Bargi Dam Accident: బర్గి డ్యామ్ బోట్ ప్రమాదంపై హీరోయిన్ భూమి పెడ్నెకర్ పోస్ట్- తల్లి బిడ్డ దృశ్యం కలచివేసిందంటూ ఆవేదన
Bhumi Pednekar Emotional On Bargi Dam Accident: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ వద్ద జరిగిన బర్గి డ్యామ్ పడవ ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదం నింపింది. ఈ ఘోరకలిపై బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Bhumi Pednekar Emotional On Bargi Dam Cruise Accident: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లా బర్గి డ్యామ్ వద్ద జరిగిన పడవ ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. గురువారం (ఏప్రిల్ 30) సాయంత్రం నర్మదా నదిపై ప్రయాణిస్తున్న 'నర్మదా క్వీన్' అనే టూరిస్ట్ క్రూయిజ్ బోట్ అకస్మాత్తుగా బోల్తా పడటంతో పది మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆ దృశ్యం కలచివేసింది
ఈ హృదయ విదారక ఘటనపై బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ ప్రమాదంలో ఒక తల్లి తన బిడ్డను గుండెలకు హత్తుకుని విగతజీవిగా పడి ఉన్న దృశ్యం తనను కలచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
"ఇది అత్యంత విషాదకరం, గుండెలు పిండేసే ఘటన. దీనికి ఎవరూ బాధ్యత వహించరా? బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. తన కుమారుడిని గట్టిగా పట్టుకుని ప్రాణాలు వదిలిన ఆ తల్లి దృశ్యం నా కళ్ల ముందు నుంచి కదలడం లేదు. ఆ కుటుంబాలకు నా ప్రార్థనలు తోడుంటాయి" అని భూమి పెడ్నేకర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు.
అసలేం జరిగింది? అధికారుల నిర్లక్ష్యమేనా?
మధ్యప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ క్రూయిజ్ బోట్, ప్రమాద సమయంలో సుమారు 43 నుంచి 45 మంది ప్రయాణికులతో వెళ్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే, కేవలం 29 మందికి మాత్రమే టిక్కెట్లు జారీ చేశామని అధికారులు చెబుతుండటం గమనార్హం. పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడమే కాకుండా, కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఢిల్లీకి చెందిన సంగీత అనే పర్యాటకురాలు అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. పడవ ఎక్కే ముందే ఎవరికీ లైఫ్ జాకెట్లు ఇవ్వలేదని, నీరు పడవలోకి చేరిన తర్వాత హడావిడిగా పంచారని ఆమె ఆరోపించారు.
వాతావరణం అనుకూలించకపోయినా
గ్రామస్తులు హెచ్చరిస్తున్నా, వాతావరణం అనుకూలించకపోయినా పైలట్ మొండిగా పడవను ముందుకు తీసుకెళ్లడం వల్లే ఈ ఘోరం జరిగిందని సంగీత వాపోయారు. గాలివాన ధాటికి ఒక్కసారిగా పడవ బోల్తా పడటంతో అంతా గందరగోళం నెలకొంది.
ప్రభుత్వ స్పందన - బాధ్యులపై వేటు
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ప్రమాద స్థలాన్ని సందర్శించిన ఆయన, ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు సిబ్బందిని వెంటనే తొలగించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పడవ ప్రయాణాలపై ప్రస్తుతానికి నిషేధం విధించారు.
ఎక్స్‌గ్రేషియా ప్రకటన
మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇప్పటికీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి, ముగ్గురు పర్యాటకుల ఆచూకీ లభించాల్సి ఉంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


