బోర్డర్ 2 బాక్సాఫీస్ సంచలనం- అదిరే ఓపెనింగ్ కలెక్షన్లు- కొద్దిలో ధురంధర్ రికార్డు మిస్
సన్నీ డియోల్ హీరోగా నటించిన బోర్డర్ 2 బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. ఓపెనింగ్ కలెక్షన్లలో దూకుడు ప్రదర్శించింది. అయితే కొద్ది తేడాతో ధురంధర్ రికార్డును మిస్ అయింది ఈ మూవీ. మరి ఈ వార్ డ్రామా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఇక్కడ చూసేయండి.
1971 ఇండో-పాక్ వార్ డ్రామాగా తెరకెక్కిన బోర్డర్ 2 మూవీ బాక్సాఫీస్ సంచలనంగా మారింది. 29 ఏళ్లకు వచ్చిన ఈ సీక్వెల్ బ్లాక్ బస్టర్ టాక్ తో కలెక్షన్ల మోత మోగిస్తోంది. అదిరిపోయే ఓపెనింగ్ కలెక్షన్లతో భారీ వసూళ్లకు బాట వేసుకుంది. అయితే ధురంధర్ ఓపెనింగ్ కలెక్షన్ రికార్డును కొద్దిలో మిస్ అయింది బోర్డర్ 2.

బోర్డర్ 2 కలెక్షన్లు
సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్ కీలక పాత్రలు పోషించిన మూవీ బోర్డర్ 2. రిపబ్లిక్ డే కానుకగా ఈ మూవీ ముందుగానే జనవరి 23న థియేటర్లలో రిలీజైంది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో మూవీ దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ రోజు బోర్డర్ 2 సినిమా రూ.41 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
వసూళ్లు ఇలా
సన్నీడియోల్ తాజా చిత్రం బోర్డర్ 2 ఇండియన్ బాక్సాఫీస్‌తో పాటు విదేశాల్లోనూ మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ట్రేడ్ అనలిస్ట్ సక్నిల్క్ ప్రకారం బోర్డర్ 2 ఫస్ట్ డే (జనవరి 23) ఇండిమాలో రూ.30 కోట్ల నెట్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ఇండియన్ గ్రాస్ వసూళ్లు ఏమో రూ.36 కోట్లుగా ఉన్నాయి. విదేశాల్లో రూ.5 కోట్లు వసూలు చేయడంతో బోర్డర్ 2 మొత్తం ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్లు రూ.41 కోట్లకు చేరుకున్నాయి.
ధురంధర్ రికార్డు
రీసెంట్ గా బాక్సాఫీస్ దగ్గర 50 రోజుల రన్ పూర్తి చేసుకుని, ప్రపంచవ్యాప్తంగా రూ.1250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు దక్కించుకున్న ధురంధర్ ఓపెనింగ్ రికార్డును బోర్డర్ 2 కొద్దిలో మిస్ అయింది. ఓపెనింగ్ రోజు బోర్డర్ 2 రూ.41 కోట్ల గ్రాస్ ఖాతాలో వేసుకుంది. ధురంధర్ ఏమో రూ.41.5 కోట్లు సాధించింది. రణ్ వీర్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ ఆ తర్వాత కూడా బాక్సాఫీస్ దగ్గర తన దండయాత్ర కొనసాగించింది.
బోర్డర్ 2 గురించి
1997 నాటి ఎపిక్ వార్ ఫిల్మ్ 'బోర్డర్'కు సీక్వెల్‌గా ఇప్పుడు బోర్డర్ 2 వచ్చింది. బోర్డర్ 2 సినిమా 1971 నాటి ఇండో-పాక్ యుద్ధం చుట్టూ సాగుతోంది. ఇందులో సన్నీడియోల్ సైనికాధికారి పాత్రలో నటిస్తున్నారు. ఈ కొత్త చిత్రాన్ని 'కేసరి' ఫేమ్ దర్శకుడు అనురాగ్ సింగ్ తెరకెక్కించాడు. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి కూడా నటించారు.
బోర్డర్ 2 సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. మూవీ బ్రిలియంట్ అని, ముఖ్యంగా సన్నీ డియోల్ యాక్టింగ్ అదిరిపోయిందని అంటున్నారు. భారత త్రివిధ దళాలకు ఇది సరైన ట్రిబ్యూట్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

E-Paper












