...
...
Next Story

Aamir Khan: నెలకు 38 లక్షలతో 3 లగ్జరీ ఫ్లాట్లు రెంట్‌కి తీసుకున్న ఆమిర్ ఖాన్- మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆస్తుల వివరాలు ఇవే!

Aamir Khan Leases 3 Luxury Flats And Net Worth: బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మూడు విలాసవంతమైన అపార్ట్‌మెంట్లను అద్దెకు తీసుకున్నారు. నాలుగేళ్ల కాలపరిమితితో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం ఆయన నెలకు రూ.38 లక్షల అద్దె చెల్లించనున్నారు. కోట్లల్లో డీల్ చేసే ఆమిర్ ఖాన్ ఆస్తుల వివరాలపై లుక్కేద్దాం.

Published on: Nov 21, 2026, 10:10:52 IST
Advertisement

Aamir Khan Leases 3 Luxury Flats And Net Worth: బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ సినిమాల విషయంలోనే కాదు, నివాసాల ఎంపికలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ముంబై నగరంలోని అత్యంత ఖరీదైన ఖార్-శాంతాక్రజ్ (వెస్ట్) ప్రాంతంలో ఆయన ఏకంగా మూడు విలాసవంతమైన అపార్ట్‌మెంట్లను లీజుకు తీసుకున్నారు.

నెలకు 38 లక్షలతో 3 లగ్జరీ ఫ్లాట్లు రెంట్‌కి తీసుకున్న ఆమిర్ ఖాన్- మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆస్తుల వివరాలు ఇవే!
నెలకు 38 లక్షలతో 3 లగ్జరీ ఫ్లాట్లు రెంట్‌కి తీసుకున్న ఆమిర్ ఖాన్- మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆస్తుల వివరాలు ఇవే!

శాంతాక్రజ్ వెస్ట్‌లోని 'సీజన్స్ త్రిమూర్తి' భవనంలో ఉన్న ఈ మూడు ఫ్లాట్లకు కలిపి ఆమిర్ ఖాన్ నెలకు రూ.38 లక్షల అద్దె చెల్లించనున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, కోకాపేట వంటి ఖరీదైన ప్రాంతాల్లో ఒక విలాసవంతమైన విల్లా లేదా ఫ్లాట్ కొనుగోలు చేసేంత మొత్తాన్ని ఆమిర్ ఖాన్ కేవలం ఏడాది అద్దె రూపంలో వెచ్చిస్తుండటం ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థాయికి అద్దం పడుతోంది.

12,200 చదరపు అడుగుల విస్తీర్ణం.. 9 కార్ల పార్కింగ్

ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పత్రాలను విశ్లేషించిన 'సీఆర్ఈ మ్యాట్రిక్స్' (CRE Matrix) సంస్థ ఈ భారీ డీల్ వివరాలను వెల్లడించింది. లీవ్ అండ్ లైసెన్స్ ఒప్పందాల ప్రకారం ఆమిర్ ఖాన్ తీసుకున్న మూడు ఫ్లాట్ల మొత్తం కార్పెట్ ఏరియా 12,200 చదరపు అడుగులుగా ఉంది. వీటిలో అతిపెద్ద అపార్ట్‌మెంట్ 6,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, మిగిలిన రెండు ఫ్లాట్లు చెరో 3,000 చదరపు అడుగుల చొప్పున ఉన్నాయి.

పెద్ద ఫ్లాట్‌కు నెలకు రూ.20 లక్షల అద్దె నిర్ణయించగా, మిగతా రెండు యూనిట్లకు చెరో రూ.9 లక్షల చొప్పున అద్దె చెల్లించేలా ఒప్పందం కుదిరింది. వెరసి నెలకు రూ.38 లక్షల చొప్పున, తొలి ఏడాదిలో ఆయన చెల్లించే వార్షిక అద్దె రూ.4.56 కోట్లకు చేరుతోంది. అంతే స్థాయిలో పార్కింగ్ సదుపాయాలు కూడా ఉన్నాయి. ఒక్కో అపార్ట్‌మెంట్‌కు మూడు చొప్పున, మూడు ఫ్లాట్లకు కలిపి మొత్తం 9 కార్ల పార్కింగ్ స్థలాలను కేటాయించారు.

నాలుగేళ్ల ఒప్పందం.. కఠిన నిబంధనలు

సొసైటీ మెయింటెనెన్స్, నీటి ఛార్జీలతో పాటు ప్రస్తుత, భవిష్యత్ ఆస్తి పన్నులు, మున్సిపల్ పన్నులన్నీ నెలవారీ అద్దెలోనే కలిసి ఉంటాయి. ఆ భారాన్ని ఇంటి యజమాని (లైసెన్సర్) భరిస్తారు. అపార్ట్‌మెంట్ల నిర్మాణంలో ఎలాంటి మార్పులు చేయకూడదని, శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదని ఒప్పందంలో స్పష్టమైన నిబంధనలు విధించారు. ఈ వ్యవహారంపై స్పందించేందుకు ఆమిర్ ఖాన్ గానీ, డెవలపర్ గానీ అందుబాటులోకి రాలేదు.

పాలీ హిల్‌లో పాత లీజు..

ఆమిర్ ఖాన్ భారీ మొత్తానికి ఇళ్లను అద్దెకు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. ముంబైలో పాత నివాస సముదాయాల రీడెవలప్‌మెంట్ పనులు జోరుగా సాగుతుండటంతో, బడా సెలబ్రిటీలు తాత్కాలికంగా ఖరీదైన అద్దె ఇళ్లలోకి మారుతున్నారు. 2025 మే నెలలో ఆమిర్ ఖాన్ ముంబైలోని పాలీ హిల్ ప్రాంతంలో నాలుగు అపార్ట్‌మెంట్లను నెలకు రూ.24.5 లక్షల అద్దెకు తీసుకున్నారు.

ఐదేళ్ల కాలానికి కుదిరిన ఆ ఒప్పందం 2030 మే వరకు కొనసాగుతుంది. దానికి 45 నెలల లాక్-ఇన్ పీరియడ్ ఉండగా, రూ.1.46 కోట్లకు పైగా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించారు. ఆ ఒప్పందంలోనూ ఏటా 5 శాతం అద్దె పెంపు నిబంధన ఉంది.

షారుఖ్ ఇంటికి సమీపంలోనే!

ఆసక్తికరమైన విషయమేమిటంటే, పాలీ హిల్‌లో ఆమిర్ ఖాన్ అద్దెకు తీసుకున్న నివాసం, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తాత్కాలిక నివాసానికి కేవలం 750 మీటర్ల దూరంలోనే ఉంది. షారుఖ్ తన ఐకానిక్ బంగ్లా 'మన్నత్' మరమ్మతు పనులు జరుగుతున్న కారణంగా అక్కడ అద్దెకు ఉంటున్నారు. ఒకే ప్రాంతంలో ఇద్దరు అగ్ర హీరోలు పక్కపక్కనే నివసించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.

ఆమిర్ ఖాన్ సొంత ఆస్తులు.. పంచగని ఫామ్‌హౌస్

అద్దె ఇళ్లతో పాటు ఆమిర్ ఖాన్‌కు సొంతంగా కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. 2024 జూన్‌లో పాలీ హిల్ ప్రాంతంలోనే 1,027 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను ఆయన రూ.9.75 కోట్లకు కొనుగోలు చేశారు. 'స్క్వేర్ యార్డ్స్' (Square Yards) విశ్లేషించిన రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం, ఆ కొనుగోలుకు రూ.58.5 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు.

ముంబై రణగొణధ్వనులకు దూరంగా ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు మహారాష్ట్రలోని ప్రముఖ హిల్ స్టేషన్ పంచగనిలో ఆమిర్ ఖాన్‌కు సొంత ఫామ్‌హౌస్ ఉంది. సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో పచ్చని వాతావరణం మధ్య ఉన్న ఈ విలాసవంతమైన ఫామ్‌హౌస్ విలువ దాదాపు రూ.7 కోట్లు ఉంటుందని అంచనా.

ఆమీర్ ఖాన్ నెట్ వర్త్

సినిమాల ఒత్తిడి నుంచి విరామం దొరికినప్పుడల్లా ఆయన కుటుంబంతో కలిసి అక్కడే గడుపుతుంటారు. ఇక అమీర్ ఖాన్ నెట్ వర్త్ సుమారుగా రూ. 1867 కోట్లు ఉంటుందని అంచనా. రెమ్యునరేషన్, ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో అన్ని కలిపే ఈ మొత్తం ఉంటుందని సమాచారం.

 

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks