బుల్లితెర లేడి కమెడియన్‌కు గర్భాశయ వ్యాధి- పొత్తికడుపుపై 3 గాయాలు- ట్రోలింగ్, 38 ఏళ్ల వయసుపై సుమోనా చక్రవర్తి కామెంట్స్

Sumona Chakravarti About Endometriosis Surgery: ప్రముఖ టెలివిజన్ నటి, లేడి కమెడియన్ సుమోనా చక్రవర్తి గత రెండు నెలలుగా సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి గల అసలు కారణాన్ని వెల్లడించారు. గర్భాశయ సమస్యకు సంబంధించిన వివరాలను తాజాగా పేర్కొన్నారు. దీంతో సుమోనా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Jul 6, 2026, 11:45:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sumona Chakravarti About Endometriosis Surgery: 'ది కపిల్ శర్మ షో' ద్వారా దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న నటి సుమోనా చక్రవర్తి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గత రెండు నెలలుగా సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటున్న ఆమె, తాజాగా తన ఆరోగ్య పరిస్థితిపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సుదీర్ఘమైన ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

బుల్లితెర లేడి కమెడియన్‌కు గర్భాశయ వ్యాధి- పొత్తికడుపుపై 3 గాయాలు- ట్రోలింగ్, 38 ఏళ్ల వయసుపై సుమోనా చక్రవర్తి కామెంట్స్
బుల్లితెర లేడి కమెడియన్‌కు గర్భాశయ వ్యాధి- పొత్తికడుపుపై 3 గాయాలు- ట్రోలింగ్, 38 ఏళ్ల వయసుపై సుమోనా చక్రవర్తి కామెంట్స్

స్టేజ్ 4 ఎండోమెట్రియోసిస్ వ్యాధి

మహిళల్లో గర్భాశయానికి సంబంధించి వచ్చే ప్రమాదకరమైన 'స్టేజ్ 4 ఎండోమెట్రియోసిస్' (Endometriosis) వ్యాధి ముదరడంతో మే 4వ తేదీన తనకు సర్జరీ జరిగిందని సుమోనా వెల్లడించారు. ఎంతో కాలంగా ఈ సమస్యను నియంత్రించడానికి మందులు వాడుతున్నప్పటికీ పరిస్థితి విషమించడంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని చెప్పారు.

మన తెలుగు రాష్ట్రాల్లోనూ కపిల్ శర్మ ఓటీటీ కామెడీ షో చూసే ప్రేక్షకులకు సుమోనా చక్రవర్తి సుపరిచితమే. స్క్రీన్‌పై ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ కనిపించే ఆమె వెనుక ఇంతటి ఆరోగ్య పోరాటం ఉందనే విషయం తెలిసి అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ప్రస్తుతం సర్జరీ తర్వాత కోలుకోవడానికి సమయం పట్టిందని, అందుకే ఎవరికీ అందుబాటులో లేనని సుమోనా క్లారిటీ ఇచ్చారు.

రెండు నెలలుగా బయటి ప్రపంచానికి దూరంగా..

"చాలా రోజుల తర్వాత మళ్లీ మీ ముందుకు రావడం సంతోషంగా ఉంది. గత రెండు నెలలుగా నేను ఒక రాయి కింద దాక్కున్నట్లు బయటి ప్రపంచానికి పూర్తిగా దూరంగా బతికాను" అని సుమోనా చక్రవర్తి తన ఇన్‌స్టాగ్రామ్ నోట్‌లో రాసుకొచ్చారు.

ఇన్నేళ్లుగా ఈ వ్యాధిని అదుపులో ఉంచడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ, అది ఊహించని విధంగా ముదిరిపోవడంతో మే 4న ఎక్సిషన్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని సుమోనా వివరించారు. గత రెండు నెలల కాలాన్ని శారీరకంగా, మానసికంగా కోలుకోవడానికే కేటాయించానని, ప్రస్తుతం తాను పూర్తిగా క్షేమంగా ఉన్నానని స్పష్టం చేస్తూ తన వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

ట్రోల్స్‌పై ఘాటు వ్యాఖ్యలు..

ఒకప్పుడు సోషల్ మీడియాలో లైకులు, కామెంట్లు, ఫాలోవర్ల సంఖ్యపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టేదాన్నని సుమోనా నిజాయితీగా అంగీకరించారు. అయితే, ఈ ఆసుపత్రి జీవితం తన ఆలోచనలను పూర్తిగా మార్చేసిందని చెప్పారు. ఇకపై తన సోషల్ మీడియా ఖాతాలను కేవలం గ్లామర్ ప్రదర్శన కోసం కాకుండా మహిళల ఆరోగ్యం, పెరిమెనోపాజ్, ఎండోమెట్రియోసిస్ వంటి శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడానికి ఉపయోగిస్తానని ప్రకటించారు.

ఇదే సమయంలో నెటిజన్ల ట్రోలింగ్‌పై కూడా సుమోనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లుగా తన శరీరాన్ని టార్గెట్ చేస్తూ ఎంతోమంది అసభ్యకరమైన, వికృతమైన కామెంట్లు పెట్టారని, తన అనుభవంలో అందులో ఎక్కువ శాతం పురుషులే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

"మంచివాళ్లు ఎప్పుడూ బహిరంగంగా అలాంటి నీచమైన కామెంట్లు చేయరు. వాళ్లు చదువుతారు, లైక్ చేస్తారు, అవసరమైతే వ్యక్తిగతంగా మంచి మెసేజ్ చేసి వెళ్లిపోతారు" అని సుమోనా అన్నారు. తానొక నటిని కాబట్టి ఇలాంటి విమర్శలు ఎదుర్కోవడం సహజమేనని, అయితే వీటివల్ల తన నటన ఆగదని, చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.

కడుపుపై మూడు సర్జరీ గుర్తులు.. వయసుపై కొత్త కోణం

జూన్ నెలలో 38వ వసంతంలోకి అడుగుపెట్టిన సుమోనా, తన పుట్టినరోజును సోషల్ మీడియాకు దూరంగా ఇస్తాంబుల్‌లో జరుపుకున్నారు. ప్రేమాభిమానాలకు ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచం ఏమాత్రం కొలమానం కాదని ఈ విరామం తనకు నేర్పిందని చెప్పారు.

సర్జరీ తర్వాత తన పొత్తికడుపుపై మూడు పెద్ద శస్త్రచికిత్స గుర్తులు పడ్డాయని, అవి ఎప్పటికీ పోతాయో లేదో తెలియదని, వాటిని చూసుకున్నప్పుడు కాస్త బాధగా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. "ఒంటిపై ఉన్న గాయాల గుర్తులు, మనసులోని జ్ఞాపకాలే మనం జీవితాన్ని ధైర్యంగా జీవించామనడానికి సజీవ సాక్ష్యాలు" అని సుమోనా ఎమోషనల్ అయ్యారు.

38 ఏళ్లు బాగానే సెట్ అయింది

38 ఏళ్ల వయసులో వృద్ధాప్యం గురించి భయపడాల్సిన అవసరం లేదని, వయసు పెరగడం అనేది ఒక అదృష్టమని సుమోనా అభిప్రాయపడ్డారు. వయసుతో పాటు కాస్త జ్ఞానం, జీవితంపై స్పష్టత, కృతజ్ఞతాభావం వస్తాయని, వాటితో పాటు వచ్చే గాయాల గుర్తులను కూడా తాను సంతోషంగా స్వీకరిస్తానని చెబుతూ.. "38 ఏళ్ల వయసు నాకు బాగానే సెట్ అయింది" అని తన పోస్ట్‌ను ముగించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More