...
...
Next Story

ఏపీ ప్రభుత్వంతో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు.. రూ.1,41,585 లక్షల కోట్ల పెట్టుబడులు

ఏపీ ప్రభుత్వంతో దిగ్గజ కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. సీఐఐ సదస్సు రెండో రోజు సీఎం సమక్షంలో 12 ఎంఓయూలు జరిగాయి. ఐటీసీ, హీరో మోటార్స్ కార్పోరేషన్ సంస్థలకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.

Published on: Nov 13, 2026, 13:41:52 IST
Advertisement

సీఐఐ భాగస్వామ్య సదస్సులో రెండో రోజూ దిగ్గజ కంపెనీలు ఏపీ ప్రభుత్వంతో పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నాయి. జేఎస్‌డబ్ల్యూ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, గ్రీన్ జెన్, ఎయిర్ ట్రంక్- జేసీకే ఇన్ ఫ్రా, డిక్సన్ టెక్నాలజీస్, కాకినాడ సీపోర్ట్స్ లాంటి ప్రముఖ సంస్థలు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వివిధ ప్రభుత్వ శాఖలతో ఒప్పందాలు చేసుకున్నాయి. అలాగే తొలిసారి పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 కార్యక్రమంలో భాగస్వాములుగా మారుతూ ఐటీసీ, హీరోమోటార్స్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకున్నాయి.

విశాఖ సీఐఐ సమ్మిట్‌లో రెండో రోజు ఎంఓయూలు
విశాఖ సీఐఐ సమ్మిట్‌లో రెండో రోజు ఎంఓయూలు

ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రూ.1,41,585 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి 12 ఒప్పందాలను వివిధ కంపెనీలు చేసుకున్నాయి. ఈ ప్రతిపాదిత పెట్టుబడుల ద్వారా 10,919 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ప్రకాశం జిల్లా కందుకూరులో మైనింగ్ కార్యకలాపాల కోసం జిందాల్ గ్రూప్ రూ.15 వేలకోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ పెట్టుబడి ద్వారా 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. తిరుపతి జిల్లాలో ఆర్బిటల్ డేటా సెంటర్, రాకెట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వంతో అగ్నికుల్ కాస్మోస్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. రూ.510 కోట్ల పెట్టుబడితో 350 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు.

ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో రూ.250 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు హాథోర్ రాకెట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. పునరుద్పాక ఇంధన రంగంలో గ్రీన్ జెన్ రెన్యూబుల్ ఎనర్జీ రూ.8 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఏపీనెడ్ క్యాప్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ రంగంలోనే రూ.6,600 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు గానూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా ఒప్పందం చేసుకుంది. డేటా సెంటర్ క్యాంపస్‌ల ఏర్పాటు, 1400 మెగావాట్ల టెలికామ్ సెంటర్ల ఏర్పాటు కోసం ఐటీ విభాగంతో ఎయిర్ ట్రంక్ ఇండియా- జేసికే ఇన్‌ఫ్రా ఒప్పందం చేసుకుంది. రూ.1,03,018 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో 3,120 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఎయిర్ ట్రంక్- జేసీకే ఇన్ ఫ్రా సంస్థలు ఒప్పందంలో పేర్కొన్నాయి.

రాష్ట్రంలో అమలు చేస్తోన్న ప్రతిష్టాత్మక పీ4 కార్యక్రమానికి సంబంధించి సీఐఐ భాగస్వామ్య సదస్సులో రెండు ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లో 1,120 మంది ట్రిపుల్ ఐటీ విద్యార్ధులకు ఆర్థిక సహకారం అందించేందుకు హీరో మోటార్ కార్పోరేషన్‌తో స్వర్ణాంధ్ర ఫౌండేషన్ ఒప్పందం చేసుకుంది. 10వ తరగతి చదివి ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్ధులకు రూ.2.9 లక్షల చొప్పున స్కాలర్‌షిప్ అందించేలా హీరో మోటార్స్ కార్పోరేషన్ ఈ ఒప్పందం చేసింది. బ్రిజ్ మోహన్ ముంజాల్ స్కాలర్‌షిప్‌లను విద్యార్థులకు అందించేందుకు గానూ రూ.32.48 కోట్ల మేర ఆర్థిక సాయం అందించేలా హీరో మోటార్స్ కార్పోరేషన్ ఈ ఒప్పందం చేసుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా 100 గ్రామాల్లోని 25 వేల మంది బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా ఐటీసీ లిమిటెడ్ స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్‌తో ఒప్పందం చేసింది. 25 వేల మంది బంగారు కుటుంబాలకు జీవనోపాధి, జీవన ప్రమాణాలు పెంచేలా ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి సమక్షంలో కుదిరిన 11 ఎంఓయూలు, 1 జీవో జారీ ద్వారా రూ.1,41,585 కోట్ల పెట్టుబడులు, 10,919 మందికి ఉద్యోగాల జరుగనుంది.

ఒప్పందాలు చేసుకోవటంతో పాటు ప్రాజెక్టులు గ్రౌండింగ్‌పై దృష్టి పెట్టాలని పారిశ్రామిక వేత్తలకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రాజెక్టులు గ్రౌండ్ చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ స్కాలర్‌షిప్ ను 1120 మంది విద్యార్ధులకు ఆర్థిక సహకారం అందించేలా హీరో మోటార్స్ కార్పోరేషన్ ముందుకు రావటం సంతోషదాయకమని అన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks