...
...
Next Story

Oscar OTT Rules: ఓటీటీలో డైరెక్ట్ రిలీజయ్యే సినిమాలకు బ్యాడ్ న్యూస్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న ఆస్కార్ అధికారులు!

Oscar New Rules On OTT Release Movies: ఓటీటీల్లో డైరెక్ట్ రిలీజయ్యే సినిమాలకు ఆస్కార్ అవార్డ్స్ నిర్వాహకులు పెద్ద షాక్ ఇచ్చారు. గోవాలో జరిగిన 57వ ఇఫ్ఫి వేదికగా అకాడమీ ఉన్నతాధికారిణి నటాలీ వేడ్ పలు కీలక విషయాలు చెప్పారు. భారతీయ చిత్రాలకు ఉన్న అవకాశాలు, భారీ ఫీజుల భారం, ఏఐ నిబంధనలను తెలిపారు.

Published on: Nov 29, 2026, 13:05:43 IST
Advertisement

Oscar New Rules On OTT Release Movies: ప్రపంచ సినీ రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే ఆస్కార్ బరిలో నిలవాలని ప్రతి దర్శక నిర్మాత కలలు కంటారు. అయితే కేవలం ఓటీటీ (OTT) వేదికల్లో మాత్రమే విడుదలయ్యే సినిమాలకు ఆస్కార్ తలుపులు మూసుకుపోయినట్లే.

ఆస్కార్ సీనియర్ అధికారిణి కామెంట్స్

ఓటీటీలో డైరెక్ట్ రిలీజయ్యే సినిమాలకు బ్యాడ్ న్యూస్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న ఆస్కార్ అధికారులు!
ఓటీటీలో డైరెక్ట్ రిలీజయ్యే సినిమాలకు బ్యాడ్ న్యూస్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న ఆస్కార్ అధికారులు!

అమెరికా థియేటర్లలో విడుదలైతేనే ఆస్కార్ బరిలో నిలిచే అర్హత ఉంటుందని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సీనియర్ అధికారిణి నటాలీ వేడ్ తేల్చి చెప్పారు. గోవాలో జరిగిన 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI)లో నిర్వహించిన ప్రత్యేక మాస్టర్ క్లాస్‌లో ఆమె పాల్గొన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమల్లో ఒకటైన భారతీయ సినిమాకు ఆస్కార్ వేదికపై ఎందుకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కడం లేదన్న నటాలీ వేడ్ సమాధానమిచ్చారు. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ హవా పెరుగుతున్న తరుణంలో ఓటీటీ సినిమాలకు అవకాశం ఇస్తారా అన్న ప్రశ్నకు నటాలీ వేడ్ స్పష్టతనిచ్చారు.

థియేటర్ అనుభూతికే అకాడమీ పెద్దపీట

"ఈ నిబంధన ఇప్పట్లో మారుతుందని మేం అనుకోవడం లేదు. థియేటర్ రిలీజ్ అనేది మా సభ్యుల హృదయాలకు ఎంతో దగ్గరైన అంశం" అని నటాలీ వేడ్ పేర్కొన్నారు. దీంతో నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు అమెరికాలో థియేట్రికల్ రిలీజ్ లేకుండా ఆస్కార్ పోటీలో నిలవడం అసాధ్యమని తేలిపోయింది.

మరోవైపు సినీ రంగంలో కృత్రిమ మేధ (AI) వినియోగంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ, మానవ సృజనాత్మకతకే అకాడమీ అండగా నిలుస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. ఏదైనా ప్రాజెక్టులో మనిషి మేధస్సు ఎంతవరకు ఉందన్న అంశాన్ని నిబంధనల ప్రకారం పరిశీలిస్తామని వివరించారు.

భారీ ఫీజుల భారంతో ప్రాంతీయ సినిమాలకు ఇబ్బంది

10 మిలియన్ డాలర్ల కంటే తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలకు 8 వేల డాలర్ల (సుమారు రూ. 7,40,221) ప్రత్యామ్నాయ రేటు అందుబాటులో ఉంది. అయితే ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్, యానిమేటెడ్, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్ విభాగాలకు ఈ స్క్రీనింగ్ రూమ్ ఉచితమే.

తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీసే తెలుగు సహా ఇతర భారతీయ ప్రాంతీయ, స్వతంత్ర చిత్ర నిర్మాతలకు ఈ 8 వేల డాలర్లు కూడా పెద్ద మొత్తమే. ప్రాంతాల వారీగా ఫీజుల్లో రాయితీ ఇవ్వాలన్న సూచనను ఆమె స్వాగతించారు. "అది చాలా మంచి సూచన. మా కమిటీలు ప్రతి ఏటా నిబంధనలను సమీక్షిస్తాయి. కాబట్టి ఇప్పుడున్న నిబంధనలు వచ్చే ఏడాది మారవచ్చు" అని నటాలీ వేడ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

కేవలం ఒకే విభాగంపై ఆధారపడొద్దు.. 'ఆర్ఆర్ఆర్' స్ఫూర్తి

భారతీయ సినీ వర్గాల్లో ఒక అపోహ ఉందని, అందరూ కేవలం 'ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' విభాగం వైపే చూస్తున్నారని వేడ్ అభిప్రాయపడ్డారు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసే అధికారిక ఎంట్రీ దక్కకపోయినా నిరాశ పడాల్సిన అవసరం లేదని సూచించారు. ఆసక్తి ఉన్న నిర్మాతలు నేరుగా జెనరల్ ఎంట్రీ, ఉత్తమ చిత్రం (Best Picture) విభాగాల్లో పోటీ పడవచ్చని తెలిపారు.

జెనరల్ క్యాటగిరీలో ఆర్ఆర్ఆర్

2022లో భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా గుజరాతీ చిత్రం 'ఛెల్లో షో' ఎంపికవ్వగా, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' (RRR) సొంతంగా జెనరల్ కేటగిరీలో ప్రచారం చేసుకుని 'నాటు నాటు' పాటకు ఆస్కార్ సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. తనకు ఇష్టమైన భారతీయ చిత్రం 'ఆర్ఆర్ఆర్' అని నటాలీ వేడ్ ప్రత్యేకంగా ప్రశంసించారు.

2024లోనూ పాయల్ కపాడియా 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' కాదని 'లాపతా లేడీస్'ను పంపడంపై విమర్శలు వచ్చాయి. ఇప్పటివరకు ఏడు దశాబ్దాల్లో 'మదర్ ఇండియా', 'సలాం బాంబే', 'లగాన్' చిత్రాలు మాత్రమే నామినేషన్ల వరకు వెళ్లాయి.

అకాడమీలో పెరగాల్సిన భారతీయ ప్రాతినిధ్యం

ప్రస్తుతం అకాడమీ సభ్యుల్లో 75 శాతం మంది అమెరికాకు చెందిన వారే ఉండగా.. మిగిలిన 25 శాతం మంది ఇతర దేశాల నుంచి ఉన్నారు. ఇందులో భారతీయుల సంఖ్య కేవలం 60 చుట్టూనే ఉంది. ఈ సంఖ్య ఏమాత్రం సరిపోదని, అంతర్జాతీయ సంస్థగా ఎదిగేందుకు అన్ని దేశాల సభ్యులను చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నామని వేడ్ తెలిపారు.

భారతీయ సభ్యుల సిఫార్సుతో కొత్తవారు అకాడమీ సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కాగా 2028 మార్చిలో జరగనున్న 100వ ఆస్కార్ వేడుకలను ప్రపంచవ్యాప్త ఉత్సవంగా నిర్వహిస్తామని, ఆ ఏడాది నుంచి స్టంట్ డిజైన్ (Stunt Design) కోసం కొత్త విభాగాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆస్కార్ సీనియర్ అధికారిణి నటాలీ వేడ్ ప్రకటించారు.

 

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks