శ్రీశైలానికి కృష్ణమ్మ పరవళ్లు - గేట్లు ఎత్తే అవకాశం ఉందా..? తాజా పరిస్థితి ఇలా

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. త్వరలోనే శ్రీశైలం గేట్లు తెరిచే అవకాశం ఉంది. 

Published on: Aug 8, 2026, 12:12:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Krishna River Flood Updates : తెలుగు రాష్ట్రాల జీవనాడి కృష్ణమ్మ మళ్లీ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి నిలకడగా వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం జలాశయం నిండు కుండను తలపిస్తోంది. రోజురోజుకూ ఇన్ ఫ్లో గణనీయంగా పెరుగుతుండటంతో ప్రాజెక్టు పరిధిలో సర్వత్రా జలకళ తొణికిసలాడుతోంది.

శ్రీశైలం జలాశయం (ఫైల్ ఫొటో)
శ్రీశైలం జలాశయం (ఫైల్ ఫొటో)

శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి….

శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, తాజాగా అందిన అధికారిక సమాచారం(ఆగస్ట్ 8, ఉదయం 9.30 గంటల రిపోర్ట్) ప్రకారం నీటి నిల్వ ఇప్పటికే 155.265 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా…. ప్రస్తుతం నీటిమట్టం 873.199 అడుగుల వద్ద కొనసాగుతోంది.

ఎగువ ప్రాజెక్టుల నుంచి ప్రస్తుతం శ్రీశైలానికి ఏకంగా 2,02,355 క్యూసెక్కుల మేర భారీ ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు దిగువ ప్రాంతాలకు 8,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో ప్రస్తుతం రోజుకు సగటున 18 నుంచి 20 టీఎంసీల వరకు నీటి నిల్వ పెరుగుతున్నట్లు లెక్కలు సూచిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న ఈ భారీ వరద ఉధృతి మరో మూడు, నాలుగు రోజుల పాటు ఇలాగే కొనసాగితే…. అధికారులు రేడియల్ క్రెస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

నాగార్జునసాగర్‌ వైపు కృష్ణమ్మ…

మరోవైపు శ్రీశైలం నుంచి వస్తున్న ప్రవాహంతో పాటు క్యాచ్‌మెంట్ ఏరియా నుంచి వస్తున్న వరదతో నాగార్జునసాగర్ జలాశయానికి సైతం నీటి చేరుక క్రమంగా పెరుగుతోంది. నాగార్జునసాగర్ మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.050 టీఎంసీలు కాగా…. ప్రస్తుతం ప్రాజెక్టులో 140.845 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా…. ప్రస్తుతం నీటిమట్టం 515.299 అడుగుల వద్ద ఉంది.

ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయానికి 49,983 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు కాగా, దిగువకు 900 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం గేట్లు ఎత్తితే నాగార్జునసాగర్‌కు భారీగా వరద నీరు అవకాశం ఉండటంతో ఉభయ తెలుగు రాష్ట్రాల రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక ఎల్ నినో ప్రభావంతో ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన వర్షాలు మాత్రం లేవు. ఎగువ నుంచి వస్తున్న వరద నీరే ఆశాజనకంగా మారింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు… నీటి సమస్యలు రాకుండా ముందస్తు కార్యాచరణను సిద్ధం చేసుకున్నాయి. ప్రాజెక్టుల్లో ఉన్న ప్రస్తుత నీటిని సాగుతో పాటు తాగు నీటి అవసరాలకు ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై కసరత్తు షురూ చేశాయి. పొదుపుగా నీటిని వినియోగించుకోవటం ఫోకస్ చేస్తున్నాయి.

రాబోయే రోజుల్లో భారీగా వర్షాలు కురిసి…. రాష్ట్రంలోని చిన్న, పెద్ద ప్రాజెక్టులు నిండుకుండలా మారితే… సాగు రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకపోవచ్చు. కానీ అలాకాకుండా సాధారణం కంటే కూడా తక్కువ వర్షపాతం నమోదైతే…. ప్రత్యామ్నాయ పంటలు వేయటమే మంచిదని వ్యవసాయశాఖ సూచిస్తోంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More