కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. స్వామివారిపై ఉన్న భక్తిప్రపత్తులతో భక్తులు తిరుమల ఆలయంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుబంధ ఆలయాల హుండీలలో నగదు, బంగారంతో పాటు పెద్ద ఎత్తున బియ్యాన్ని కూడా కానుకగా సమర్పిస్తుంటారు. ఇలా హుండీ ద్వారా భక్తులు మొక్కుబడిగా సమర్పించిన మిశ్రమ బియ్యాన్ని ఈ-వేలం (ఆన్‌లైన్ వేలం) ద్వారా విక్రయించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.
జూలై 7న ఈ-వేలం….

మొత్తం 20 లాట్లుగా ఉన్న 7,938 కిలోల మిశ్రమ బియ్యాన్ని 2026 జూలై 7వ తేదీన ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ వేలం ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగనుంది. ఈ వేలానికి సంబంధించిన ఆక్షన్ ఐడీ నంబర్ 26120 గా అధికారులు కేటాయించారు.
ఈ బహిరంగ ఆన్‌లైన్ వేలంలో పాల్గొనాలని భావించే వ్యాపారులు లేదా ఆసక్తి గల వ్యక్తులు రూ.50,000 ధరఖాస్తు రుసుముగా (ఈఎండీ - Earnest Money Deposit) ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ వేలానికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఏపీ ప్రభుత్వ కొనుగోలు అధికారిక వెబ్‌సైట్ http://konugolu.ap.gov.in ను సందర్శించవచ్చు.
వెబ్‌సైట్‌తో పాటు నేరుగా వివరాలు తెలుసుకోవడానికి కూడా టీటీడీ అధికారులు అవకాశం కల్పించారు. తిరుపతిలోని టీటీడీ వేలాల విభాగం జనరల్ మేనేజర్ (జి.ఎమ్) కార్యాలయాన్ని ఫోన్ నంబర్ 0877-2264429 ద్వారా కానీ… లేదా gmauctionsttd@gmail.com ఈ-మెయిల్ ఐడీ ద్వారా కానీ సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని టీటీడీ ప్రధాన ప్రజాసంబంధాల అధికారి (పీఆర్వో) ఒక ప్రకటనలో వెల్లడించారు.