Brahmamudi August 1 Episode: బ్రహ్మముడి.. రాజు తన భర్త కాదని చెప్పేసిన ఇందు.. కొంప ముంచిన రాజు.. భ్రమరాంబకూ తెలిసిన నిజం
Brahmamudi Serial August 1 Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 1 ఎపిసోడ్ లో రాజును తాను పెళ్లి చేసుకోలేదని అపర్ణకు చెప్పేస్తుంది ఇందు. సత్యనారాయణ వ్రతానికి రావడానికి రాజు అంగీకరించకపోవడంతో ఇలా అసలు నిజం బయటపెట్టాల్సి వస్తుంది.
Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. అసలు రాజు, ఇందులకు పెళ్లి జరగలేదన్న అనుమానం కలగడంతో అపర్ణ, సుభాష్ సత్యనారాయణ వ్రతం ప్లాన్ చేస్తారు. అది కాస్తా అసలు నిజం బయట పడేలా చేస్తుంది.

ఐశ్వర్యను కాపాడుకోవాలని రాజుతో చెప్పిన ఇందు
తన అక్క ఐశ్వర్యను కాపాడుకోవాలని రాజుతో ఇందు చెప్పే సీన్ తో సీరియల్ శనివారం (ఆగస్ట్ 1) ఎపిసోడ్ మొదలైంది. తన అక్క అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆమెను కాపాడుకోవాల్సిన బాధ్యత తనకు ఉందని అంటుంది. ఆమెకు ఎవరైనా గట్టిగా చెబితే ఇగో అని, అందుకే జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతుంది. సరే చూద్దాంలే అని రాజు అంటాడు.
ఇందు నేలపై పడుకోవడం చూసి అపర్ణ షాక్
ఆ తర్వాత రాజు మంచంపై, ఇందు నేలపై పడుకుంటారు. అది చూసిన అపర్ణ షాక్ తింటుంది. అప్పటి నుంచి ఆమెలో అనుమానం మొదలవుతుంది. అసలు వీళ్లిద్దరికీ నిజంగానే పెళ్లయిందా అని అనుకుంటుంది. ఏం జరిగిందని సుభాష్ అంటే.. ఇందు గురించి చెబుతుంది. తాను ఇందుకి అద్దె మొగుడిని అని లక్కీతో రాజు చెప్పడం, వాళ్లకు పెళ్లి కాలేదని ఐశ్వర్య చెప్పడం అపర్ణ గుర్తు చేసుకుంటుంది. ఒకవేళ ఐశ్వర్య చెప్పిందే నిజమేమో అని సుభాష్ తో అంటుంది.
ఇందు అంటే ఐశ్వర్యకు పడదు కాబట్టి అలా చెప్పిందేమో.. నిజానికి అలాంటిదేమో ఉండదు లే అని సుభాష్ అంటాడు. అయినా అపర్ణలో అనుమానం అలాగే ఉంటుంది. ఏదో విధంగా ఈ విషయం కనిపెట్టాలని అంటుంది. అలా అయితే సత్యనారాయణ వ్రతం అనుకున్నాం కదా.. అదే చేయిద్దాం.. అప్పుడు తెలిసిపోతుంది కదా అని సుభాష్ అనడంతో ఈ ఐడియా బాగుంది.. పంతులుగారిని ఇవాళే పిలిపిస్తానని అపర్ణ అంటుంది.
వెంకీ దగ్గరికి వచ్చిన నందు.. తల్లితో లేడని అబద్ధం చెప్పించి..
అటు వెంకీని వెతుక్కుంటూ అతని ఇంటికి వెళ్తుంది నందు. ఆమెను చూడగానే ఇంట్లోకి వెళ్లి తాను లేనని చెప్పమని వెంకీ దాక్కొంటాడు. నందు వచ్చి లక్ష్మిని వెంకీ గురించి అడుగుతుంది. అతడు ఇంట్లో లేడని, బయటకు వెళ్లాడని అబద్ధం చెబుతుంది. బైకు ఇక్కడే ఉంది కదా అని అడిగితే ఏదో అబద్ధం చెప్పి కవర్ చేస్తుంది. వెంకీ వస్తే కచ్చితంగా చెప్పండి ఆంటీ అని చెప్పి వెళ్లిపోతూ నందు ఎమోషనల్ అవుతుంది. ఆమెను చూసి లక్ష్మి కూడా బాధపడుతుంది.
నందును ప్రేమిస్తున్నట్లు చెప్పిన వెంకీ.. నాన్నతో చెప్పొద్దంటూ..
ఆమె వెళ్లిపోయిన తర్వాత అసలు ఏం జరుగుతోందని వెంకీని లక్ష్మి నిలదీస్తుంది. చెప్పాను కదా ఆమె దుగ్గిరాల వారసురాలని తెలిసే దూరంగా ఉంటున్నానని వెంకీ చెప్పినా లక్ష్మి నమ్మదు. మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది.. అదేంటో చెప్పమని నిలదీస్తుంది. దీంతో వెంకీ తల్లిని పట్టుకొని ఏడుస్తాడు.
నందుని ప్రేమిస్తున్న విషయం చెబుతాడు. ఆమె కూడా తనను ప్రేమిస్తుందని తనకు తెలుసని అంటాడు. ఇది కరెక్ట్ కాదు.. ఆ విషయం అమ్మాయికి చెప్పు.. నాన్నకు ఏదో సర్ది చెప్పొచ్చు అని లక్ష్మి అంటుంది. కానీ నాన్నను బాధపెట్టడం ఇష్టం లేదు.. ఆయన నాకోసం ఎన్నో చేశాడని వెంకీ అంటాడు.
రాజు, ఇందుతో సత్యనారాయణ వ్రతం.. ఇందు సీరియస్
ఇటు చెప్పినట్లే రాజు, ఇందుతో సత్యనారాయణ వ్రతం కోసం పంతులుగారిని పిలిపిస్తుంది అపర్ణ. ఈరోజే మంచి ముహూర్తం ఉందని, గుడికి తీసుకురామ్మని చెప్పి వెళ్లిపోతాడు. అది చూసి ఇందు.. పంతులుగారు ఎందుకు వచ్చారని అడిగితే.. సత్యనారాయణ వ్రతం అని చెప్పాను కదా.. ఈరోజే మంచి ముహూర్తం ఉందట అని అపర్ణ చెబుతుంది. దీంతో ఇందు సీరియస్ అవుతుంది. తనను అడగకుండా ఎందుకు పిలిచారు.. టైమ్ చూసుకొని చెబుతానన్నాను కదా అని ఇందు అనడంతో అపర్ణ, సుభాష్ లో మరింత అనుమానం కలుగుతుంది.
పెళ్లయి చాలా కాలమైంది.. ఇంకా ఆలస్యం చేయొద్దు.. కచ్చితంగా చేయాలని అంటారు. అయినా నేను ఒప్పుకున్నా.. ఆయన ఇంట్లో లేరు ఆఫీసుకు వెళ్లారని ఇందు చెబుతుంది. రాత్రి తనపై అలిగారని, ఇప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరని అంటుంది. నువ్వు ఆఫీసుకు వెళ్లయినా సరే రాజుని గుడికి తీసుకు రావాల్సిందే అని అపర్ణ తేల్చి చెప్పడంతో చేసేది లేక ఇందు వెళ్తుంది.
భ్రమరాంబలోనూ ఇందుపై అనుమానం
ఇదంతా పైనుంచి వింటున్న భ్రమరాంబలోనూ అనుమానం కలుగుతుంది. నిజంగా వీళ్లకు పెళ్లి జరగలేదని శేషుతో అంటుంది. అసలు వీళ్లకు పెళ్లయిందో లేదో తెలుసుకోవాలంటే మనం కూడా గుడికి వెళ్లాల్సిందే అని డిసైడవుతుంది.
పూజకు రానని తేల్చి చెప్పిన రాజు.. బతిమాలిన ఇందు
అటు ఆఫీసుకు వెళ్లిన ఇందు.. రాజుకి అసలు విషయం చెబుతుంది. కానీ రాజు మాత్రం అందుకు అంగీకరించడు. ఇన్నాళ్లూ అద్దె మొగుడిగా ఓకే కానీ.. దేవుడి విషయంలో తాను ఇలా చేయనని, నీ పక్కన కూర్చొని సత్యనారాయణ వ్రతం చేయడం కుదరదని తేల్చి చెబుతాడు. డబ్బు ఎక్కువ ఇస్తానని ఇందు బతిమాలినా వినడు. దీంతో ఇందు వెళ్లిపోతుంది.
రాజు తన భర్త కాదని చెప్పేసిన ఇందు
అటు గుడికి ఎంతకీ ఇందు, రాజు రాకపోవడంతో అపర్ణ, సుభాష్ లలో అనుమానం మరింత పెరుగుతుంది. చివరికి ఇందు ఒంటరిగా వస్తుంది. దీంతో అసలు మీకు పెళ్లయిందా లేక రాజు నీ అద్దె మొగుడా అని అపర్ణ నిలదీస్తుంది. పెళ్లయిందని బుకాయిస్తుంది ఇందు. అదే విషయం నాపై ఒట్టేసి చెప్పమని అనడంతో తమకు పెళ్లి కాలేదని ఇందు చెబుతుంది. దీంతో అపర్ణ షాక్ తింటుంది. అప్పుడే గుడికి వచ్చిన రాజు కూడా ఆ విషయం విని షాకవుతాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


