మేనకోడలి పెళ్లికి వైఎస్ జగన్ బెంగళూరు ప్యాలెస్ ఎందుకు ఇవ్వడం లేదు? అసలు కారణం

కొన్ని రోజులుగా వైఎస్ షర్మిల కుమార్తె అంజలి వివాహ వేదిక గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. బెంగళూరులో పెళ్లికి వైఎస్ జగన్ అనుమతించలేదని చర్చ జరుగుతోంది. దీనికి వైసీపీ నేతలు ఓ కారణం చెబుతున్నారు.

Published on: Oct 23, 2026, 09:40:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

వైఎస్సార్ కుటుంబంలో గత కొంతకాలంగా సాగుతున్న ఆస్తుల వివాదం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె అంజలి వివాహం వేళ.. బెంగళూరులోని యెలహంకలో ఉన్న వైఎస్సార్ కుటుంబ ఆస్తి (ప్యాలెస్) ఉపయోగంపై చోటుచేసుకున్న పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి.

వైఎస్ షర్మిల, వైఎస్ జగన్
వైఎస్ షర్మిల, వైఎస్ జగన్

తన కుమార్తె వివాహాన్ని బెంగళూరులోని యెలహంక ప్యాలెస్‌లో జరిపించేందుకు వైఎస్ షర్మిల ఏర్పాట్లు చేసుకోవాలని భావించినప్పటికీ, అక్కడ పెళ్లికి అనుమతించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేయలేదని కథనాలు వెలువడుతున్నాయి. ఈ అంశంపై జగన్ వర్గం, షర్మిల వర్గాల మధ్య భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.

వైసీపీ చెబుతున్న ప్రధాన కారణాలు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ భద్రతా ప్రోటోకాల్స్ దృష్ట్యా, బెంగళూరు నివాసం అత్యంత సున్నితమైన ప్రాంతం. వివాహం వంటి భారీ వేడుక నిర్వహించినప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు, రాజకీయ ప్రముఖులు, విఐపీలు, మీడియా ప్రతినిధులు తరలివస్తారు. ఇటువంటి చోట నిరంతరం రద్దీ ఉండటం భద్రతకు విఘాతం కలిగిస్తుందని భావిస్తున్నారు. అంతేకాదు తెలియని వ్యక్తులు కూడా ఇంటిలోపలకి వేడుక సమయంలో వస్తుంటారు. ఇదే సెక్యూరిటీ దృష్ట్యా సమస్యలు సృష్టించవచ్చని వైసీపీ చెబుతోంది.

భారీగా వచ్చే అతిథుల వల్ల ఆ నివాస ప్రాంగణానికి సంబంధించిన అంతర్గత విజువల్స్, ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో, బయట సర్క్యులేట్ అయ్యే అవకాశం ఉందని, దీనివల్ల ప్రైవసీకి భంగం వాటిల్లుతుందని జగన్ లేఖ ద్వారా వివరణ ఇచ్చినట్లు వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు తాను నివసించేది బెంగళూరులోనే కాబట్టి.. పులివెందుల, హైదరాబాద్‌లోని తమకు చెందిన ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించేందుకు తనకు ఎలాంటి అభ్యంతర లేదని జగన్ తెలిపినట్టుగా తెలుస్తోంది. అయితే వెడ్డింగ్ కార్డ్స్ కంటే ముందే దీనిపై చర్చ జరిగింది. అప్పుడే జగన్ ఈ విషయాన్ని షర్మిలకు చెప్పారని వైసీపీ అంటోంది.

మరోవైపు వేడుకకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలు హాజరయ్యే అవకాశం ఉన్నందున, జగన్ సొంత నివాసంలోనే కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశాలు లేదా రాజకీయ చర్చలు జరగడం వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యూహాలకు, పొత్తుల సమీకరణాలకు ఇబ్బందిగా మారుతుందన్న కోణం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది.

షర్మిల వర్గం వాదన

మరోవైపు వైఎస్ షర్మిల మద్దతుదారులు ఈ వ్యవహారాన్ని ఆస్తి వివాదం, వ్యక్తిగత పట్టింపులతో ముడిపెట్టి చూస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నప్పుడు పిల్లలిద్దరికీ సమానంగా ఆస్తులు పంచాలని భావించారని, హైదరాబాద్‌లోని లొటస్ పాండ్, బెంగళూరులోని యెలహంక కాంపౌండ్, ఇడుపులపాయ నివాసాల్లో షర్మిలకు భాగస్వామ్యం ఉందన్నది వారి వాదన. భద్రతా కారణాల దృష్ట్యా కుదరదని జగన్ చెప్పినట్టుగా తెలుస్తోంది.

గత ఐదేళ్లుగా జగన్, షర్మిల మధ్య సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్లతో పాటు ఇతర ఆస్తులపై వివాదం నడుస్తోందని, ఈ వ్యవహారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు కూడా విచారణలో ఉందనేది బహిరంగ రహస్యమే. పెళ్లి వేదిక విషయమై ఇరువర్గాల మధ్య విభేదాలు రావడంతో తల్లి వైఎస్ విజయమ్మ స్వయంగా జగన్‌ను ఒప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆయన తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

మరో వేదిక

ఇప్పటికే వివాహ ఆహ్వాన పత్రికలు అందజేసే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, యెలహంక ప్యాలెస్‌లో అనుమతి లభించకపోవడంతో షర్మిల బృందం బెంగళూరు లేదా హైదరాబాద్‌ పరిసరాల్లో విఐపీల భద్రతకు సరిపోయే ప్రత్యామ్నాయ వేదిక కోసం అన్వేషణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More