దండోరా రివ్యూ: గుండెల్ని పిండేసే పల్లె కథ.. శివాజీ, నవదీప్, బిందు మాధవి నటించిన సినిమా మెప్పించిందా?

తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో, కులం, సామాజిక కట్టుబాట్ల చుట్టూ తిరిగే భావోద్వేగ భరిత చిత్రం ‘దండోరా’. బిగ్ బాస్ శివాజీ, నవదీప్, బిందు మాధవి, నందు, రవికృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇవాళ థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ మూవీ ఎలా ఉందో నేటి దండోరా రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Dec 25, 2025, 09:43:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టైటిల్: దండోరా

దండోరా రివ్యూ: గుండెల్ని పిండేసే పల్లె కథ.. శివాజీ, నవదీప్, బిందు మాధవి నటించిన సినిమా మెప్పించిందా?
దండోరా రివ్యూ: గుండెల్ని పిండేసే పల్లె కథ.. శివాజీ, నవదీప్, బిందు మాధవి నటించిన సినిమా మెప్పించిందా?

నటీనటులు: శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి, రవికృష్ణ, మౌనికా రెడ్డి, మనికా చిక్కాల, రాధ్య, అదితి భావరాజు తదితరులు

దర్శకత్వం: మురళికాంత్

సంగీతం: మార్క్ కే రాబిన్

సినిమాటోగ్రఫీ: వెంకట్ శాఖమూరి

విడుదల తేది: 25 డిసెంబర్ 2025

తెలుగు వెండితెరపై పల్లెటూరి కథలకు, సహజత్వానికి ఎప్పుడూ పెద్దపీట వేస్తున్నారు. ‘బలగం’ సినిమా ఎలాంటి ఆదరణ పొందిందో తెలిసిందే. అదే బాటలో, మనిషి చనిపోయిన తర్వాత జరిగే అంతిమ సంస్కారాల నేపథ్యంలో, కుల వివక్ష అనే ఒక సున్నితమైన అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కిన చిత్రం ‘దండోరా’.

మురళీకాంత్ దర్శకత్వంలో బిగ్ బాస్ శివాజీ, నవదీప్, బిందు మాధవి, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి తదితరులతో రూపొందిన దండోరా ఇవాళ (డిసెంబర్ 25) థియేటర్లలో విడుదల కానుంది. అయితే, రిలీజ్‌కు రెండు రోజుల ముందే మీడియాకు దండోరా స్పెషల్ షో వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి దండోరా రివ్యూలో తెలుసుకుందా.

కథ:

మెదక్ జిల్లాలోని తుళ్లూరు అనే పల్లెటూరు. అక్కడ శివాజీ (శివాజీ) ఒక అగ్ర కులానికి చెందిన వ్యక్తి. ప్రాణం పోయినా సరే కుల గౌరవం తగ్గకూడదని భావించే రకం. అతని కొడుకు విష్ణు (నందు) సిటీలో ఉంటాడు, కూతురు (మనిక చిక్కాల) ఊళ్లోనే ఉంటుంది. అయితే, అతని కూతురు వేరే కులం అబ్బాయి (రవికృష్ణ)ని ప్రేమిస్తుంది. ఇది తెలిసిన శివాజీ ఆవేశంతో రగిలిపోతాడు.

అయితే, కొన్ని కారణాల వల్ల శివాజీ చనిపోతాడు. అతని శవాన్ని ఊరి శ్మశానంలో ఖననం చేసేందుకు కుల పెద్దలు ఒప్పుకోరు. దాంతో ఊరి జనం మధ్య గొడవ మొదలవుతుంది.

అసలు శివాజీని తన కులమే ఎందుకు బహిష్కరించింది? అతడి గతమేంటీ? ఆ ఊరి సర్పంచ్ (నవదీప్) ఈ విషయంలో ఏం చేశారు? శివాజీ కొడుకు విష్ణు అతనితో ఏళ్లుగా ఎందుకు మాట్లాడలేదు? వేశ్య శ్రీలత (బిందు మాధవి)కి శివాజీకి ఉన్న సంబంధం ఏంటీ? అనేది తెలియాలంటే దండోరా చూడాల్సిందే.

విశ్లేషణ:

దర్శకుడు మురళీకాంత్ ఒక సున్నితమైన, వివాదాస్పదమైన పాయింట్‌ను ఎంచుకున్నప్పటికీ, దానిని ఎంతో హుందాగా తెరకెక్కించారు. కులం పేరుతో బాధితులయ్యేది కేవలం తక్కువ కులం వారే కాదు, అగ్ర కులం వారు కూడా ఎలా నష్టపోతారో ఇందులో చూపించడం విశేషం.

మొదటి భాగంలో పాత్రల పరిచయంతో కథ కాస్త నెమ్మదిగా సాగినా, ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం ఎంతో భావోద్వేగంగా ఉంటుంది. ద్వితీయార్థంలో వచ్చే మలుపులు, ముఖ్యంగా అంతిమ సంస్కారాల సమయంలో జరిగే డ్రామా ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. మన ఊళ్లు, మన కట్టుబాట్లు, మనుషుల మధ్య అంతరాలు ఇంకా ఎంత బలంగా ఉన్నాయో దర్శకుడు కళ్లకు కట్టినట్లు చూపించారు.

కొన్ని సందర్భాల్లో వచ్చే సంభాషణలు చాలా బాగా తాకుతాయి. కులానికి సంబంధించి చావు, పుట్టుక, ప్రేమ, పెళ్లి, పరపతి, అధికారం అన్ని అంశాలను టచ్ చేసి మరి డైరెక్టర్ చూపించారు. ఓ హత్యతో ఇంటర్వెల్ ముగుస్తుంది. ఆ తర్వాత సెకండాఫ్‌ మరింత ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. హత్య చేసిన వ్యక్తి వేదన, కుటుంబ పరువు వంటి అంశాలతో ఎంగేజింగ్‌గా తెరకెక్కించారు.

క్లైమాక్స్, నటీనటుల ప్రదర్శన:

క్లైమాక్స్‌ను కూడా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ఎండ్ చేశారు. హృదయాన్ని హత్తుకునేలా క్లైమాక్స్ ఉంటుంది. ఇకపోతే ఈ సినిమాకు వెన్నెముకగా శివాజీ నిలిచారు. ఒక కఠినమైన కుల పిచ్చి ఉన్న తండ్రిగా ఆయన అద్భుతమైన నటన కనబరిచారు. కోర్ట్ మంగపతి తర్వాత అంతటి పవర్‌ఫుల్ రోల్‌తో మెప్పించారు.

సర్పంచ్ పాత్రలో నవదీప్ హుందాగా నటించి ఆకట్టుకున్నాడు. బిందు మాధవి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. రవికృష్ణ, మౌనికా రెడ్డి, నందు, మనిక చిక్కాల తదితరులు అంతా తమ పాత్రల్లో ఒదిగిపోయి ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం:

వెంకట్ శాఖమూరి సినిమాటోగ్రఫీ పల్లెటూరి వాతావరణాన్ని చాలా సహజంగా చూపించింది. 2004-19 నాటి కాలాన్ని బాగా చూపించారు. మార్క్ కె. రాబిన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాలోని ఎమోషన్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

ఫైనల్‌గా చెప్పాలంటే:

‘దండోరా’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, సమాజంలోని ఒక చేదు నిజాన్ని ఎండగట్టేందుకు చేసిన ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. కమర్షియల్ హంగులు లేకుండా కంటెంట్‌తో సాగే దండోరాను ఓసారి చూసేయొచ్చు.

రేటింగ్: 3/5

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More