AP Local Body Elections : స్థానిక పోరులో ఉద్రిక్తతలు… సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ, రేపు విచారణ

ఆంధ్రప్రదేశ్‌లో మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల వేళ హింస చెలరేగిందని, తమ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారంటూ వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ప్రత్యేక బెంచ్ బుధవారం విచారణ జరపనుంది.

Published on: Oct 20, 2026, 14:54:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ , పురపాలక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. రాష్ట్రంలో చెలరేగిన హింసాత్మక ఘటనల కారణంగా తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారని, ఈ నేపథ్యంలో నామినేషన్ల గడువును పొడిగించాలంటూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ..
సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ..

వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఈ కీలక పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టి తగిన ఉత్తర్వులు జారీ చేయనుంది.

హైకోర్టు ఆదేశాలపై అప్పీల్

నామినేషన్ల సమయాన్ని మరో రోజు పొడిగించేందుకు నిరాకరిస్తూ అక్టోబర్ 18న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రాష్ట్రంలో యథేచ్ఛగా జరిగిన హింస కారణంగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేయకుండా ప్రత్యర్థులు అడ్డుకున్నారని పిటిషన్‌లో ప్రధానంగా ఆరోపించింది.

భద్రత కల్పించాలని విజ్ఞప్తి

అభ్యర్థులకు తగిన పోలీసు భద్రత కల్పించాలని, నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు పెంచాలని వైఎస్సార్‌సీపీ న్యాయస్థానాన్ని కోరింది. అంతేకాకుండా అభ్యర్థులు ఎలాంటి భయభ్రాంతులు లేకుండా సురక్షితంగా తమ పత్రాలను సమర్పించేందుకు వీలుగా అదనపు కేంద్రాలతో పాటు ప్రత్యామ్నాయ నామినేషన్ కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించింది.

పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తరఫున అడ్వకేట్ మహఫూజ్ అహసన్ నజ్కీ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. అక్టోబర్ 16న ప్రారంభమై అక్టోబర్ 18న ముగిసిన నామినేషన్ల ప్రక్రియలో తమ పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులపై భౌతిక దాడులు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. నామినేషన్ కేంద్రాలకు చేరుకోకుండా భయానక వాతావరణం సృష్టించి వారిని దారిలోనే అడ్డుకున్నారని తెలిపింది.

కాగా…. నామినేషన్ల గడువు అప్పటికే ముగిసిపోయిందని, ఈ సమయంలో గడువు పెంచడం అంటే ఎన్నికల ప్రక్రియ జోక్యం చేసుకోవడమే అవుతుందని స్పష్టం చేస్తూ ఏపీ హైకోర్టు వైఎస్సార్‌సీపీ అభ్యర్థనను కొట్టివేసింది. దీంతో ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా…. బుధవారం జరిగే విచారణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More