వారణాసి షూటింగ్‌కు వస్తా.. కెమెరా భుజంపై మోస్తూ షూట్ చేస్తా: రాజమౌళితో జేమ్స్ కామెరాన్.. అవతార్ 3 ప్రమోషన్లలో జక్కన్న
రాజమౌళి వారణాసి మూవీ గురించి ఆరా తీశాడు లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్. అవతార్ 3 మూవీ ప్రమోషన్లలో భాగంగా కామెరాన్ ను వీడియో కాల్ లో జక్కన్న ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు లెజెండ్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలపై మాట్లాడుకున్నారు.
ప్రపంచంలోని ఇద్దరు అద్భుతమైన ఫిల్మ్ మేకర్స్ ఒకరినొకరు ఇంటర్వ్యూ చేయడం ఎప్పుడైనా చూశారా? ఇప్పుడా అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ ను ఓ వీడియో కాల్ లో ఎస్ఎస్ రాజమౌళి ఇంటర్వ్యూ చేయడం విశేషం. ఈ వీడియోను 20th Century Studios India తన యూట్యూబ్ లో పోస్ట్ చేసింది.

కామెరాన్‌తో రాజమౌళి ముచ్చట్లు
జేమ్స్ కామెరాన్ తీసిన అవతార్ 3 రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. ఆ మూవీ టీమ్ ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే రాజమౌళి రంగంలోకి దిగాడు. కామెరాన్ తో వీడియో కాల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇండియాలో అవతార్: ఫైర్ అండ్ యాష్ చూసే అవకాశం దక్కిన తొలి వ్యక్తుల్లో తాను ఒకడినని, ఆ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అని కామెరాన్ తో రాజమౌళి చెప్పాడు.
ఇక కామెరాన్ మాట్లాడుతూ.. రాజమౌళి తీస్తున్న వారణాసి మూవీ గురించి ఆరా తీశాడు. ఈ సినిమా షూటింగ్ ఏడాదిగా జరుగుతోందని, మరో ఏడెనిమిది నెలల్లో షూటింగ్ పూర్తవుతుందని చెప్పాడు. షూటింగ్ కు తననూ పిలవాలని, తానూ వస్తానని కామెరాన్ అన్నాడు. ఇది చాలా సంతోషకరమైన విషయమని రాజమౌళి అన్నాడు. ముఖ్యంగా పులులతో ఏమైనా సీన్స్ తీసే సందర్భం ఉంటే చెప్పండని కామెరాన్ జోక్ చేశాడు.
ఇంటర్వ్యూ చివర్లో మరోసారి వారణాసి షూటింగ్ గురించి గుర్తు చేస్తూ తనను కచ్చితంగా పిలవాలని కోరాడు. తానే కెమెరా భుజంపై మోస్తూ షూట్ చేస్తానని కామెరాన్ జోక్ చేయడం విశేషం. దీనికి రాజమౌళి స్పందిస్తూ.. కచ్చితంగా మిమ్మల్ని హైదరాబాద్ కి, తన ఫిల్మ్ సెట్ కు తీసుకొస్తానని మాటిచ్చాడు.
అవతార్ 3పై రాజమౌళి ప్రశ్నలు, కామెరాన్ సమాధానాలు
ఇక ఆ తర్వాత రాజమౌళి అవతార్ 3 మూవీ గురించి పలు ప్రశ్నలు అడిగాడు. వీటికి కామెరాన్ చాలా ఓపిగ్గా, సవివరంగా సమాధానాలు ఇచ్చాడు. ఈ సినిమాలోని సీన్స్, పాత్రలు, గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని రాజమౌళి కొనియాడాడు. అందులోని పాత్రల గురించి, వాటి ఎమోషన్స్ గురించి జక్కన్న ప్రశ్నించాడు. ఇండియాలో ఓ లెెజెండరీ డైరెక్టర్ గా పేరుగాంచిన రాజమౌళి.. ఫిల్మ్ మేకింగ్ స్టైల్ కు సంబంధించి కామెరాన్ ను ప్రశ్నలు అడగడం విశేషం. ప్రస్తుతం ఈ ఇద్దరి సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
రాజమౌళి, కామెరాన్ మీటింగ్
రాజమౌళి, జేమ్స్ కామెరాన్ తొలిసారి అమెరికాలో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్లలో కలుసుకున్నారు. ఈ సినిమా గురించి అప్పట్లో కామెరాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. తన భార్యతో కలిసి ఈ సినిమాను రెండుసార్లు చూశానని రాజమౌళితో కామెరాన్ చెప్పాడు. హాలీవుడ్ లో సినిమా చేసే ఉద్దేశం ఉంటే ఇద్దరం కలిసి చేద్దామని అప్పట్లోనే కామెరాన్ ఆఫర్ ఇవ్వడం విశేషం.
మళ్లీ ఈ ఇద్దరు లెజెండ్స్ ఇప్పుడిలా అవతార్ 3 కోసం వర్చువల్ గా కలుసుకున్నారు. వారణాసి మూవీ ప్రమోషన్లకు తాను కూడా వస్తానని కామెరాన్ చెప్పడంతో రాజమౌళి అతన్ని ఎప్పుడు, ఎలా తీసుకొస్తారన్న చర్చ మొదలైంది. అదే జరిగితే మహేష్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ ప్రమోషన్ గ్యారెంటీ. మరోవైపు అవతార్ 3 మూవీ ఈ శుక్రవారం (డిసెంబర్ 19) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూలు మాత్రం చాలా వరకు నెగటివ్ గా రావడం గమనార్హం.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


