ఒకడు దౌర్జన్యంగా దోచుకున్నాడు-పోలీసులకు చిరంజీవి థ్యాంక్స్-ఇది సూపర్ హిట్ సీన్‌లా ఉందన్న రాజమౌళి-ఐబొమ్మ క్లోజ్‌పై హర్షం
ఎంతో మంది కష్టాన్ని ఒకడు దౌర్జన్యంగా దోచుకున్నాడని చిరంజీవి ఫైర్ అయ్యారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు నేపథ్యంలో సినీ ప్రముఖులతో కలిసి సీపీ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించారు.
పైరసీ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు. ఈ మేరకు ప్రెస్ మీట్ పెట్టారు. సినీ ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, సురేష్ బాబు తదితరులతో కలిసి సజ్జనార్ ఈ విలేకర్ల సమావేశం పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో పోలీసులకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.

లక్షల మంది కష్టం
ఎంతో కాలంగా ఈ పైరసీ నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తున్నట్లు చిరంజీవి పేర్కొన్నారు. ‘‘చాలా సంవత్సరాలుగా పైరసీ మహమ్మారి నుంచి ఎలా బయటపడాలని చాలా వర్రీ అవుతుండేవాళ్లం. సినిమా ఇండస్ట్రీ మీద డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా లక్షల మంది ఆధారపడి ఉన్నారు. లైట్ బాయ్ నుంచి చాలా మంది ఆధారపడి ఉన్నారు. ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్పనంగా వచ్చి దౌర్జన్యంగా దోచుకుంటుంటే, సవాలు విసురుతుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి’’ అని చిరంజీవి అన్నారు.
ఛాలెంజ్ చేసిన వాడినే
‘‘దీని నుంచి ఎలా తప్పించుకోవాలని తర్జనభర్జన పడుతున్న సమయంలో గత కమిషనర్ సీవీ ఆనంద్, ఇప్పుడు సినిమా కష్టాల గురించి తెలిసిన వ్యక్తి సీపీ సజ్జనార్ కలిసి పనిపట్టారు. ఈ రోజున ఎవరైతే ఛాలెంజ్ చేశారో దమ్ముంటే చూసుకోండని, అతణ్ని పట్టుకోవడానికి వాళ్లు సహకరించారు. సీపీ, పోలీసులు అందరికీ ధన్యవాదాలు. ఇది ఇలాగే ఆగిపోకుండా పరిశ్రమ కోసం ఆలోచించాలి. కాపాడే బాధ్యత మన అందరికీ ఉందని ఒక్కటై పోలీసుల సలహా తీసుకుంటే కచ్చితంగా ఇది పూర్తిగా రూపు మాపడానికి ప్రయత్నించొచ్చు’’ అని చిరంజీవి తెలిపారు.
పోలీసులకు ధన్యవాదాలు
‘‘ఐబొమ్మ నిర్వాహకులను పట్టుకోవడం గొప్ప ఘనత. దిల్ రాజ్ గేమ్ ఛేంజర్ నుంచి కింగ్డమ్ సినిమా వరకూ అన్నీ నష్టపోయాయి. రాజమౌళి గొప్ప సినిమా తీయబోతున్నారు. మన ఖ్యాతి ఖండంతారలకు వెళ్తుంది. అలాంటిది జరిగినప్పుడు ఇది పెను ముప్పుగా ఉంటుంది. మా బాధను అర్థం చేసుకున్నారు. మరోసారి పోలీసులకు ధన్యవాదాలు’’ అని చిరంజీవి ముగించారు.
సూపర్ హిట్ సీన్
‘‘సజ్జనార్, సీవీ ఆనంద్, పోలీస్ డిపార్ట్ మెంట్ కు ధన్యవాదాలు. ఇది సినిమాలో సూపర్ హిట్ సీన్ లా ఉంది. విలన్ ఛాలెంజ్ చేస్తే హీరో రెండు నెలల్లోపు తీసుకెళ్లి కటకటాల వెనక వేయడంలా ఉంది. భస్మాసుర హస్తంలా తన తల మీద తన చేయి పెట్టుకున్నాడు. అందుకే పోలీసులతో పెట్టుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి’’ అని రాజమౌళి హెచ్చరించారు.
ఫ్రీగా దొరకదు
‘‘ఏదీ ఫ్రీగా దొరకదు. దాని వెనకాల హిడెన్ కాస్ట్ చాలా భయంకరంగా ఉంటుంది. సినిమాను ఫ్రీగా చూస్తున్నాం కదా అనుకుంటున్నారు. ఆ పైరసీ సినిమాలు చేసినవాళ్లు సంఘసేవ చేయడం లేదు. దాని వెనకాల ఉండే డబ్బు ఎక్కడిది. మీ పర్సనల్ డేటా తీసుకుంటున్నారు. ఆ సమాచారాన్ని క్రిమినల్స్ కు అమ్మే అవకాశముంది. దీని వల్ల ప్రాణాలు పోయే వరకూ వెళ్తుంది.
పైరసీ కారణంగా మాకంటే మీరే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. వంద రూపాయలు పెట్టి థియేటర్ కు వెళ్లి చూడటం ఒక ఛాయిస్. ఏడాదికి వందల రూపాయలు పెట్టి ఓటీటీలో చూడటం మరో ఛాయిస్. ఫ్రీగా పైరసీ సైట్లలో చూడటం ఒకటి. ప్రాణాల మీదకు తెచ్చుకుంటారో, మూవీ ఎంజాయ్ చేస్తారో ఛాయిస్ మీదే’’ అని రాజమౌళి పేర్కొన్నారు.

E-Paper












