ఆంధ్రప్రదేశ్ పేరు మార్పు కోసం రిక్వెస్ట్.. కొత్త పేరు ఏంటో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ పేరు మార్పు కోసం ప్రపంచ తెలుగు మహాసభ నుంచి ఓ రిక్వెస్ట్ వచ్చింది. కొత్త పేరు పెట్టాలని పలువురు కోరారు.

Published on: Mar 1, 2026, 15:11:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలనే కొత్త విజ్ఞప్తి వచ్చింది. తెలుగునాడుగా మార్చాలని 3వ ప్రపంచ తెలుగు మహాసభ నుండి కొత్త స్వరం వినిపించింది. తమిళం మాట్లాడే రాష్ట్రాన్ని తమిళనాడును ఏర్పాటు చేశారు. కాబట్టి తెలుగు మాట్లాడేవారి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను తెలుగు నాడుగా మార్చాలని తెలుగు మహాసభలో రిక్వెస్ట్ వచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలోని కిమ్స్‌ మెడికల్‌ కళాశాల ప్రాంగణంలో గోదావరి గ్లోబల్‌ యూనివర్సిటీ ఛైర్మన్‌ చైతన్యరాజు ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే తెలుగు మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, గరికిపాటి నరసింహారావు, చాగంటి కోటేశ్వరరావు, నటుడు తనికెళ్ల భరణి, పలువురు ప్రతినిధులు హాజరయ్యారు.

తెలుగు కేవలం ఒక భాష కాదని, మన సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర, సాహిత్యం, కళలు, ఉనికికి ప్రతీక అని ఒడిశా గవర్నర్ హరిబాబు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావాలని, తెలుగు భాష వైభవాన్ని చాటి చెప్పాలన్నారు. మాతృభాష తెలుగు.. మన గౌరవం, ఐక్యతకు ఆధారం అని అన్నారు. ప్రతి తెలుగు వ్యక్తి తెలుగు భాష పరిరక్షణ, అభివృద్ధిని తమ వ్యక్తిగత బాధ్యతగా భావించాలని చెప్పారు.

తెలుగు సాహిత్యం, సంగీతం, నాటకం, కళలను ప్రపంచానికి పరిచయం చేయాలని హరిబాబు అన్నారు. యువతలో తెలుగు పట్ల ప్రేమ, గౌరవం పెంపొందించాలని చెప్పారు. మూడో ప్రపంచ తెలుగు మహాసభల స్ఫూర్తితో తెలుగు భాష బలపడితే, మన సంస్కృతిని తదుపరి తరానికి అందించడం మన కర్తవ్యమని అన్నారు.

ప్రాచీన తెలుగు సాహిత్యం నుండి నేటి ఆధునిక సాహిత్యం వరకు జరిగిన పరిణామాలను గుర్తుంచుకోవాలని, ఈ సమావేశాలు మాతృభాషను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలని అయ్యన్న పాత్రుడు అన్నారు. కూచిపూడి నృత్యం, జానపద కళలు, తెలుగు ప్రజల ప్రత్యేక జీవనశైలిని ప్రపంచానికి పరిచయం చేయాలని సూచించారు. డిజిటల్ యుగంలో కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లలో తెలుగు వినియోగాన్ని పెంచడానికి మార్గాలను అన్వేషించాలని అన్నారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ను తెలుగునాడుగా పేరు మార్చాలని ప్రపంచ తెలుగు మహాసభల్లో విజ్ఞప్తి వచ్చింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More