ఇంద్రకీలాద్రిపై వైభవంగా నవరాత్రులు.. లలితా త్రిపుర సుందరిగా కనకదుర్గమ్మ దర్శనం!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఐదోరోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు.

Published on: Oct 15, 2026, 11:26:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన గురువారం నాడు జగన్మాత కనకదుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.

విజయవాడ కనకదుర్గమ్మ
విజయవాడ కనకదుర్గమ్మ

శ్రీచక్ర అధిష్ఠాన దేవతగా, పంచదశాక్షరీ మహామంత్ర స్వరూపిణిగా కొలువొందే శ్రీ లలితా దేవి రూపాన్ని దర్శించుకోవడం విశేష ఫలితాలను ఇస్తుందని భక్తుల నమ్మకం. శ్రీలక్ష్మీదేవి, శ్రీసరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా.. చిరు మందహాసంతో, వాత్సల్యరూపిణిగా చెరకుగడ చేతిలో పట్టుకొని ఉంటుంది. శ్రీలలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చే సమయానికి పరమేశ్వరుడు మహా కామేశ్వరుడిగా, అమ్మవారు మహా త్రిపుర సుందరీదేవిగా పూజలు అందుకుంటారు.

లలితా దేవి ప్రకృతి శక్తికి, మన చుట్టూ ఉన్న పంచభూతాలకు ప్రతీక. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే ఐదు తన్మాత్రలలో అంతర్లీనంగా ఉండే పరాశక్తిగా లలితా దేవిని ఉపాసిస్తారు. ఈ దేవిని ఆరాధించడం వల్ల ఆధ్యాత్మిక పరిపక్వతతో పాటు సాధకులలో సౌమ్యత, చిత్తశాంతి, సర్వవిధ సౌభాగ్యాలు లభిస్తాయని అర్చకులు తెలిపారు.

ఉత్సవాల సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇంద్రకీలాద్రి పై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... 'అమ్మవారిని దర్శించుకోవడం మహాద్భాగ్యంగా భావిస్తున్నాను. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దుర్గగుడి పాలకమండలి, అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నేషనల్ సరస్ ప్రదర్శనకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు విచ్చేస్తుండటం రాష్ట్రానికి దక్కిన గొప్ప గౌరవం.' అని మంత్రి కొండపల్లి పేర్కొన్నారు.

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ కలసి భారీ భద్రతా, రవాణా ఏర్పాట్లు చేశాయి. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు, చిన్నారులతో వచ్చే వారి కోసం ప్రత్యేక క్యూలైన్లు, ఉచిత తాగునీరు, మజ్జిగ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

సిసిటీవీల ద్వారా నిరంతర నిఘా ఉంచుతూ, వేలాది మంది పోలీసులతో బందోబస్తు నిర్వహస్తున్నారు. భక్తుల రద్దీకి తగినట్లుగా కనకదుర్గమ్మ ప్రసిద్ధ లడ్డూ ప్రసాదం నిరంతరాయంగా అందేలా కౌంటర్లు పెంచారు. అమ్మవారి దసరా వేడుకలు విజయవాడ నగరాన్ని ఆధ్యాత్మిక కోలాహలంలో ముంచెత్తుతున్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More