...
...
Next Story

Visakhapatnam AQI : విశాఖలో పూర్ కేటగిరీకి పడిపోయిన గాలి నాణ్యత.. 254కి చేరిన ఏక్యూఐ!

Visakhapatnam AQI : కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) రోజువారీ బులెటిన్ ప్రకారం, విశాఖపట్నంలో గాలి నాణ్యత ఆదివారం పూర్ కేటగిరీకి చేరింది. గాలి నాణ్యత సూచిక అంతకుముందు రోజు 177 నుండి 254కు పెరిగింది. ఈ బులెటిన్ గత 24 గంటల సగటును తెలియజేస్తుంది.

Published on: Oct 25, 2026, 21:24:18 IST
Advertisement

విశాఖపట్నం నగరంలో కాలుష్యం కోరలు చాస్తోంది. వైజాగ్ నగరంలో గాలి నాణ్యత ఆందోళనకరంగా క్షీణించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(CPCB) విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. విశాఖలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఆదివారం ఏకంగా 254కి చేరి పూర్ కేటగిరీకి పడిపోయింది. శనివారం నాడు 177గా ఉన్న ఏక్యూఐ ఒక్కసారిగా పెరగడం విశాఖవాసులను కలవరపెడుతోంది.

విశాఖపట్నం  ఎయిర్ క్వాలిటీ
విశాఖపట్నం ఎయిర్ క్వాలిటీ

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన 15 నగరాల గాలి నాణ్యత వివరాలను CPCB పరిశీలించగా, వాటన్నింటిలోనూ విశాఖపట్నంలోనే అత్యంత దారుణమైన వాతావరణ పరిస్థితులు నమోదయ్యాయి.

విశాఖ వాతావరణంలో PM 2.5 (సూక్ష్మ ధూళి కణాలు) అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్లు అధికారులు తేల్చారు. సీపీసీబీ నిబంధనల ప్రకారం AQI స్థాయి 201 నుంచి 300 మధ్య ఉంటే దానిని ‘పూర్’ కేటగిరీగా పరిగణిస్తారు. ఇలాంటి గాలి పీల్చడం వల్ల సాధారణ ప్రజలతో పాటు శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా ఉన్నవారికి, చిన్నారులకు, వయోవృద్ధులకు శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి.

శనివారం నమోదు అయిన 177 ఏక్యూఐ కూడా రాష్ట్రంలోనే గరిష్టం కాగా.. ఆదివారం శ్రీకాకుళం, రాజమహేంద్రవరంలో 110 నమోదై మోడరేట్ కేటగిరీలో నిలిచాయి. అమరావతి (92), అనంతపురం (54) సహా మిగిలిన 12 నగరాల్లో గాలి నాణ్యత సంతృప్తికరం స్థాయిలోనే ఉంది.

ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైంటిస్ట్ ఎం. శ్రీరంజని విశాఖలో నెలకొన్న పరిస్థితులపై స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అక్టోబర్ ముగుస్తుండటంతో సాయంత్రం వేళల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. దీనివల్ల ధూళి కణాలు గాలిలో పైకి వెళ్లకుండా భూమికి దగ్గరగా పేరుకుపోతాయి. చలికాలంలో ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది.

విశాఖ నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలు నిలిచిపోయినప్పుడు వెలువడే పొగ కాలుష్యాన్ని మరింత పెంచుతోంది. దీనిని నివారించేందుకు ట్రాఫిక్ పోలీసుల భాగస్వామ్యంతో 'స్మార్ట్, ఆటోమేటిక్ సిగ్నలింగ్' వ్యవస్థను అమలు చేయాల్సిన అవసరం ఉంది.

ప్రస్తుతం గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఒక అధికారిక ఎయిర్ మానిటరింగ్ స్టేషన్ అందుబాటులో ఉంది. దీనికి అదనంగా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ తమ సీఎస్ఆర్ నిధుల నుంచి మరో మూడు స్టేషన్లను ఏర్పాటు చేయగా, వాటిని CPCB నెట్‌వర్క్‌లో అనుసంధానించాలని APPCB కోరింది.

విశాఖలో రోజురోజుకు క్షీణిస్తున్న గాలి నాణ్యతపై ‘గ్రేటర్ విశాఖ సిటిజన్స్ ఫోరమ్’, పర్యావరణ స్వచ్ఛంద సంస్థ ‘గ్రీన్ విశాఖ’ ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో పచ్చదనం పెంపొందించడంతో పాటు పారిశ్రామిక ఉద్గారాలపై కఠినమైన నిఘా ఉంచాలని, కాలుష్య నివారణకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks