ఆగస్టు 7 నుంచి శ్రీశైలం ఆలయంలో వరుణ యాగం.. ఈ తేదీల్లో పలు సేవలు రద్దు

వర్షాల కోసం శ్రీశైలం ఆలయంలో ఆగస్టు 7వ తేదీ నుంచి వరుణ యాగం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలు సేవలను రద్దు చేస్తున్నట్టుగా ఆలయ అధికారులు వెల్లడించారు.

Published on: Aug 6, 2026, 17:41:43 IST
By , Srisailam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

లోక కల్యాణం, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలనే సత్సంకల్పంతో శ్రీశైల మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా అమ్మవార్ల దేవస్థానంలో ‘వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకం’ నిర్వహించేందుకు ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆగస్టు 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు.

శ్రీశైలం
శ్రీశైలం

ఆధ్యాత్మిక క్రతువులో భాగంగా అర్చకులు, వేద పండితులు పాంచాహ్నిక దీక్షతో వరుణయాగాన్ని ప్రారంభిస్తారు. లోకానికి నీటి కొరత లేకుండా చూడాలని కోరుతూ శ్రీ మల్లికార్జున స్వామివారికి సహస్ర ఘటాభిషేకం (వేయి కలశాల జలంతో అభిషేకం) జరిపిస్తారు. అదేవిధంగా జగజ్జనని శ్రీ భ్రమరాంబికా అమ్మవారికి విశేష అర్చనలు, రూపురేఖల పూజలు నిర్వహిస్తారు. ఈ ఐదు రోజుల పాటు క్షేత్రంలో రుద్ర హోమం, వరుణ సూక్త పారాయణాలు, వరుణ జపాలు, ఇతర పావన వైదిక క్రతువులు నిరంతరాయంగా కొనసాగుతాయి.

ఈ ఉత్సవాల్లో భాగంగా ఆగస్టు 10వ తేదీన పుణ్యనది అయిన కృష్ణా నదికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, హారతి నివేదనలు నిర్వహిస్తారు. దానితో పాటు శ్రీశైల క్షేత్రపాలకుడైన నందీశ్వర స్వామికి, గ్రామ దేవత అంకాలమ్మ తల్లికి, వీరభద్ర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరిపిస్తారు. ఇక చివరి రోజైన ఆగస్టు 11వ తేదీన అత్యంత వైభవంగా మహా పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ పంచాహ్నిక యజ్ఞం దిగ్విజయంగా ముగుస్తుంది.

ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని, స్వామి-అమ్మవార్ల కృపాకటాక్షాలు పొందాలని శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ పి. రమేష్ నాయుడు, ఈవో ఎం. శ్రీనివాసరావు సంయుక్తంగా పిలుపునిచ్చారు.

భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలు తాత్కాలికంగా రద్దు చేశారు. యజ్ఞ క్రతువులు, వారాంతపు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయంలో పలు సేవలపై తాత్కాలిక ఆంక్షలు విధించారు. ఆగస్టు 9 నుంచి 11 వరకు దేవస్థానంలో గణపతి హోమం, రుద్ర హోమం, మృత్యుంజయ హోమం, చండీ హోమాలతో పాటు శ్రీ వృద్ధ మల్లికార్జున స్వామివారి ఆలయంలో జరిగే పూజలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు.

ఆగస్టు 9, 10 తేదీలలో భక్తులకు స్వామివారి స్పర్శ దర్శనాన్ని పూర్తిగా రద్దు చేశారు. అలాగే ఆగస్టు 11న ఉదయం, మధ్యాహ్నం వేళల్లో స్పర్శ దర్శనం అందుబాటులో ఉండదు. ఆగస్టు 9 (శనివారం), ఆగస్టు 10 (ఆదివారం) వారాంతాలు కావడంతో గర్భాలయ అభిషేకం, సమూహిక అభిషేకాలను నిర్వహించడం లేదని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. భక్తులు ఈ మార్పులను గమనించి, ఆలయ యాజమాన్యానికి సహకరించాలని కోరారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More