...
...
Next Story

100 ఎకరాల్లో టీటీడీ 'దివ్య వృక్షాల' ప్రాజెక్ట్ - దేశంలోనే తొలిసారి..!

ఆలయ ధ్వజస్తంభాల కోసం దివ్య వృక్షాల ప్రాజెక్టుకు టీటీడీ శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు ద్వారా కాలక్రమేణా మార్పు అవసరమైన ధ్వజస్తంభాల స్థానంలో శాస్త్రోక్తంగా కొత్త ధ్వజస్తంభాలను ఏర్పాటు చేస్తారు.సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో దివ్య వృక్షాల ప్రాజెక్టు కోసం కేటాయించాలని టీటీడీ బోర్డు ప్రతిపాదించింది.

Published on: Dec 14, 2025, 07:14:03 IST
Advertisement

దేశంలోనే తొలిసారిగా ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు దిశానిర్దేశం చేసే దివ్య వృక్షాల ప్రాజెక్టుకు టీటీడీ శ్రీకారం చుట్టింది. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

తిరుమల
తిరుమల

దేవాలయాల్లో ఏర్పాటు చేసే ధ్వజస్తంభాల నిర్మాణానికి అవసరమైన దివ్య వృక్షాలను సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ స్వయంగా పెంచి, పరిరక్షించి వినియోగించనుంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రూపొందించిన తిరుమల అభివృద్ధి లక్ష్యాలకు పూర్తిగా అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఉంటుందని బీఆర్ నాయుడు తెలిపారు. సంప్రదాయాల పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే బాధ్యతాయుత పాలనకు ఇది నిదర్శనమన్నారు.

ఆధ్యాత్మిక ప్రాధాన్యం….

ధ్వజస్తంభం కేవలం నిర్మాణాత్మక అంశం మాత్రమే కాదు. అది భౌతిక లోకానికి, దైవ లోకానికి మధ్య ఉన్న శాశ్వత బంధానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆలయ ప్రాంగణంలో నిటారుగా నిలిచి ఉండే ధ్వజస్తంభం భక్తి, పవిత్రత, దైవ సన్నిధిని ప్రతిబింబిస్తుందని టీటీడీ తెలిపింది.

ఆగమశాస్త్రాల ప్రకారం, ధ్వజస్తంభం నిటారుగా పెరిగిన ఒకే చెట్టుకు చెందిన పవిత్ర వృక్ష కాండంతో తయారు చేయాలి. ఆ వృక్షాన్ని ఆధ్యాత్మిక, జ్యోతిష్య, విధి విధానాలకు అనుగుణంగా ఎంపిక చేసి, సంవత్సరాల తరబడి సంరక్షించి, ఆపై శాస్త్రోక్తంగా కైంకర్యాలు నిర్వహించిన అనంతరం వినియోగిస్తారు.

ఆగమ సంప్రదాయాల ప్రకారం ధ్వజస్తంభాల తయారీలో సాధారణంగా టేకు, ఏగిశా/ ఇండియన్ కినో, టెర్మినేలియా, షోరియా జాతికి చెందిన వృక్షాలను వినియోగిస్తారు. ఇవి బలంగా, దీర్ఘకాలికంగా నిటారుగా పెరిగే స్వభావం కలిగి ఉండటం వల్ల ధ్వజస్తంభం అవసరాలకు అనుకూలంగా ఉంటాయి. పరిపక్వత చెందిన తర్వాత ఆ వృక్షాన్ని శాస్త్రోక్తంగా పూజించి, ఆపై ధ్వజస్తంభంగా రూపకల్పన చేస్తారు. అనంతరం దానిని కవచంతో కప్పి, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం వంటి అత్యంత పవిత్ర ఆలయాల్లో స్వర్ణ కవచంతో అలంకరిస్తారు.

దేశవ్యాప్తంగా 60కి పైగా ఆలయాలను టీటీడీ నిర్వహిస్తోంది. అయితే భవిష్యత్తులో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలను ఆగమ నియమాలకు అనుగుణంగా నిర్మించే బాధ్యతను దృష్టిలో ఉంచుకుని… ఈ దివ్య వృక్షాల ప్రాజెక్టును అత్యంత దూరదృష్టితో ప్రారంభిస్తోంది.

ఈ ప్రాజెక్టు ద్వారా కాలక్రమేణా మార్పు అవసరమైన ధ్వజస్తంభాల స్థానంలో శాస్త్రోక్తంగా కొత్త ధ్వజస్తంభాలను ఏర్పాటు చేస్తారు. భవిష్యత్తులో టీటీడీ నిర్మించనున్న ఆలయాలకు అవసరమైన ధ్వజస్తంభాల కోసం పవిత్రమైన కలపను ముందుగానే సిద్ధం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.

దివ్య వృక్షాల ప్రాజెక్టు వివరాలు…

ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో భాగంగా సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో దివ్య వృక్షాల ప్రాజెక్టు కోసం కేటాయించాలని టీటీడీ బోర్డు ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు అమలుతో, ధ్వజస్తంభాల కోసం అవసరమైన దివ్య వృక్షాలను స్వయంగా పెంచే తొలి దేవాలయ సంస్థగా టీటీడీ దేశంలో చరిత్ర సృష్టించనుంది. దీని ద్వారా ఆగమ శుద్ధి, ఆధ్యాత్మిక పవిత్రత, పర్యావరణ బాధ్యత, సంస్థాగత స్వావలంబనను తరతరాలకు కొనసాగించగలుగుతామని టీటీడీ స్పష్టం చేసింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe