...
...
Next Story

డీలిమిటేషన్‌కు వైసీపీ సపోర్ట్ చేస్తుందా? లేదా? HT ఇంటర్వ్యూలో మిథున్ రెడ్డి ఏం చెప్పారు?

Delimitation Bill : ఇప్పుడు దేశం మెుత్తం నియోజకవర్గాల పునర్విభజన(Delimitation Bill) బిల్లు గురించే చర్చ నడుస్తోంది. మరీ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష వైఎస్ఆర్‌సీపీ డీలిమిటేషన్‌కు సపోర్ట్ చేస్తుందా?

Updated on: Nov 28, 2026, 14:45:09 IST
Advertisement

వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి డీలిమిటేషన్‌పై మాట్లాడారు. హిందుస్థాన్ టైమ్స్‌తో జరిగిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. తాము గతంలో బీజేపీని, ఎన్నికల నిర్వహణ తీరును విమర్శించామని గుర్తుచేశారు. అలాగే ఈవీఎంల(EVMs) విషయంలో కూడా ఆందోళనలు వ్యక్తం చేశామని పేర్కొన్నారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చెప్పిన సమాధానాలు చూడండి.

గతంలో వైఎస్‌ఆర్‌సీపీ డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చింది. ఇప్పుడు ఆ వైఖరిలో ఏమైనా మార్పు ఉందా?

మిథున్ రెడ్డి
మిథున్ రెడ్డి

గతసారి మేం బిల్లుకు అనుకూలంగానే ఓటు వేశాం. సీట్ల సంఖ్యలో 50 శాతం దామాషా పద్ధతిలో పెరుగుదల ఉండటమే అందుకు కారణం. కేంద్రం మాకు ఈ మేరకు హామీ ఇచ్చింది. ఈసారి దానిని బిల్లులో చేర్చారు. సూత్రప్రాయంగా మాకు దీనిపై అభ్యంతరం లేదు, అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని లేవనెత్తాలనుకుంటున్నాం. దీనివల్ల ప్రాంతీయ అసమానతలు మరింత పెరగకూడదు.

ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వంటి అంశాలపై వైఎస్‌ఆర్‌సీపీ గతంలో కేంద్రాన్ని విమర్శించింది. ఇప్పుడు ఈ చట్టానికి మద్దతు ఇవ్వడం ద్వారా, మీరు ప్రభుత్వానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నట్లు కాదా?

ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. మొదటిది మహిళా రిజర్వేషన్లు, దీనికి మేం ఎప్పుడూ మద్దతు ఇస్తూనే వచ్చాం. బీజేపీ అధికారంలో ఉన్నా లేకపోయినా, మేము మహిళా రిజర్వేషన్లను సమర్థిస్తూనే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్‌లో మేం అధికారంలో ఉన్నప్పుడు, స్థానిక సంస్థలన్నింటిలోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాం. ఇది రాష్ట్ర పరిధిలోని అంశం. సీట్ల సంఖ్యలో 50 శాతం పెరుగుదల ఉన్నంత వరకు, మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడతాయి. ఒకవేళ ఈ ప్రక్రియ పూర్తిగా జనాభా ప్రాతిపదికన మాత్రమే జరిగితే, మనకు నష్టం జరుగుతుంది. దామాషా పద్ధతిలో 50 శాతం సీట్ల పెంపు అనేది ఆంధ్రప్రదేశ్‌కు సమంజసమని మేం భావిస్తున్నాం.

ప్రతిపక్ష కూటమి 'ఇండియా' (INDIA - Indian National Developmental Inclusive Alliance) ఈ బిల్లును వ్యతిరేకించింది. వారి వైఖరిని మీరు ఎలా చూస్తారు?

మాకు జాతీయ రాజకీయాలతో పెద్దగా సంబంధం లేదు. మా రాష్ట్రం, దాని ప్రయోజనాలపై ప్రభావం చూపే అంశాల పట్ల మాత్రమే మాకు ఆందోళన ఉంది. మాకు తగిన సంఖ్యాబలం ఉంటే, కేంద్రమే మాతో మాట్లాడుతుంది. తగిన సంఖ్యాబలం లేకుండా జాతీయ రాజకీయాల్లో ప్రయత్నించడం వల్ల ప్రయోజనం లేదు. భవిష్యత్తులో మాకు మరిన్ని స్థానాలు లభిస్తాయని ఆశిస్తున్నాం.

ఈ బిల్లుపై చర్చించేందుకు ప్రభుత్వం మిమ్మల్ని సంప్రదించిందా?

ప్రభుత్వం మమ్మల్ని సంప్రదించింది. గతంలో కూడా మేం దీనిపై సుదీర్ఘంగా చర్చించాం. మళ్ళీ వారితో మాట్లాడే అవకాశం ఉంది. ప్రతిపక్షాల నుంచి మాత్రం ఎటువంటి సంప్రదింపులు లేవు.

కేంద్రం పరిష్కరించాలని మీరు కోరుకుంటున్న నిర్దిష్ట అంశాలు ఏమిటి?

ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర అనే మూడు ప్రాంతాలు ఉన్నాయి. సీట్ల కేటాయింపులో ఈ ప్రాంతాల మధ్య ఉన్న నిష్పత్తి అలాగే కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. జనాభా మార్పుల కారణంగా కరువు పీడిత ప్రాంతాలకు దక్కే ప్రాతినిధ్యం తగ్గిపోకూడదు.

ఈ ఏడాది దక్షిణ రాష్ట్రాలు కూడా కరువు సమస్యలను ఎదుర్కొన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) అంశంతో పాటు, ఈ సమస్యల గురించి కూడా మీరు కేంద్రంతో చర్చిస్తున్నారా?

మేం ఈ రెండు అంశాలను కలపడం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మేం నిరంతరం పోరాడుతున్నాం. ఎన్డీఏ(NDA)లో భాగస్వామిగా ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌కు తగినన్ని నిధులు అందలేదు. అంతేకాకుండా రాజధాని పేరుతో భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు ఢిల్లీలో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు సుమారు రూ.3,500 - రూ.4,000 ఉంటే, అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం చదరపు అడుగుకు రూ.20,000 ఖర్చు చేస్తోంది.

అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భవనానికి పక్కనే, కేంద్ర ప్రభుత్వం మరొక భవనం కోసం టెండర్లు పిలిచింది. అక్కడ నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు సుమారు రూ.3,500గా ఉంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుకు మాత్రం చదరపు అడుగుకు రూ.18,000 - రూ.20,000 ఖర్చవుతోంది. మేం ఈ సమస్యలను లేవనెత్తుతూ వస్తున్నాం, ఇకముందు కూడా ఇలాగే కొనసాగిస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతికి సంబంధించిన పలు ఆందోళనకర అంశాలు ఉన్నాయి.

తమ పార్టీ ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) చట్టానికి మద్దతు ఇస్తున్నట్లుగా ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. దీనికి కారణం మహిళా రిజర్వేషన్లకు మద్దతు తెలపడం, ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశమే తప్ప బీజేపీతో జతకట్టడం కాదని ఆయన స్పష్టం చేశారు.

 

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks