పీపుల్స్ పల్స్ విశ్లేషణ : లోకేశ్ కు సీఎంగా లైన్ క్లియ‌రా…? చంద్రబాబు అంతరంగం ఏంటి..?

నారా లోకేశ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేసే ప్రక్రియ మొదలయినట్టుంది. ఏపీ అసెంబ్లీకి ఇప్పుడేం ఎన్నికలు లేవు కదా? అంటారేమో! ఏమీ లేదు, తండ్రి నుంచి తనయుడికి అధికార మార్పిడి…! అది సునాయాసంగా జరిగేందుకు పూర్వరంగం సిద్దం చేస్తున్నారు.

Published on: Feb 21, 2026 5:01 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా, తెలుగుదేశం పార్టీలో సంస్థాగతంగా కొన్ని పరిణామాలు వేగంగా చోటుచేసుకుంటున్న తీరు కొత్త సంకేతాలిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేసే పూర్వరంగాన్ని సిద్దం చేస్తున్నారనడానికి ఈ సంకేతాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇంతకాలం అవునో, కాదో అన్నట్టు ప్రచారంలో ఉన్న ఈ విషయంలో లోకేశ్‌కు ‘లైన్ క్లియ ర్‌’ అయినట్టు తెలుస్తోంది.

నారా చంద్రబాబు - లోకేశ్
నారా చంద్రబాబు - లోకేశ్

ఇటీవల కాలంలో ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు, పాలనలో కీలక బదిలీలు`పోస్టింగ్‌లు, పార్టీలో ముఖ్యమైన హోదాలు.... పేరుకే ముఖ్యమంత్రి నియామకాలు తప్ప నిజానికి ఇవన్నీ లోకేశ్ నిర్ణయంతోనే జరుగుతున్నాయి. ప్రతి మంత్రివర్గ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి నివాసంలో మంత్రుల ఇష్టాగోష్టి భేటీ జరుగుతోంది. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండరు, కానీ, లోకేశ్ కేంద్రబిందువుగా ఉంటారు. రాష్ట్రం వివిధ ప్రాంతాల నుంచి సమస్యలతో, అర్జీలతో వచ్చే వారికోసం ముఖ్యమంత్రి నివాసంలో అనధికారికంగా జరిపే ‘జనవాణి’ని కూడా ఆయనకు బదులు లోకేశ్ వింటారు, జనం నుంచి అర్జీలు స్వీకరిస్తారు. అందుకో వ్యవస్థ పనిచేస్తోంది.

ఇప్పుడు కొత్తగా జిల్లాల వారిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలకు వారి కుటుంబ సభ్యులతో కలిపి లోకేశ్ విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆత్మీయ భేటీల్లో వ్యక్తిగత యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడమే కాకుండా ఆయా కుటుంబాల మహిళలకు చీరల బహూకరణ కూడా చేస్తున్నట్టు సమాచారం. మొత్తమ్మీద వారందరినీ మచ్ఛిక చేసుకునే, బంధాలు పటిష్టపరచుకునే ఒక వ్యూహాత్మక కసరత్తు సాగుతోంది. ‘ఐటీ, ఏఐ క్వాంటంతో పాటు మానవ సంబంధాలు, ఆత్మీయ కలయికలూ ముఖ్యమే’ అంటున్నారు లోకేశ్! ఈ భేటీల ప్రక్రియ కష్ణా జిల్లాతో మొద‌లై మెజార్టీ జిల్లాల్లో పూర్త‌యినాయి.

లోకేశ్ ఢిల్లీ పర్యటనలు కూడా ఇటీవల పెరిగాయి. 2014-19 లోనూ రెండేళ్లు ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ అప్పుడీ కరసరత్తు లేదు. ప్రస్తుత ఢిల్లీ పర్యటనల్లో పలువురు కేంద్రమంత్రుల్ని కలవడం, ఇతర ఎన్డీయే పక్షాల యువనేతలతో భేటీలు, ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్‌షాలను చంద్రబాబు దగ్గరుండి కలిపించడం వంటివి ఓ క్రమపద్దతిలో జరుగుతున్నాయి.

ఇంతకీ చంద్రబాబు మనసేంటి….?

లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేసి చంద్రబాబు ఖాళీగా ఉంటారా? అనడం కన్నా ఉండగలరా? అనాలేమో! ఎప్పుడో, ఎక్కడో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నట్టు 1983 నుంచి ‘రోబో’లా పనిచేయడం అలవాటు పడ్డ చంద్రబాబు ఖాళీగా ఉండలేరు. బాబు సలహాదారొకరు లోగడ వ్యాఖ్యానించినట్టు, అధికారంలో, విపక్షంలో ఉన్నపుడే కాదు, దావోస్‌లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, ఇంకెక్కడ ఉన్నా.... రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలుసుకుంటూ ‘ఏదో చేయాలి, చేసేయాలి’ అనేదే ఎప్పుడూ ఆయన్ను తొలుస్తుంటుందన్నది కాదనలేని నిజం.

కొత్త సమీకరణాల్లో రాష్ట్రాన్ని తనయుడికి అప్పగించి తను కేంద్ర రాజకీయాల్లోకి వెళతారా? త్వరలోనే రానున్న రాజ్యసభ ఖాళీల్లో ఒకటి తానే తీసుకొని ఎన్డీయేలో క్రియాశీలమౌతారా? అనుకున్నా, అందుకుగల ఆస్కారం కన్నా, అవరోధాలే ఎక్కువ. సొంత పార్టీ బీజేపీ లోనే ఇతర నాయకుల పెత్తనాలను సుతారమూ ఇష్టపడని ‘మోదీ`షా ద్వయం’ చంద్రబాబు ఢిల్లీ రాజకీయాల్ని అంగీకరిస్తారా? సదరు ద్వయం ఆధిపత్య శకంలో అదంత సాఫీగా సాగదు, ‘మంచిది’ కూడా కాదు. అవసరార్థం పొత్తు కుదుర్చుకున్నారే తప్ప వారు బాబును నమ్మరు! మరి, బాబు ఖాళీగా ఉంటారా…?

సీనియర్ జర్నలిస్ట్ బుద్దామురళి రాసిన ఓ పుస్తకావిష్కరణ సభలో ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ… బాబు గురించి చెప్పిన మాటే ఆయన వైఖరికి నిదర్శనం. 1989 ఎన్నికల ముందు బాబును కలిసిన హరగోపాల్ ‘మీరు అధికారంలో ఇంత బిజీగా ఉంటారు కాదా…, రేపటి ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చేలా లేరు, మరి మీ వ్యాపకం ఏంటి?’ అని అడిగితే, ‘ఏముంది, మీలాగే నిజనిర్దారణ బృందాల‌తో రాష్ట్రమంతా తిరుగుతాం’ అని తడుముకోకుండా బాబు బదులిచ్చారంట. ఇదీ ఆయన తత్వం! కానీ, ఇందుకు పూర్తి విరుద్దమైన మాటొకటి ఏడాది కింద ఆయన నోటి నుంచే వచ్చింది.

2025 మార్చిలో తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, ‘రిటైర్మెంట్ తర్వాత కాలం ఎలా గడుపుతున్నారు అని సోదరుడ్ని అడిగాను, తెలుసుకున్నాను. రేపు నా రిటైర్మెంట్ తర్వాత సమయాన్ని ఖర్చు చేయడమెలా నేనూ ప్లాన్ చేసుకోవాలి కాదా!’ అన్నారు చమత్కారంగా! అయిష్టంగానైనా రిటైర్మెంట్‌కు బాబు సిద్దపడుతున్నారా? ఇదంతా ఎందుకంటే, తాను తప్పుకునే అధికార మార్పిడికి రాజీపడుతున్న చంద్రబాబు తాజా ఆలోచన, మానసిక స్థితిని బట్టే లోకేశ్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది గనుక….!

బాబు, చినబాబు ఒకటి కారు

చంద్రబాబు అపార కీర్తికాంక్ష కలిగిన వాడు. పేరు చిరస్థాయిగా నిలిచేట్టు అమరావతి ఏర్పరచాలి, పోలవరం కట్టాలి.... ఇలాంటివి ఉంటాయి. వాటిని సగంలో లోకేశ్ నాయకత్వానికి అప్పగించేస్తారా….? లేదు, అవి పూర్తిచేశాకే వారసత్వ నాయకత్వమా? దీనికి అంత తేలిక సమాధానం దొరకదు. సీఎంగా లోకేశ్ రూపాంతర ప్రక్రియపై ఇప్పటివరకు బాబు పాటిస్తున్న మౌనం అర్దాంగీకారమా…? విధి లేని ఒప్పుకోలా? ఏదైనా తుది పరిణామం, అంతిమ ఫలితం ఒక్కటే! చినబాబును వీలయినంత సత్వరం ముఖ్యమంత్రి చేయడం. దానికి పార్టీ అంగీకారం లభిస్తుందేమో.... కానీ, కూటమి భాగస్వామి జనసేనాని ఆమోదించాలి.. మరోపక్షం బీజేపీ సహించాలి, దీన్ని అంగీకరించి జనం సహకరించాలి. ఇవన్నీ సజావుగా జరగాలి. తయారు చేయడం కన్నా నాయకులు ‘సహజ లక్షణాల’తో ఉన్నపుడే మన్నిక ఎక్కువ.

అవకాశం వచ్చేదాకా పరిస్థితులను ఆకలింపుచేసుకొని సర్దుకుపోవడంలో నారా చంద్రబాబుకు ఉన్న ఓర్మి, సహనం లోకేశ్‌కు ఉన్నాయా? సంక్షోభ పరిస్థితుల్ని స్వయంగా తట్టుకోగలరా? ఇవన్నీ ప్రశ్నలే! అన్ని ప్రచార పోస్టర్లు, వాణిజ్య ప్రకటనల్లో సీఎం బాబు, డిప్యూటీ సీఎం పవన్‌ల ఫోటోలతో పాటు లోకేశ్ ఫోటో కూడా తప్పనిసరిగా ఉండేట్టు చేసినా జనసేన నుంచి అంతగా వ్యతిరేకత రాలేదు. కానీ, లోకేశ్ ఉప ముఖ్యమంత్రి అవుతారని సామాజిక మాధ్యమాల వేదికగా ఓ వార్త ఆ మధ్య వైరల్ అయినపుడు టీడీపీ - జనసేన మధ్య అభిప్రాయబేధాలు పొడచూపాయి. జనసేనాని పవన్ కల్యాణ్ అలకవహించినట్టూ ప్రచారం జరిగింది. వెంటనే చంద్రబాబు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. అది తప్పుడు సమాచారమని, లోకేశ్ ఉప- ముఖ్యమంత్రి అనేది నిరాధారమైన ప్రచారమని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేసేలా చర్యలు తీసుకున్నారు.

ఇంతటి వ్యూహ చతురత వల్లే చంద్రబాబు ఎన్నో ప్రతికూల పరిస్థితుల్నించి కూడా నెట్టుకురాగలిగారని ఆయన రాజకీయ చరిత్రే చెబుతుంది. ప్రజలెన్నుకున్న ఎన్టీరామా రావును త్రోసిరాజని, 1995లో అధికారమార్పిడికి పాల్పడ్డా..... తరువాత్తరువాతి కాలంలో ఆయన నిలదొక్కుకోవడానికి ఆ చాతుర్యమే కారణం. నిజానికి 1983- 89 మధ్య ఆయనకు పెద్దగా హోదాలు లేకపోయినా తెలుగుదేశం పార్టీలో ఓ తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. కర్షకపరిషత్ అప్పగించినా రాజ్యాంగేతర శక్తిగా ముద్రపడి, వివాదాస్పదమై, న్యాయస్థానాలదాకా వెళ్లి పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. పరిమిత కాలమే ఆ పదవిలో ఉన్నారు. అంతకన్నా ముఖ్యంగా పార్టీలో తన స్థానాన్ని బాబు పదిలపరచుకున్నారు. 1995లో పరోక్షంగా సీఎం పీఠమెక్కిన తర్వాతి 1996, 1998 లోక్‌సభ ఎన్నికలను సవాల్‌గా తీసుకొని పోరాడిన బాబు, మొత్తానికి 1999 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవటం ద్వారా ప్రజామోదాన్నీ పొందినట్టయింది. అంతటి చాతుర్యం లోకేశ్‌లో కనబడదు.

లోకేశ్ మారుతారా….?

‘నిజమే, మేం అప్పుడు (2014- 19) ‘ఇకో చాంబర’లో ఉన్నాం. మాకు వస్తున్న సమాచారానికి, క్షేత్రంలో వాస్తవాలకు మధ్య అంత వ్యత్యాసం ఉన్నట్టు గ్రహించలేకపోయాం. అందుకు వేర్వేరు కారణాలున్నాయి, కడకు మూల్యం కూడా చెల్లించాం’ అని యువగళం పాదయాత్రలో కలిసినపుడు లోకేశ్ స్వయంగా మాతో అన్నమాటలివి. అంటే, 2024 ఎన్నికలకు సుమారు ఏడాది ముందర. అధికారంలో ఉన్నపుడు చుట్టూ ఉండే కోటరీ ఎలా ఉంటుందో తెలిసివచ్చిందన్నట్టు మాట్లాడారు అప్పుడాయన. మరి, ఆ విషయంలో లోకేశ్ నిజంగానే మారారా? ఇప్పుడు మళ్లీ అధికారం చేపట్టారు. కీలక స్థానంలో ఉన్నారు. ప్రజాక్షేత్రం నుంచి వాస్తవాలు గ్రహిస్తున్నారా? ఆయన చూసుకోవాల్సిన రెండు పార్శ్వాలుంటాయి.

ఇంటా, బయటా మద్దతు కూడగట్టే యత్నం వాస్తవికంగా చేస్తున్నారా? మొక్కుబడిగానా? అన్నది కీలకం. ‘ఎన్టీయార్‌ను సహించాం, బాబూనూ సహించాం.... అందుకు కారణాలున్నాయి. ఒకరు రాజకీయ బిక్షపెడితే. మరొకరు సంక్షోభ సమయాల్లోనూ నేతృత్వం వహిచారు. ఇప్పుడు ఎవరెవరో లోకేశ్ పేరు చెప్పి మా మీద, పార్టీలో పెత్తనాలు చెలాయిస్తామంటే చూస్తూ ఎలా ఉండగలం’ అనే టీడీపీ సీనియర్ల మనసు ఆయనకు తెలుస్తోందా? సమయం కోసం చూస్తున్న జూనియర్ ఎన్‌టీఆర్ ఏదో రోజున ‘తెలుగుదేశం నందమూరి పార్టీ, ఏనాటికైనా అది నందమూరి వారిదే’ అనే వాదనతో వచ్చే ఆస్కారాన్ని లోకేశ్ ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటారు? అప్పుడే తెరపైకి రాకపోయినా ఇంటా- బయటా ఇటువంటివీ లోలోపల చర్చకు వస్తున్నాయి. కూటమిలోని మిత్రులు ఎలా స్పందిస్తారో చూడాలి.

‘మరో పదిహేనేళ్లూ కూటమి ప్రభుత్వమే, చంద్రబాబు నాయకత్వమే’ అని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలనే జనసైనికులు జీర్ణించుకోలేరు. అటువంటిది లోకేశ్ ముఖ్యమంత్రిగా, పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఏ మేరకు అంగీకరిస్తారు? పార్టీ శ్రేణులు ఎలా స్వీకరిస్తాయి? చిక్కు ప్రశ్నలు. మరో భాగస్వామి బీజేపీ ఆలోచనలేమిటి? ప్రత్యక్షంగా వారికిది సంబంధించిన వ్యవహారం కాకపోయినా.... మిత్రపక్షాల రాజకీయ వ్యవహారాలను బీజేపీ నాయకత్వం గమనిస్తూ ఉంటుంది, అవసరమైనపుడు ‘స్పందిస్తూ’ ఉంటుంది అనడానికి మహారాష్ట్ర రాజకీయాలు ప్రత్యక్ష ఉదాహరణ! ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తూ రాజకీయ పరిస్థితిని అంచనవేయగల సామర్థ్యం లోకేశ్‌కు తక్షణావసరం.

ఇక బయట జనామోదం విషయానికి వస్తే 2029 ఎన్నికలే గీటురాయి. 2012 లో అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రి అయినపుడు అది ఆయన పేరిట ప్రజలిచ్చిన తీర్పు కాదు. ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్‌కి ఇచ్చిన ప్రజాతీర్పును అలా బదలాయించడంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అయిదేళ్లూ పరిపాలించారు. కానీ, ప్రజామోదం లభించలేదనడానిక తర్వాతి రెండు ఎన్నికల్లోనూ, అంటే ఇప్పటివరకు తిరిగి ముఖ్యమంత్రి కాకపోవడమే నిదర్శనం!

అసలు సవాల్ జగన్ నుంచే!

నేరుగా ప్రజాతీర్పు లేకుండా, నాయకత్వ మార్పిడితో నారా లోకేశ్ ముఖ్యమంత్రి అయినా.... తదుపరి పరీక్ష 2029 ఎన్నికల్లో ఎదుర్కోవాల్సిందే! అక్కడ, ఆయనకు ఎదురయ్యే అతిపెద్ద సవాల్ వై.ఎస్. జగన్మోన్‌రెడ్డి. అనివార్యంగా ఇద్దరి మధ్య పోలిక వస్తుంది. పాలన అందించిన ప్రభుత్వానికి ప్రతినిధిగా ఒకరు, ప్రతిపక్ష స్థానం నుంచి మరొకరు ఎన్నికల బరిలోకి వస్తారు. లోకేశ్ అప్పుడు, ఇప్పుడు తన ప్రసంగాల్లో తీసిపారేసినట్టు మాట్లాడినా, రాజకీయంగా జగన్ ఒక అసాధారణ శక్తి. కిందటి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 151 నుంచి 11 స్థానాలకు పడిపోయినా 40 శాతం ఓటు వాటా కలిగి ఉండటాన్ని ఎవరూ విస్మరించడానికి లేదు. పైగా జగన్మోహన్‌రెడ్డికి నిర్దిష్ట ఓటు బ్యాంకులే కాకుండా బలమైన సామాజికవర్గ మద్దతు, విస్తృత‌ పార్టీ వ్యవస్థ, ఒకప్పటి కాంగ్రెస్ శ్రేణుల దన్ను దండిగా ఉన్నాయి. ఆయనకు సహజంగా ఉన్న జగమొండి, పట్టుదల కలవాడనే పేరుకుతోడు ‘పేదల పక్షపాతి’ అనే ఇమేజ్ ఉంది. అవన్నీ తట్టుకొని తెలుగుదేశం పార్టీని విజేతగా నిలపడం లోకేశ్ కు అంత తేలికయిన వ్యవహారం కాదు!

వ్యాపారాల్లోనే తప్ప పోరాటాల్లో లోకేశ్‌కు అనుభవం లేదు, ‘హై`ఫై’ అనే తప్ప ‘డవున్ టు ఎర్త’ అన్న ఇమేజూ లేదు. అవసరమని భావిస్తే… జగన్ నిరంతరం జనం మధ్య ఉంటాడు. పోగొట్టుకున్నంత వేగంగా జనం మద్దతు కూడగట్టగలడు. ముఖ్యమంత్రుల తనయులకు ముఖ్యమంత్రులయ్యే యోగం లేని తెలుగునాట స్వీయ పోరాటాలతో ముఖ్యమంత్రి అయిన చరిత్ర జగన్ ఒక్కడికే ఉంది. పీవీ నర్సింహారావు (రంగారావు- రాజేశ్వరరావు) నుంచి జలగం వెంగళ్‌రావు (ప్రసాదరావు- వెంకట్రావ్), ఎన్టీరామారావు (హరికృష్ణ- బాలకృష్ణ), మర్రి చెన్నారెడ్డి (శశిధర్‌రెడ్డి), నాదెండ్ల భాస్కరరావు (మనోహర్), నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి (రామ్‌కుమార్ రెడ్డి), కోట్ల విజయభాస్కరరెడ్డి (సూర్యప్రకాశ్‌రెడ్డి) వరకు ఎందరో ముఖ్యమంత్రులైన వారి తనయులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినా ఎవరూ ముఖ్యమంత్రి కాలేకపోయారు ఒక్క జగన్మోహన్‌రెడ్డి (వై.ఎస్.రాజశేఖరరెడ్డి) తప్ప!

తాజా సభలో ఉన్న అసాధారణ సంఖ్యాబలం మద్దతు, వ్యవహారదక్షతతో తనయుడు లోకేశ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నపళంగా ముఖ్యమంత్రిని చేయగలరు. అయితే, రెండు పరీక్షలు తప్పవు. ఒకటి, కూటమి మిత్రపక్షాల మనసు నొవ్వకుండా అధికార మార్పిడి జరిపించడం. రెండు, వచ్చే 2029 ఎన్నికల్లో ప్రజాక్షేత్రాన్ని గెలవటం.

ఆంధ్రప్రదేశ్ ఓ విలక్షణ సమాజం. ఇవాళ అది మరింత ‘ఆశావహ’సమాజంగా తయారయింది. పౌరులకు ఆర్థిక మేళ్ల పరంగా ప్రభుత్వాలు ఎంత చేసినా, తదుపరి ఏంటి? అని ఎదురుచూసే వైఖరి పెరిగింది. సమాజపరంగా.... ఏ ఇద్దరు ఎదురయినా ‘కుశల ప్రశ్నలు’ కాకుండా ‘కులం సంగతులు’ మాట్లాడే స్థాయికి చేరింది. మరోవైపు యువత రాజకీయాలపై నిరాసక్తతతోనే ఉన్నారు. అప్పుడే పుట్టే పిల్లలెవరూ ‘కేర’మనటం లేదు ‘కెరీర్‌’ అంటున్నారని ఏపీలో జోకులేసుకుంటారు. ఈ సామాజిక పరిస్థితులకు తోడు రాజకీయ పక్షాలు కూడా ప్రత్యర్థులుగా కాకుండా వైరి శిబిరాలుగా మారాయి. రేపటి ఎన్నికల సమరంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలకు తోడు, లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర హామీలు అమలు కాకపోవడాన్నీ జగన్ ఎత్తి చూపుతారు. ఇవాళ చంద్రబాబుకు, రేపు లోకేశ్‌కు పరీక్షా కాలం.

విశ్లేషణ : దిలీప్ రెడ్డి, పొలిటికల్ ఎనలిస్టు, డైరెక్టర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ.

దిలీప్ రెడ్డి, పొలిటికల్ ఎనలిస్టు, డైరెక్టర్, పీపుల్స్ పల్స్ రిసెర్చి సంస్థ.
దిలీప్ రెడ్డి, పొలిటికల్ ఎనలిస్టు, డైరెక్టర్, పీపుల్స్ పల్స్ రిసెర్చి సంస్థ.

(గమనిక: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణలు, వ్యూహాలు రచయిత వ్యక్తిగతం. హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు (హెచ్‌టీ తెలుగు)వి కావు. వీటికి హెచ్‌టీ బాధ్యత వహించదు)

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More