Preity Zinta Flat: నెలకు 6 లక్షల అద్దె- లగ్జరీ ఫ్లాట్ రెంట్‌కు తీసుకున్న హీరోయిన్ ప్రీతి జింటా- 32 కోట్ల ఆస్తి అమ్మేసి!

Preity Zinta Rent A Flat For 6 Lakh: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ జట్టు యజమాని ప్రీతీ జింటా ముంబైలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతంలో భారీ అద్దెకు ఒక ఫ్లాట్‌ను తీసుకున్నారు. అందుకోసం ప్రీతి జింటా నెలకు రూ. 6 లక్షల అద్దె చెల్లించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Published on: Jun 18, 2026, 12:14:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Preity Zinta Rent A Flat For 6 Lakh Per Month: సినీ సెలబ్రిటీల జీవనశైలి, వారు నివసించే ఇళ్లు ఎప్పుడూ సామాన్యులలో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తాయి. తాజాగా బాలీవుడ్ డింపుల్ బ్యూటీ ప్రీతీ జింటా ముంబైలో ఒక లగ్జరీ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని మరోసారి వార్తల్లో నిలిచారు.

నెలకు 6 లక్షల అద్దె- లగ్జరీ ఫ్లాట్ రెంట్‌కు తీసుకున్న హీరోయిన్ ప్రీతి జింటా- 32 కోట్ల ఆస్తి అమ్మేసి!
నెలకు 6 లక్షల అద్దె- లగ్జరీ ఫ్లాట్ రెంట్‌కు తీసుకున్న హీరోయిన్ ప్రీతి జింటా- 32 కోట్ల ఆస్తి అమ్మేసి!

ప్రీతి జింటా కొత్త కాపురం

ముంబైలోనే అత్యంత ఖరీదైన, సెలబ్రిటీల కేరాఫ్ అడ్రస్‌గా పేరొందిన బాంద్రా వెస్ట్‌లోని పాలి హిల్స్ ప్రాంతంలో ప్రీతి జింటా కొత్తగా కాపురం పెట్టారు. ఇందుకోసం పాలి హిల్స్‌లో ఓ లగ్జరీ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. అయితే, ఆ ప్లాట్‌కు ప్రీతి జింటా చెల్లిస్తున్న నెలవారీ అద్దె వింటే సామాన్యులు ముక్కున వేలేసుకోవాల్సిందే.

పాలి హిల్స్ అంటే బాలీవుడ్ స్టార్స్, బడా బిజినెస్‌మెన్‌లకు ఒక డ్రీమ్ లొకేషన్. ఇక్కడ నివసించడం ఒక స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ 'సీఆర్ఈ మ్యాట్రిక్స్' (CRE Matrix) సేకరించిన అధికారిక పత్రాల ప్రకారం.. ప్రీతీ జింటా ఈ ప్రాంతంలోని 'ఆర్ట్ వేద' (Art Veda) బిల్డింగ్‌లో ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను రెండు సంవత్సరాల కాలపరిమితికి లీజుకు తీసుకున్నారు.

నెలకు రూ.6 లక్షల అద్దె.. భారీ సెక్యూరిటీ డిపాజిట్

ఈ లీవ్ అండ్ లైసెన్స్ ఒప్పందం మే 27, 2026 నుంచి అధికారికంగా అమలులోకి వచ్చింది. 'ఎమ్ఎస్ యూనియన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్' సంస్థ నుంచి ఆమె ఈ ప్రాపర్టీని ప్రీతి జింటా అద్దెకు తీసుకున్నారు. దాదాపు 1,500 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ ఫ్లాట్‌తో పాటు 100 చదరపు అడుగుల కార్ పార్కింగ్ స్థలం కూడా ఆమెకు లభించనుంది.

ఈ ఒప్పందం ప్రకారం, మొదటి 12 నెలల పాటు ఆమె నెలకు రూ.6 లక్షల చొప్పున అద్దె చెల్లిస్తారు. ఆ తర్వాతి 12 నెలల కాలానికి ఈ అద్దె నెలకు రూ.6.5 లక్షలకు పెరుగుతుంది. ఈ లగ్జరీ ఇల్లు అద్దెకు తీసుకోవడానికి ఆమె ఏకంగా రూ.27 లక్షలను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించారు. అయితే ఈ అద్దె ఒప్పందంపై ప్రీతి జింటా కానీ, సదరు ల్యాండ్‌లార్డ్ కానీ ఇప్పటివరకు మీడియా ముందు ఎలాంటి ప్రకటన చేయలేదు.

నాలుగు నెలల్లోనే రూ.32 కోట్ల ఆస్తుల విక్రయం

ఒకవైపు లగ్జరీ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుంటూనే, మరోవైపు ప్రీతీ జింటా కోట్ల రూపాయల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. గత నాలుగు నెలల కాలంలోనే ఆమె బాంద్రా ప్రాంతంలో రెండు భారీ ఫ్లాట్లను విక్రయించడం గమనార్హం.

ఈ ఏడాది మార్చి 2, 2026న పాలి హిల్స్‌లోనే ఉన్న తన మరొక అపార్ట్‌మెంట్‌ను ఏకంగా రూ.18.50 కోట్లకు అమ్మేశారు. 1,770 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ ఫ్లాట్‌ను భారతీయ సంతతికి చెందిన అమెరికా పౌరులు ప్రియా నగర్, రాజీవ్ నగర్ కొనుగోలు చేశారు. ఈ డీల్ కోసం వారు రూ. 1.11 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ.30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు.

దీనికంటే ముందు, నవంబర్ 2025లో కూడా ప్రీతి జింటా 'రుస్తుంజీ పరిశ్రమ్' బిల్డింగ్‌లోని 11వ అంతస్తులో ఉన్న 1,474 చదరపు అడుగుల ఫ్లాట్‌ను రూ.14.08 కోట్లకు పైగా ధరకు విక్రయించారు. అంటే కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఆమె దాదాపు రూ.32.50 కోట్ల విలువైన ఆస్తులను అమ్ముకుని నగదుగా మార్చుకున్నారు.

ముంబైలో రీడెవలప్‌మెంట్ మార్కెట్ జోరు

మార్చి నెలలో ప్రీతి జింటా అమ్మేసిన ఫ్లాట్ గతంలో రీడెవలప్‌మెంట్‌లో భాగంగా ఆమెకు దక్కిన ఆస్తి కావడం విశేషం. "సొసైటీ, డెవలపర్ (కీస్టోన్ రియల్టర్స్/రుస్తుంజీ) మధ్య జరిగిన రీడెవలప్‌మెంట్ ఒప్పందం ప్రకారం, అక్టోబర్ 23, 2023 నాటి అగ్రిమెంట్ ఆధారంగా ఈ ఫ్లాట్ ఆమెకు పర్మనెంట్ ఆల్టర్నేట్ అకామడేషన్ కింద దక్కింది" అని సీఆర్ఈ మ్యాట్రిక్స్ ప్రతినిధులు పేర్కొన్నారు.

పాత భవనాన్ని రీడెవలప్ చేసిన తర్వాత ఏప్రిల్ 2025లో ఈ ఫ్లాట్‌ను ప్రీతీ జింటాకు కేటాయించారు. ముంబై రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం రీడెవలప్‌మెంట్ మార్కెట్ భారీగా పుంజుకుంటోంది. 2025లో ఈ మార్కెట్ 16 శాతం వృద్ధిని నమోదు చేయగా, 2026లోనూ అదే జోరు కొనసాగుతోంది.

కోటీశ్వరులకు వ్యాపార వ్యూహంగా

పాత ఇళ్లను ఇచ్చి సరికొత్త లగ్జరీ ఇళ్లను పొందడం, ఆ తర్వాత మార్కెట్ రేట్లను బట్టి వాటిని విక్రయించి లాభాలు గడించడం ముంబై కోటీశ్వరులకు ఒక వ్యాపార వ్యూహంగా మారింది. ప్రీతీ జింటా కూడా అదే బాటలో నడుస్తూ పాత ఆస్తులను విక్రయించి, కొత్తగా అద్దె ఇళ్లలోకి మారుతున్నట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More