...
...
Next Story

Tirumala Water : తిరుమలలో ప్రస్తుతం 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు

Tirumala Water : తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా దేవస్థానం బోర్డు పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు చాలా రోజుల వరకు సరిపోతాయని టీటీడీ తెలిపింది.

Published on: Oct 29, 2026, 17:43:34 IST
Advertisement

తిరుమలలో భక్తుల నీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ పటిష్ట చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి తిరుమలకు నీటిని సరఫరా చేసే డ్యామ్‌లు, నీటి నిల్వలను పరిశీలించి సమీక్షించారు.

తిరుమలలో నీటి నిల్వలు
తిరుమలలో నీటి నిల్వలు

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలకు నీటి సరఫరా అందించే డ్యామ్‌లను స్వయంగా పరిశీలించి నీటి నిల్వలపై సమీక్షించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు మార్చి, ఏప్రిల్ నెలల వరకు సరిపోతాయని వెల్లడించారు.

ఒకవేళ వర్షాలు కురవని పరిస్థితి ఏర్పడితే చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అధికారులు సమర్పించే నివేదిక ఆధారంగా ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి తగిన నిర్ణయాలు తీసుకుంటామని బీఆర్ నాయుడు చెప్పారు.

ఇటీవల జరిగిన సమావేశంలో తిరుమల నీటి అవసరాల అంశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా, వర్షాలు కురుస్తాయని, నీటి కొరత ఉండదని ఆయన విశ్వాసం వ్యక్తం చేసినట్లు తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కళ్యాణి డ్యామ్ లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు యుద్ధప్రాతిపదికన ప్రణాళికలు రూపొందిస్తామని వెల్లడించారు.

టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. తిరుమలలోని డ్యామ్‌‌లలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలు రాబోయే 150 రోజులకు సరిపోతాయని వివరించారు. తిరుమలలో రోజువారీ నీటి అవసరం 50 లక్షల గ్యాలన్లు కాగా, ఇందులో 50 శాతం టీటీడీ సొంత డ్యామ్‌ల నుంచి, మిగిలిన 50 శాతం కళ్యాణి డ్యామ్ నుంచి వినియోగిస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో కురిసే వర్షాలతో డ్యామ్‌లు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉందన్నారు. అన్ని డ్యామ్‌లు నిండితే సుమారు ఏడాదిన్నర పాటు తిరుమలలో నీటి ఎద్దడి ఉండదని పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో డ్యామ్‌లలో డ్రెడ్జింగ్, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, నీటి సంరక్షణ, డ్యామ్‌ల భద్రతకు సంబంధించి నిర్దిష్ట కార్యాచరణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు నిరంతరాయంగా నీటి సరఫరా అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు నరేష్ కుమార్, శాంతారామ్, ఎస్ఈ వేణు గోపాల్, ఈఈ. సుధాకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks