Sign in

Tollywood vs Bollywood Nepotism: టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ నెపోటిజం.. ఇక్కడ వరం.. అక్కడ మాత్రం శాపం.. ఎందుకంటే?

Tollywood vs Bollywood Nepotism Analysis: సినిమా పరిశ్రమలో నెపోటిజం కొత్తదేమీ కాదు. బాలీవుడ్‌లో వారసులపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్, వ్యతిరేకత వ్యక్తమవుతుంటే, టాలీవుడ్‌లో మాత్రం ప్రేక్షకులు వారిని ఓన్ చేసుకుని స్టార్లను చేస్తున్నారు. ఈ రెండు పరిశ్రమల మధ్య ఉన్న ఈ వ్యత్యాసాలపై ప్రత్యేక విశ్లేషణ.

Published on: Jun 6, 2026, 15:11:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tollywood vs Bollywood Nepotism Analysis: చిత్ర పరిశ్రమలో నెపోటిజం అనే అంశం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్. ఇటీవల బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీయానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్, ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భట్‌ల నెపోటిజం ట్యాగ్‌పై స్పందిస్తూ, వారసత్వంగా వచ్చిన నటులు తమ కుటుంబాల విజయాలతో పోటీ పడాలనే అదనపు ఒత్తిడిని ఎదుర్కొంటారని పేర్కొన్నారు.

టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ నెపోటిజం.. ఇక్కడ వరం.. అక్కడ మాత్రం శాపం.. ఎందుకంటే?
టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ నెపోటిజం.. ఇక్కడ వరం.. అక్కడ మాత్రం శాపం.. ఎందుకంటే?

చూసే కోణం విభిన్నం

అయితే, ఈ వారసత్వ వలయం బాలీవుడ్‌లో ఎదుర్కొంటున్న నిరసనలకు, టాలీవుడ్‌లో దక్కుతున్న బ్రహ్మరథానికి మధ్య ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. ఒకే దేశంలో ఉన్న ఈ రెండు అతిపెద్ద చిత్ర పరిశ్రమలు నెపోటిజాన్ని చూసే కోణం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

బాలీవుడ్‌లో ‘నెపోటిజం’ శాపం.. బాయ్‌కాట్ సంస్కృతి

హిందీ చిత్ర పరిశ్రమలో గత కొన్ని సంవత్సరాలుగా నెపోటిజం అనే పదం ఒక పెద్ద మార్కెట్ డిస్‌అడ్వాంటేజ్‌గా మారింది. కొందరు ప్రతిభావంతులైన అవుట్‌సైడర్ల మరణాలు, ఆ తర్వాత సోషల్ మీడియాలో వ్యక్తమైన ఆగ్రహం బాలీవుడ్‌ను కుదిపేసింది.

స్టార్ కిడ్స్ సులభంగా పెద్ద బ్యానర్లలో సినిమాలు చేస్తున్నారని, బయటి నుంచి వచ్చే ప్రతిభావంతులకు మాత్రం ఎలాంటి అవకాశాలు దక్కకుండా చేస్తున్నారనే ఆరోపణలు తీవ్రమయ్యాయి.

ప్రేక్షకుల పల్స్‌కు దూరంగా

బాలీవుడ్‌లో నెపో కిడ్స్ చాలామంది స్థానిక సంస్కృతికి, దేశంలోని సామాన్య ప్రేక్షకుల పల్స్‌కు దూరంగా జీవిస్తారనే విమర్శ ఉంది. వారి భాష, ప్రవర్తన, ఎంపిక చేసుకునే పాత్రలు కేవలం ముంబైలోని కొన్ని వర్గాలకే (Urban Elites) పరిమితం కావడంతో సాధారణ ప్రేక్షకులు వారితో కనెక్ట్ కాలేకపోతున్నారు.

రణ్‌బీర్ కపూర్, అలియా భట్, శ్రద్ధా కపూర్ వంటి కొద్దిమంది నటనతో తమను తాము నిరూపించుకున్నప్పటికీ, మెజారిటీ స్టార్ కిడ్స్ ఎదుర్కొంటున్న తిరస్కరణ బాలీవుడ్ బాక్సాఫీస్ వసూళ్లను దారుణంగా దెబ్బతీస్తోంది.

టాలీవుడ్‌లో ‘వారసత్వం’ ఒక ఆశీర్వాదం, వరం

తెలుగు చిత్ర పరిశ్రమ (టాలీవుడ్) విషయానికి వస్తే ఇక్కడ సమీకరణాలు పూర్తిగా వేరు. టాలీవుడ్‌ను దశాబ్దాలుగా నాలుగు పెద్ద కుటుంబాలు (మెగా, నందమూరి, అక్కినేని, దగ్గుబాటి) నడిపిస్తున్నాయి. అయితే, ఇక్కడ ప్రేక్షకులు వారసులను గుండెలకు హత్తుకుంటారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి వంటి మహామహుల వారసులుగా వచ్చిన బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగ చైతన్య, రానా దగ్గుబాటి నేడు పరిశ్రమను అగ్రస్థానంలో నిలబెట్టారు.

తెలుగు ప్రేక్షకులు తమ అభిమాన హీరోల పిల్లలను తమ సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తారు. "మా అన్న కొడుకు" లేదా "మా నటుడి మనవడు" అనే ఒక బలమైన ఎమోషనల్ బాండ్ ఇక్కడ కనిపిస్తుంది. టాలీవుడ్‌లో వారసత్వం అనేది సినిమా రంగానికి ఒక వ్యాపార స్థిరత్వాన్ని, మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించే మార్కెట్ బలాన్ని ఇస్తుండటం విశేషం.

‘యాక్సెప్టెన్స్’ లో తేడా ఎందుకు? అసలైన కారణాలు ఇవే!

ఈ రెండు పరిశ్రమల మధ్య ఉన్న ప్రధానమైన వ్యత్యాసం 'శిక్షణ, గ్రౌండ్ రియాలిటీ'. టాలీవుడ్‌లో ఒక స్టార్ కిడ్ ఎంట్రీ ఇస్తున్నాడంటే.. అతడు చిన్నతనం నుంచే మాస్ ఆడియన్స్‌కు నచ్చేలా డాన్సులు, ఫైట్లు, నటనలో కఠినమైన శిక్షణ తీసుకుంటాడు.

తెలుగు రాష్ట్రాల్లోని బి, సి సెంటర్ల ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా వారు గ్రౌండ్ వర్క్ చేస్తారు. రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలో పహిల్వాన్ లుక్ కోసం పడ్డ కష్టం లేదా అల్లు అర్జున్ 'పుష్ప' కోసం మార్చుకున్న బాడీ లాంగ్వేజ్ ఇందుకు ఉదాహరణలు.

"వారసత్వం అనేది కేవలం మొదటి సినిమా గేట్ పాస్ మాత్రమే, ఆ తర్వాత ప్రతిభ ఉంటేనే ప్రేక్షకులు ఉంచుతారు, లేదంటే పంపించేస్తారు" అని టాలీవుడ్ విశ్లేషకులు తరచూ చెప్తుంటారు.

కేవలం గ్లామర్, ఆన్‌లైన్ పాపులారిటీ

బాలీవుడ్‌లో కేవలం గ్లామర్, సోషల్ మీడియా పాపులారిటీతోనే స్టార్స్ అయిపోవచ్చనే ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. కానీ, టాలీవుడ్‌లో స్టార్ హోదా దక్కించుకోవాలంటే థియేటర్లలో మాస్ ప్రేక్షకులను మెప్పించాల్సిందే.

నెపోటిజం అనేది సినిమా పరిశ్రమలోకి రావడానికి సులువైన దారిని చూపించవచ్చు. కానీ, లాంగ్ రన్‌లో నిలబెట్టేది మాత్రం కేవలం ప్రతిభ, కష్టపడే తత్వం మాత్రమే. బాలీవుడ్ ఈ సత్యాన్ని ఆలస్యంగా గ్రహిస్తోంది, టాలీవుడ్ ఎప్పుడో దీనిని ఒక విజయవంతమైన ఫార్ములాగా మార్చుకుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More