మెడికల్ కాలేజీలను చంద్రబాబు అమ్మేస్తున్నాడు - వైఎస్ జగన్ విమర్శలు
సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేయడమే అతి దరిద్రమైన పని అని దుయ్యబట్టారు. ఏడాదికి 5వేల కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలు పూర్తి అవుతాయని…. కానీ చంద్రబాబు వాటిని అమ్మేస్తున్నాడని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో పోరాడేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పిలుపునిచ్చారు. గురువారం పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ….. కల్మషం లేని రాజకీయాలు ఉన్నాయని చెప్పుకునే పరిస్థితి రావాలంటే దానికి బీజం పడాల్సింది యువతలోనే అన్నారు. రాజకీయాల్లో యువతంతా తులసి మొక్కల్లా ఎదగాలని… యువత గట్టిగా అడుగు వేస్తే దేశాల్లో గవర్నమెంట్లే మారిపోతున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఒకలెక్కా….? అని ప్రసంగించారు.
చంద్రబాబు వచ్చాక అవన్నీ ఆగిపోయాయి - జగన్
“ఓటు హక్కు లేదు కనుక విద్యార్థుల గురించి ఏ రాజకీయ నాయకుడు ఆలోచించడు. ఇంగ్లీష్ మీడియం నుంచి నాడు నేడుదాకా వారి గురించి అడుగులు వేసింది వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే. ప్రభుత్వ బడులు ప్రైవేటు స్కూళ్లతో పోటీ పడేలా ఉన్నప్పుడే పేదవాడి జీవితం మారుతుంది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ను ఇంప్రూవ్ చేశాం. తల్లిదండ్రులకు పిల్లల చదువులు భారం కాకూడదనే ఉద్దేశంతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, విద్యాదీవెన, వసతి దీవెన తెచ్చాం. కానీ చంద్రబాబు వచ్చాక అన్నీ ఆగిపోయాయి” అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
“2018-19లో జీఈఆర్ (Gross Enrolment Ratio) రేషియో 27.86 శాతం ఉంటే వైసీపీ హయాంలో 37 శాతానికి పెరిగింది. ఫీజులు కట్టలేక ఇప్పుడది మళ్లీ రివర్స్ అయింది. మన ప్రభుత్వ హయాంలో 6,31,000 ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలోనే ఇచ్చాం. ఇవి కాక ఎంఎస్ఎంఈలకు చంద్రబాబు పెట్టిన బకాయిలు తీర్చి రాయితీలు ఇవ్వడంతో, కార్పొరేట్ సంస్థల కంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలను MSMEలే కల్పించాయి” అని వైఎస్ జగన్ గుర్తు చేశారు.
“డేటా సెంటర్ కి సంబంధించి చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నాడు. సింగపూర్ నుంచి డేటా విశాఖకు తేవడానికి అవసరమైన కేబుల్ ను ఏర్పాటు చేసింది వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలోనే. 2022లోనే 300 మెగావాట్లకు సంబంధించిన అదానీ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేశాం” అని జగన్ చెప్పుకొచ్చారు.
“చంద్రబాబు చేస్తున్న అతి దరిద్రమైన పని మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేయడమే. తాను మంచి చేయకపోగా చెడు చేస్తున్నాడు. మెడికల్ కాలేజీల వల్ల టీచింగ్ హాస్పటల్ అందుబాటులోకి వచ్చి పేదలు, మధ్యతరగతికి ఉచిత వైద్య సేవలు లభిస్తాయి. ఈ 17ప్రభుత్వ మెడికల్ కాలేజీల వల్ల 2,550 మెడికల్ సీట్లు వస్తాయి. ఇప్పటికే 7 కాలేజీలూ పూర్తి అయ్యాయి, ఏడాదికి 5వేల కోట్లు ఖర్చు చేస్తే మిగతా 10 మెడికల్ కాలేజీలు పూర్తి అవుతాయి కానీ చంద్రబాబు వాటిని అమ్మేస్తున్నాడు” అని జగన్ ఆరోపించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

