంది దాతలు ఈ మహత్తర సేవలో భాగస్వాములు అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.

రాబోయే రెండు బ్రహ్మోత్సవాల్లోనూ కూరగాయల దాతలు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వచ్చారని అదనపు ఈవో తెలిపారు. తిరుమలలో శనివారం, ఆదివారం రోజుల్లో సుమారు 4.50 లక్షల అన్నప్రసాద పోర్షన్లు పంపిణీ చేస్తున్నామని, రోజుకు సుమారు 19 గంటల పాటు అన్నదానం వంటశాలలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఇంత భారీ స్థాయిలో నిరంతరంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం శ్రీవారి అనుగ్రహంతోనే సాధ్యమవుతోందన్నారు.

అన్న ప్రసాదాల‌కు కూరగాయలను అందిస్తున్న దాతల సేవలను అభినందిస్తూ, వారిని మరింత ప్రోత్సహించేలా టీటీడీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా కూరగాయల దాతలను లడ్డూ ప్రసాదాలతో సత్కరించి, శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు.

రాబోయే బ్రహ్మోత్సవాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు, దాతలు, సేవా సంస్థలు సమన్వయంతో ఒక బృందంగా పనిచేయాలని అదనపు ఈవో పిలుపునిచ్చారు. ఈ స‌మావేశంలో అన్న ప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర, క్యాట‌రింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కూర‌గాయ‌ల దాత‌లు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks