...
...
Next Story

కేంద్ర బడ్జెట్ 2026 : అరుకులోయపై కేంద్రం ప్రత్యేక దృష్టి.. పులికాట్ దగ్గర బర్డ్ వాచింగ్ ట్రైల్స్

కేంద్ర బడ్జెట్ 2026లో టూరిజంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఏపీలోని అరకులోయను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Published on: Feb 1, 2026, 14:27:59 IST
Advertisement

కేంద్ర బడ్జెట్‌లో టూరిజానికి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అరకులోయపై ప్రత్యేక దృష్టిపెట్టారు. అరకులోయ ట్రెక్కింగ్, ఎకో టూరిజం, నైపుణ్యాభివృద్ధి కార్యకలాపాలకు కేంద్రంగా మార్చనుంది ప్రభుత్వం. అంతేకాదు పులికాట్‌లో పక్షులను చూసేందుకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు కానున్నాయి.

అరకు లోయపై కేంద్రం దృష్టి
అరకు లోయపై కేంద్రం దృష్టి

ప్రపంచ స్థాయి ట్రెక్కింగ్ అనుభవాన్ని అందించే సామర్థ్యం, అవకాశం భారతదేశానికి ఉందని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సందర్భంగా పేర్కొంది. పర్యావరణపరంగా స్థిరమైన అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్‌లలో పర్వత మార్గాలు, తూర్పు కనుమలలో అరకు లోయ, పశ్చిమ కనుమలలో పోధిగై మలై(తమిళనాడు), ఒడిశా, కర్ణాటక, కేరళలో కీలకమైన తాబేలు ట్రైల్స్, బర్డ్ వాచింగ్ ట్రైల్స్, 15 పురావస్తు ప్రదేశాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

అరకు లోయను దేశంలోని ప్రధాన ట్రెక్కింగ్ కేంద్రాల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ అన్నారు. పర్వత దారులను మరింత సురక్షితంగా, పరిరక్షణతో రూపొందిస్తామన్నారు. దీనితో పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు భద్రతా, అనుభవపరంగా మెరుగైన సేవలు పొందుతారు. ఈ మేరకు కేంద్రం అరకులో టూరిజాన్ని అభివృద్ధి చేయనుంది. పులికాట్ సరస్సు వెంబడి పక్షులను చూసేందుకు మూడు బర్డ్ వాచింగ్ ట్రైల్స్ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది.

గైడ్ నాణ్యత, పర్యాటక అనుభవాన్ని మెరుగుపరచడానికి ఒక కార్యక్రమాన్ని కేంద్రమంత్రి సీతారామన్ ప్రకటించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సహకారంతో హైబ్రిడ్ మోడ్‌లో ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తారు. 12 వారాల శిక్షణా కోర్సు ద్వారా 20 ఐకానిక్ పర్యాటక ప్రదేశాలలో 10,000 మంది గైడ్‌లకు నైపుణ్యం పెంచడానికి ఒక పైలట్ పథకాన్ని కూడా ఆమె ప్రకటించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆర్థిక మంత్రి వెల్లడించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe