...
...
Next Story

తిరుమల : వర్చువల్ రియాలిటీపై టీటీడీ కసరత్తు - SVBC ఆధ్వర్యంలో మరో ఛానల్..!

టీటీడీ ఆలయాల ప్రాశస్త్యాన్ని తెలియజేసేందుకు వర్చువల్ రియాలిటీ సహకారం తీసుకునే దిశగా తిరుమల తిరుపతి దేవస్థాన కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆలయ ఈవో కీలక ఆదేశాలిచ్చారు. స్థానిక, అనుబంధ ఆలయాల కైంకర్యాల సేవలపై ఎస్వీబీసీ ద్వారా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.

Published on: Jan 4, 2026, 05:15:57 IST
Advertisement

టీటీడీ స్థానిక, అనుబంధ ఆలయాల ప్రాశస్త్యాన్ని భక్తులకు అందించేందుకు వర్చువల్ రియాలిటీ సహకారం తీసుకోవాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులకు సూచించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఉన్నతాధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు.

టీటీడీ ఈవో సమీక్ష
టీటీడీ ఈవో సమీక్ష

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ… టీటీడీ స్థానిక, అనుబంధ ఆలయాల ప్రాశస్త్యం, శిల్ప సౌందర్యం తదితర ప్రధాన అంశాలను భక్తులకు చేరవేసేందుకు అవసరమైతే ఆగుమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ సాయం తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ ను రూపొందించే అంశాన్ని పరిశీలించాలన్నారు.

మరో ఛానల్…!

ఆలయాల శిల్పాలు, చిత్రాలను భక్తులు సెల్ ఫోన్ తో స్కాన్ చేసినట్లు అయితే సంబంధిత పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యాన్ని తెలియజేసేలా నూతన టెక్నాలజీతో అనుసంధానం చేయాలని సూచించారు. అదేవిధంగా తిరుమల శ్రీవారి ఆలయం కైంకర్యాలను ఎస్వీబీసీ ఛానల్ లో అందిస్తున్న తరహాలో టిటిడి స్థానిక ఆలయాలు, అనుబంద ఆలయాల విశిష్టతను భక్తులకు అందించేందుకు అవసరమైతే ఎస్వీబీసీ ఆధ్వర్యంలో మరో ఛానల్ తీసుకువచ్చే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు.

టీటీడీ అనుబంధ, స్థానిక ఆలయాలలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని దిశానిర్దేశం చేశారు. ప్రత్యేక అధికారులు తరచుగా ఆలయాలను సందర్శించి ఆలయాల అభివృద్ధి పనులపై నివేదికలు రూపొందించేలా చర్యలు చేపట్టాలన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టిటిడి ఆలయాలలో అన్నదానం పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అందులోభాగంగా ప్రతి ఆలయానికి జనరల్ అకౌంట్, అన్నదానం కోసం మరో అకౌంట్ తెరిపించి సదరు రెండు అకౌంట్లను ప్రత్యేక అధికారులు పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.

ఇప్పటికే అన్నప్రసాదాల కోసం ఉన్న అకౌంట్లను కొనసాగించాలన్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, సిసిటివీలు, సెక్యూరిటీ, రవాణా, ట్రాఫిక్ తదితర అంశాలపై టీటీడీ సివిఎస్వోతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఆలయాలలో సరైన సమయానికి కైంకర్యాలు, వాహన సేవలకు సంబంధించి, ప్రధాన ఉత్సవాల నిర్వహణ కోసం ముందస్తు ప్రణాళికలు, భక్తులకు వైద్యసేవలు, శ్రీవారి సేవకుల సేవలు, పుష్కరిణిని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. బడ్జెట్, వ్యర్థాల నిర్వాహణ, మరుగుదొడ్లు తదితర అంశాలపై ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు వివరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe