చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.
పెళ్లి ఫొటోల్లో తెలుగు హీరోయిన్- ప్లాస్టిక్ సర్జరీ అంటూ ట్రోలింగ్- రక్తమాంసాలతో పుట్టిన మనిషినేనంటూ జాస్మిన్ కౌంటర్
Jasmin Bhasin Slams Plastic Surgery Trolling: ఓ వివాహ వేడుకలో తెలుగు హీరోయిన్ జాస్మిన్ భాసిన్ ఫోటోలు చూసి నెటిజన్లు ప్లాస్టిక్ సర్జరీ, బొటాక్స్ అంటూ ట్రోల్ చేశారు. దీనిపై జాస్మిన్ తనదైన శైలిలో ఇన్స్టాగ్రామ్ వేదికగా చురకలు అంటించారు. దాంతో జాస్మిన్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Jasmin Bhasin Slams Plastic Surgery Trolling: సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీల ఆహార్యంపై నెటిజన్లు భూతద్దం పెట్టి మరీ విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. హిందీ బుల్లితెర సీరియల్స్, బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితురాలైన నటి జాస్మిన్ భాసిన్ తాజాగా ఇలాంటి విమర్శలనే ఎదుర్కొన్నారు.

పనిగట్టుకుని ప్రచారం
కోల్‌కతాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో జాస్మిన్ భాసిన్ దిగిన ఫోటోలు బయటకు రాగానే, ఆమె ముఖం మారిపోయిందంటూ కొందరు నెటిజన్లు పనిగట్టుకుని ప్రచారం మొదలుపెట్టారు. ఆమె బొటాక్స్, ఫిల్లర్స్, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారంటూ కామెంట్లు పెట్టడంతో జాస్మిన్ తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఇటీవల రాఘవ్ శర్మ సోదరుడి వివాహ వేడుకలకు జాస్మిన్ హాజరయ్యారు. గులాబీ రంగు లెహంగాలో మెరిసిపోయిన ఆమె, తన ప్రియుడు అలీ గోనీతో పాటు బిగ్ బాస్ విజేతలు మునావర్ ఫారూఖీ, ఎల్విష్ యాదవ్‌లతో కలిసి సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయితే వేడుకల సంగతి పక్కన పెట్టిన కొందరు నెటిజన్లు, జాస్మిన్ ముఖ కవళికల్లో మార్పు వచ్చిందంటూ ఊహాగానాలు మొదలుపెట్టారు.
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికైనా సమయం కావాలి కదా!
తన రూపంపై వస్తున్న వరుస కామెంట్లపై జాస్మిన్ భాసిన్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా వ్యంగ్యంగా స్పందించారు. "నా ముఖం కొంచెం భిన్నంగా కనిపించిన ప్రతిసారీ నేను కొత్తగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లే ప్రచారం చేస్తున్నారు" అని ఆమె చురకలు అంటించారు. ఒక మనిషి ముఖం ఎప్పుడూ ఒకేలా ఉండటానికి గల కారణాలను ఆమె వివరంగా చెప్పారు.
మేకప్ ఆర్టిస్టులతో
"మిత్రులారా, కాస్త శాంతించండి. నేను నిరంతరం ప్రయాణాలు చేస్తుంటాను, నాకు సరిపడా నిద్ర ఉండదు. వేర్వేరు మేకప్ ఆర్టిస్టులతో పనిచేస్తుంటాను. నాకు సైనస్ సమస్య తిరగబెట్టినప్పుడు ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుంది. అలసట, కొత్తగా మొదలుపెట్టిన స్ట్రెంత్ ట్రైనింగ్, కొద్దిగా బరువు పెరగడం వంటివన్నీ ముఖంపై ప్రభావం చూపుతాయి" అని జాస్మిన్ స్పష్టం చేశారు.
శారీరక స్థితిని బట్టి ముఖం మారుతుందని, కొన్ని రోజులు నాజూగ్గా కనిపిస్తే, మరికొన్ని రోజులు అలసటతో ఉబ్బినట్లు అనిపిస్తుందని వివరించారు. కొన్ని సందర్భాల్లో తన మేకప్ కూడా ముఖంపై నిలబడటానికి ప్రాణాలతో పోరాడుతుంటుందంటూ ఆమె చలోక్తి విసిరారు. ప్లాస్టిక్ సర్జరీ పుకార్లను నేరుగా ప్రస్తావిస్తూ.. "అసలు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికైనా కాస్త సమయం దొరకాలి కదా!" అని ఆమె ఎద్దేవా చేశారు.
నేను రక్తమాంసాలతో పుట్టిన మనిషినే.. నన్ను ఊపిరి పీల్చుకోనివ్వండి!
ప్రతి ఫోటోలోనూ తాను ఒకేలా కనిపించాలనే నిబంధన ఏమీ లేదని జాస్మిన్ ఘాటుగా బదులిచ్చారు. "నేను రక్తమాంసాలు, కండరాలు, ఎముకలతో పుట్టిన సాధారణ మనిషిని. రోజురోజుకూ నా రూపంలో మార్పులు కనిపించడం సహజం" అని జాస్మిన్ భాసిన్ పేర్కొన్నారు. నెటిజన్ల విమర్శలు తన ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం దెబ్బతీయలేవని జాస్మిన్ తేల్చి చెప్పారు.
"నా ముఖం అంటే నాకు ఎంతో ఇష్టం. నా శరీరాన్ని, నన్ను నేను ప్రేమిస్తున్నాను. నా రూపం పట్ల నేను సంతోషంగా ఉండటానికి ప్రతిరోజూ పర్ఫెక్ట్గా కనిపించాల్సిన అవసరం లేదు" అని జాస్మిన్ రాసుకొచ్చారు. తన ఫోటోలను భూతద్దంలో పెట్టి విశ్లేషించడం ఆపాలని కోరుతూ.. "దయచేసి.. ఈ మనిషిని కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోనివ్వండి" అంటూ ఆమె తన పోస్ట్‌ను ముగించారు. జాస్మిన్ చేసిన ఈ వ్యాఖ్యలకు అభిమానుల నుంచి భారీ మద్దతు లభిస్తోంది.

సినిమాలతో పాటు రియాలిటీ షోలలోనూ జోరు
వ్యక్తిగత విషయాలపై ట్రోలింగ్ ఎదురవుతున్నా, కెరీర్ పరంగా జాస్మిన్ భాసిన్ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. హిందీ టెలివిజన్ రంగంలో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ఆమె, ప్రస్తుతం పంజాబీ చిత్ర పరిశ్రమలోనూ సత్తా చాటుతున్నారు.
గాయకుడు, నటుడు గులాబ్ సిద్ధూ సరసన ఆమె నటించిన పంజాబీ చిత్రం 'జుదా' (Judaa) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేమ, ఎడబాటు, హృదయ వేదన వంటి భావోద్వేగాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. మరోవైపు ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సాహసోపేత రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ 15'లోనూ జాస్మిన్ పాల్గొంటున్నారు.
జాస్మిన్ భాసిన్ తెలుగు సినిమాలు
ఈ షోలో జాస్మిన్ భాసిన్ కనిపించడం ఇది మూడోసారి కావడం విశేషం. ఇదిలా ఉంటే, జాస్మిన్ భాసిన్ దిల్లున్నోడు, వేట, లేడీస్ అండ్ జెంటిల్మెన్ వంటి 3 తెలుగు సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించారు.

E-Paper
