...
...
Next Story

Swara Bhasker: 56 రోజులు షూటింగ్, డైరెక్టర్ వేధింపులు, కెరీర్ కోసం మౌనంగా భరించా.. నటి స్వర భాస్కర్ కామెంట్స్

Swara Bhasker About Sexual Harassment: బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని తాజాగా బయటపెట్టారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు తనను వేధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గురించి కూడా స్వర చెప్పుకొచ్చారు.

Published on: Nov 15, 2026, 17:30:29 IST
Advertisement

Swara Bhaskar About Sexual Harassment: సమాజంలో జరిగే అన్యాయాలపై ఎప్పుడూ ముక్కుసూటిగా స్పందించే బాలీవుడ్ నటి స్వర భాస్కర్, తన సినీ ప్రయాణం ఆరంభంలో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని తాజాగా వెలుగులోకి తెచ్చారు.

ఎలాంటి నేపథ్యం లేకుండా

56 రోజులు షూటింగ్, డైరెక్టర్ వేధింపులు, కెరీర్ కోసం మౌనంగా భరించా.. నటి స్వర భాస్కర్ కామెంట్స్
56 రోజులు షూటింగ్, డైరెక్టర్ వేధింపులు, కెరీర్ కోసం మౌనంగా భరించా.. నటి స్వర భాస్కర్ కామెంట్స్

ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ముంబై చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న రోజుల్లో, ఓ దర్శకుడు తనను మానసికంగా వేధించాడని స్వర భాస్కర్ బయటపెట్టారు. 'ది ఫ్రీ ప్రెస్ జర్నల్'కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో 2011 నాటి ఆ చేదు జ్ఞాపకాలను స్వర గుర్తుచేసుకున్నారు.

పచ్‌మఢీ షూటింగ్‌లో ఏం జరిగింది?

2011లో 'తను వెడ్స్ మను' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న స్వర భాస్కర్ అప్పుడప్పుడే బాలీవుడ్‌లో అవకాశాల కోసం అడుగులు వేస్తున్నారు. ఆ సమయంలో మధ్యప్రదేశ్‌లోని పచ్‌మఢీలో ఓ సినిమా అవుట్‌డోర్ షూటింగ్ కోసం వెళ్లారు.

మొత్తం 56 రోజుల పాటు సాగే ఆ షెడ్యూల్ మొదలైన కొద్ది రోజులకే దర్శకుడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆయన వేధింపులు మొదలయ్యాయి. అయితే, అప్పట్లో తనకు ఎదురవుతున్నది లైంగిక వేధింపుల కిందకు వస్తుందన్న అవగాహన కూడా తనకు లేదని స్వర భాస్కర్ వాపోయారు.

"ఆ సమయంలో నాపై ఎలాంటి శారీరక స్పర్శ జరగకపోవడంతో, పని ప్రదేశంలో జరిగే లైంగిక వేధింపుల కిందకు అది వస్తుందని నాకు అస్సలు తెలియదు. అప్పుడు నాకు సొంత టీమ్ లేదు, సాయం అడగడానికి ఇండస్ట్రీలో పెద్దగా పరిచయాలు కూడా లేవు. అందుకే చాలా నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను" అని స్వర భాస్కర్ వివరించారు. సినీ పరిశ్రమలో గాడ్‌ఫాదర్ లేని కొత్త నటీమణులు ఇలాంటి పరిస్థితుల్లో ఎంతటి ఒత్తిడికి గురవుతారో ఆమె మాటల్లో స్పష్టంగా కనిపించింది.

కెరీర్ వదులుకోలేక మౌనంగా భరించా!

"ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని నాకు లేదు. నాకు కూడా కెరీర్ పరంగా కొన్ని ఆశయాలు ఉన్నాయి. పని చేస్తూనే ఉండాలనుకోవడంలో తప్పేముంది? ఒక మహిళ తన కెరీర్ కొనసాగించాలనుకున్నంత మాత్రాన, ఆమె ఎదుర్కొన్న వేధింపుల తీవ్రత తగ్గిపోదు" అని స్వర భాస్కర్ చెప్పుకొచ్చారు.

ఆ ఘటన జరిగిన చాలా ఏళ్ల తర్వాత దేశవ్యాప్తంగా 'మీటూ' (MeToo) ఉద్యమం ఊపందుకున్నప్పుడే తనకు జరిగిన అన్యాయం ఏంటో పూర్తిగా అర్థమైందని చెప్పారు. "మీటూ ఉద్యమంలో ఇతర మహిళల అనుభవాలు చదివినప్పుడు.. దేవుడా, నాకు జరిగింది కూడా కచ్చితమైన వేధింపే కదా అని తెలిసొచ్చింది" అని ఆమె పేర్కొన్నారు.

ఆపద్బాంధవుడిలా నిలిచిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్

వేధింపులు భరించలేని స్థాయికి చేరడంతో, చివరకు స్వర ధైర్యం చేసి ఆ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌కు తన బాధను చెప్పుకున్నారు. వెంటనే స్పందించిన ఆయన, స్వరకు పూర్తి అండగా నిలబడి మిగిలిన షూటింగ్ సజావుగా సాగేలా చూసుకున్నారు. ఆ కష్టకాలంలో పుట్టిన వారి స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది.

"ఆయన నాకు అండగా నిలిచి నన్ను రక్షించారు. ఆ తర్వాత మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ప్రస్తుతం ఆయనే నా మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు" అని స్వర కృతజ్ఞత తెలిపారు. కొత్తగా ఉద్యోగాల్లోకి, సినీ రంగంలోకి అడుగుపెట్టే యువతులు తమ హద్దులను ముందే గుర్తించాలని ఆమె సూచించారు.

"ఇప్పుడైతే పరిస్థితులు మారాయి, మనం ధైర్యంగా మాట్లాడగలం. కాబట్టి ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే నమ్మకమైన వారికి చెప్పి సాయం తీసుకోండి. తప్పును అక్కడికక్కడే నిలదీయండి" అని యువతకు సలహా ఇచ్చారు స్వర భాస్కర్.

వ్యక్తిగత జీవితం.. తాజా ప్రాజెక్టులు

ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, స్వర భాస్కర్ 2023 జనవరి 6న ప్రత్యేక వివాహ చట్టం కింద రాజకీయ నాయకుడు ఫహద్ అహ్మద్‌ను పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది ఫిబ్రవరి 16న తమ వివాహ వార్తను అధికారికంగా ప్రకటించారు. 2023 సెప్టెంబర్‌లో ఈ దంపతులకు కుమార్తె రాబియా జన్మించింది.

ఇటీవల స్వర భాస్కర్ 'రైజ్ అండ్ ఫాల్ 2' (Rise & Fall 2) షోలో కూడా పాల్గొని ప్రేక్షకులను అలరించారు. తాజాగా స్వర భాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో మహిళల భద్రతపై మరోసారి చర్చకు దారితీశాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks