ఏపీ, తెలంగాణలో సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. ఈ రోజుల్లో జాగ్రత్త!
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో చలి రోజురోజుకు పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోతున్నాయి. తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి.
ఏపీలోని కొన్ని ప్రాంతాలు చలి గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతున్నాయి. చలి పరిస్థితుల మధ్య అల్లూరి సీతారామ రాజు జిల్లా ఏజెన్సీలో ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతోంది. ఈ తగ్గుదల ఈ నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అనేక మండలాల్లో ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి.

జనాలు విపరీతమైన చలి కారణంగా ఎక్కువగా ఇళ్లలోనే ఉండిపోతున్నారు. మంటలకు దగ్గరగా ఉంటున్నారు. ఏఎస్ఆర్ జిల్లాలోని అనేక ప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పేసింది. ఉదయంపూట ఎటు వెళ్లలేని పరిస్థితి. పొగమంచుతో దారులు సరిగా కనిపించడం లేదు. ఆదివారం జి మాడుగులలో 5.3 డిగ్రీల సెల్సియస్, ముంచింగిపుట్టులో 7.7 డిగ్రీలు, అరకు వ్యాలీలో 8.9, లంబసింగిలో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చింతపల్లె వద్ద 9.5 డిగ్రీలుగా నమోదైంది. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం గడ్డకట్టే పరిస్థితులు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఆదివారం విశాఖ నగరంలో అత్యల్ప ఉష్ణోగ్రత 17.4 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు చలిగా భావించారు. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో ఆదివారం 15.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా తీరప్రాంతం, రాయలసీమ ప్రాంతాలలో ఆదివారం కనిష్ట ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయాయి. రాబోయే రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది.
దిత్వా తుపాను, వర్షపాతం కారణంగా నవంబర్‌లో పర్యాటకుల రాక తగ్గిందని ఏఎస్ఆర్ జిల్లాలోని స్థానికులు తెలిపారు. మళ్లీ పర్యాటక రాక పెరుగుతుందని భావిస్తున్నారు.
అంతకుముందు నవంబర్ 19వ తేదీన చింతపల్లెలో ఈ సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత 6.8 డిగ్రీలుగా నమోదైంది. జనవరి 8, 2023లో చింతపల్లెలో 1.5 డిగ్రీల సెల్సియస్‌ని తాకింది. ఉదయం వేళల్లో ప్రయాణికులు ఎటైనా వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కప్పేస్తుంది. రహదారులు కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
తెలంగాణలో ఇలా
తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 16వ తేదీ దాకా చలి గాలులు వీస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. రాబోయే 7 రోజుల్లో చలిగాలులకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. డిసెంబర్ 10 నుంచి 13వ తేదీ మధ్య చలిగాలులు ఎక్కువగా ఉంటాయన్నారు. తాజాగా ఉదయంపూట అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి.
సంగారెడ్డిలో 6.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అసిఫాబాద్ 6.6, ఆదిలాబాద్ 6.8, వికారాబాద్ 7.8, కామారెడ్డి 8.2, నిజామాబాద్ 8.4, మెదక్ 8.4, రంగారెడ్డి 8.4, సిద్దిపేట 8.9, నిర్మల్ 9.0, సిరిసిల్ల 9.2 ఉష్ణోగ్రతలు ఈ ఉదయం నమోదు అయ్యాయి.
భాగ్యనగరంలోనూ చలి వణికిస్తోంది. శేరిలింగంపల్లి 8.4, రాజేంద్రనగర్ 10.1, అల్వాల్ 10.6, బీహెచ్ఈఎల్ 10.6, ఆర్సీ పురం 12.2, నేరెడ్‌మెట్ 12.4, చందానగర్ 12.4, కంచన్‌భాగ్ 13.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


