గుంటూరు నుంచి చర్లపల్లికి వస్తున్న రైలులో దారుణం - కత్తితో బెదిరించి మహిళపై దుండగుడు అత్యాచారం..!
ఏపీలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. గుంటూరు నుంచి పెద్దకూరపాడు మధ్య రన్నింగ్ ట్రైన్ లో మహిళపై అత్యాచారం జరిగింది. కత్తితో బెదిరించిన దుండగుడు… హ్యాండ్ బ్యాగ్, సెల్ ఫోన్, డబ్బులు లాక్కొని అత్యాచారానికి ఒడిగట్టాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
గుంటూరు నుంచి చర్లపల్లి వస్తున్న రైలులో దారుణం జరిగింది. 35 ఏళ్ల మహిళను కత్తితో బెదిరించిన ఓ దుండగుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఈనెల 13వ తేదీన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మహిళపై అత్యాచారం (representative image)
ప్రాథమిక వివరాల ప్రకారం…. అక్టోబర్ 13న రాజమహేంద్రవరానికి చెందిన మహిళ చర్లపల్లికి వెళ్లేందుకు సంత్రగచి స్పెషల్ ఎక్స్ ప్రెస్ ఎక్కింది. ఆమె లేడీస్ కోచ్ లో ఉన్నారు. కొన్ని స్టేషన్ల తర్వాత తర్వాత ప్రయాణికులు అందరూ ఖాళీ అయ్యారు. గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద రైలు ఆగగానే 40 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి కోచ్ వద్దకు వచ్చి తలుపు తెరిచే ప్రయత్నం చేశాడు.
అతని రాకను గమనించిన సదరు మహిళ.. లేడీస్ కోచ్ అని చెప్పే ప్రయత్నం చేసింది. తలుపు లాక్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ… అతను ఆ డోర్ ను తెరవమని బ్రతిమాలాడు. కోచ్ లోకి ప్రవేశించిన తర్వాత లోపలి నుంచి మూసివేశాడు. గుంటూరు, పెద్దకూరపాడు రైల్వే స్టేషన్ల మధ్య రైలు వెళుతుండగా ఆ వ్యక్తి కత్తితో బెదిరించి… అత్యాచారం చేశాడని సదరు మహిళ ఫిర్యాదు చేసింది.
తప్పించుకున్న నిందితుడు…
నిందితుడు ఆమెను కొట్టి రూ.5,600 నగదు, మొబైల్ ఫోన్ ను దోచుకున్నాడు. రైలు పెద్దకూరపాడు రైల్వే స్టేషన్ వద్దకు వస్తుండగా నిందితుడు దూకి తప్పించుకున్నాడు. చర్లపల్లికి చేరుకున్న బాధిత మహిళ… ఘటనపై ఫిర్యాదు చేసింది. సికింద్రాబాద్ రైల్వే పోలీసులను ఆశ్రయించింది.
ఫిర్యాదు ఆధారంగా తదుపరి దర్యాప్తు కోసం ఈ సంఘటనకు సంబంధించి 'జీరో ఎఫ్ఐఆర్' (నేరం జరిగిన ప్రదేశంతో సంబంధం లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసి) నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని నడికుడి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.
News/Andhra Pradesh/గుంటూరు నుంచి చర్లపల్లికి వస్తున్న రైలులో దారుణం - కత్తితో బెదిరించి మహిళపై దుండగుడు అత్యాచారం..!
News/Andhra Pradesh/గుంటూరు నుంచి చర్లపల్లికి వస్తున్న రైలులో దారుణం - కత్తితో బెదిరించి మహిళపై దుండగుడు అత్యాచారం..!