ఏపీ - తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీ జలాల వివాదాలపై కేంద్రం దృష్టి సారించింది. ఆయా అంశాలను చర్చించి పరిష్కరించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

కేంద్ర జల సంఘం ఛైర్మన్ అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటైంది. మరో 12 మంది సభ్యులను నియమించారు. ఏపీ, తెలంగాణతో పాటు కేంద్ర ప్రభుత్వం తరపున పలువురు ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లకు కూడా సభ్యులుగా అవకాశం కల్పించారు.
ఢిల్లీ వేదికగా 2025 జులై 16న జరిగిన ముఖ్యమంత్రుల(ఏపీ - తెలంగాణ) స్థాయి మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర జలశక్తిశాఖ పేర్కొంది. తెలంగాణ, ఏపీ నుంచి పలువురు అధికారులను కమిటీలో సభ్యులుగా నియమించింది.
కమిటీలో సభ్యులు వీరే…
కమిటీ స్వరూపం చూస్తే… ఛైర్మన్ గా కేంద్ర జల సంఘం ఛైర్మన్ ఉంటారు. ఏపీ ప్రభుత్వం తరపున జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సలహాదారు, ఇంజినీర్ ఇన్ చీఫ్, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజినీర్ సభ్యులుగా ఉంటారు. ఇక తెలంగాణ ప్రభుత్వం నుంచి నీటిపారుదలశాఖ సలహాదారు, ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శి, నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సభ్యులుగా ఉంటారు.
ఏపీ - తెలంగాణ మధ్య నెలకొన్న నదీ వివాదాలను పరిష్కరించటమే లక్ష్యంగా ఈ కమిటీ ఏర్పాటైంది. ప్రస్తుతం ఉన్న సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను చూపాల్సి ఉంటుంది. దీని ఆధారంగా 3 నెలలోపు కేంద్రానికి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.
కొనసాగుతున్న ఫిర్యాదుల పర్వం…
ఏపీ - తెలంగాణ మధ్య చాలా ఏళ్లుగా నదీ జలాల వివాదం కొనసాగుతోంది. కృష్ణా, గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఫిర్యాదులపర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏపీ ప్రభుత్వం తలపెట్టాలనుకున్న బనకచర్లను తెలంగాణ సర్కార్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. పలు కారణాల రీత్యా ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏపీ సర్కార్ వెనక్కి తగ్గినప్పటికీ… ఇప్పుడు పోలవరం - నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ ను తెరపైకి తీసుకొచ్చింది. ఇందుకు అనుమతులు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.
మరోవైపు ఏపీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇప్పటికే కేంద్రానికి పలుమార్లు ఫిర్యాదు చేయగా.. ఇటీవలే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జనవరి 5న విచారణ జరిగే అవకాశం ఉంది.
{{/usCountry}}మరోవైపు ఏపీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇప్పటికే కేంద్రానికి పలుమార్లు ఫిర్యాదు చేయగా.. ఇటీవలే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జనవరి 5న విచారణ జరిగే అవకాశం ఉంది.
{{/usCountry}}ఈ అంశాలే కాకుండా.. గోదావరి బేసిన్ లో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన పలు ప్రాజెక్టులను కూడా ఏపీ సర్కార్ తెరపైకి తీసుకువస్తోంది. కొన్ని ప్రాజెక్టులకు పూర్తిస్తాయి అనుమతులు, నీటి కేటాయింపులు లేకుండానే చేపట్టిందని చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే…. కేంద్ర జలశక్తి శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ భేటీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి..? నీటి కేటాయింపులపై ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేది రాబోయే రోజుల్లో తేలనుంది…!