Dhurandhar 2 OTT: పాకిస్థాన్‌లో 'ధురంధర్ 2' సంచలనం.. ర‌ణ్‌వీర్ సింగ్‌ క్రేజ్‌కు నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు క్రాష్!

Dhurandhar 2 OTT: ర‌ణ్‌వీర్ సింగ్‌ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్: ది రివెంజ్' ఓటీటీలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. పాకిస్థాన్‌లో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు సైతం డౌన్ అయ్యాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Published on: May 16, 2026, 13:51:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Dhurandhar 2 OTT: థియేటర్లలో భారీ వసూళ్లతో సరికొత్త చరిత్ర సృష్టించిన బాలీవుడ్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ ‘ధురంధర్: ది రివెంజ్’ (ధురంధర్ 2) ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్, సరిహద్దులు దాటి మరీ తన క్రేజ్‌ను చాటుకుంటోంది.

ధురంధర్ 2 ఓటీటీ (kaamwalibaat/Instagram)
ధురంధర్ 2 ఓటీటీ (kaamwalibaat/Instagram)

ధురంధర్ 2 ఓటీటీ

స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2 ఓటీటీలో అదరగొడుతోంది. అంతర్జాతీయంగా నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిజిటల్ ప్రీమియర్ అవుతున్న ఈ చిత్రానికి పొరుగు దేశమైన పాకిస్థాన్ లో ఊహించని రీతిలో భారీ రెస్పాన్స్ లభిస్తోంది. అక్కడ ట్రెండింగ్ నంబర్ వన్ లోకి మూవీ దూసుకెళ్లింది.

నెట్‌ఫ్లిక్స్ సర్వర్స్ క్రాష్

ధురంధర్ 2 అంతర్జాతీయంగా విడుదలైన కొద్దిసేపటికే పాకిస్థాన్ లో నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు ఒక్కసారిగా డౌన్ అయ్యాయని, విపరీతమైన ట్రాఫిక్ కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తాయనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్ మావియా ఉమర్ ఫారూఖీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమా కోసం అక్కడి ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ఆయన ఆ వీడియోలో వెల్లడించారు.

"పాకిస్తాన్‌లో ఈ రోజే ధురంధర్ 2 సినిమా విడుదలైంది, ఇక్కడ నెట్‌ఫ్లిక్స్ సర్వర్ క్రాష్ అయిపోయింది. అర్ధరాత్రి 12 గంటలకి ఎప్పుడు లింక్ యాక్టివేట్ అవుతుందా అని పాక్ నెటిజన్లు ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. సినిమా రాగానే అందరూ ఒకేసారి క్లిక్ చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది’’ అని ఫారూఖీ తెలిపాడు.

ధురంధర్ క్రేజ్

‘‘ధురంధర్ క్రేజ్ ఇక్కడ ఏ స్థాయిలో ఉందో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. సినిమాలో చూపించిన కథ ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది పక్కన పెడితే.. అసలు ఈ సినిమాను ఎలా తీశారో చూడాలనే కుతూహలం అందరిలోనూ ఉంది. రణ్‌వీర్ సింగ్ క్యారెక్టర్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. కరాచీలోని లియారీ ప్రాంతంలో నిజంగానే అలాంటి ఘటనలు జరిగాయా లేదా అనేది తర్వాత మాట్లాడుకుందాం, ప్రస్తుతానికైతే సినిమా చూడటానికే అంతా ఆసక్తి చూపిస్తున్నారు’’ అని మావియా ఉమర్ ఫారూఖీ పేర్కొన్నాడు.

బఫరింగ్ విజువల్స్

సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసిన వీడియోలో మావియా ఉమర్ ఫారూఖీ నెట్‌ఫ్లిక్స్‌లో ధురంధర్ 2 సినిమాను ప్లే చేసి చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఆ వీడియో లోడ్ అవ్వకుండా పదే పదే బఫరింగ్ అవుతూ ఆగిపోవడం అందులో కనిపించింది. తన వైఫై ఇంటర్నెట్ కనెక్షన్ చాలా అద్భుతంగా పనిచేస్తోందని, కేవలం నెట్‌ఫ్లిక్స్ సర్వర్‌పై ఒత్తిడి పడటం వల్లే ఈ సమస్య తలెత్తిందని అతను స్పష్టం చేశాడు.

ట్రెండింగ్ నంబర్ వన్

ఆ తర్వాత ఫారూఖీ మరో వీడియోను షేర్ చేస్తూ.. పాకిస్థాన్ నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ జాబితాలో ధురంధర్ 2 మొదటి స్థానంలో నిలిచిందని అధికారిక స్క్రీన్ షాట్‌ను కూడా పంచుకున్నారు. ఈ సర్వర్ సమస్యలపై నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం అధికారికంగా స్పందించనప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ చర్చ జోరుగా సాగుతోంది.

2025 డిసెంబర్ 5న విడుదలైన ‘ధురంధర్’ మొదటి భాగానికి సీక్వెల్‌గా ఈ ‘ధురంధర్: ది రివెంజ్’ (ధురంధర్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఏడాది మార్చి 19న థియేటర్లలో విడుదలైన ఈ రెండో భాగం.. పాకిస్థాన్ లోని లియారీ నగరంలో ఉగ్రవాద ముఠాలను అంతమొందించేందుకు వెళ్లిన అండర్ కవర్ ఆపరేటివ్ జస్కీరత్ సింగ్ రంగీ (హంజా అలీ మజారీ) కథతో సాగుతుంది.

బ్లాక్ బస్టర్

ధురంధర్ 2 మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడి, గౌరవ్ గేరా, డానిష్ పాండ్యర్ కీలక పాత్రలు పోషించారు.

ఇండియాలో ఎప్పుడంటే?

ధురంధర్ 2 ఇప్పటికే ఇండియా మినహా మిగతా దేశాల్లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ మూవీ ఇండియా స్ట్రీమింగ్ హక్కులను జియోహాట్‌స్టార్ (JioHotstar) సొంతం చేసుకుంది. జూన్ 4, 2026 నుంచి భారతీయ వీక్షకులు జియోహాట్‌స్టార్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఈ డిజిటల్ ప్రీమియర్ కోసం జియోహాట్‌స్టార్ ఒక ప్రత్యేకమైన ఈవెంట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. ధురంధర్ 2 సినిమా భారతదేశంలో ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది?

ధురంధర్ 2 (ధురంధర్: ది రివెంజ్) చిత్రం భారతదేశంలో ‘జియోహాట్‌స్టార్’ (JioHotstar) వేదికగా విడుదల కానుంది.

2. ఇండియన్ ఆడియన్స్ కోసం ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది?

భారతదేశంలోని ప్రేక్షకులు జూన్ 4, 2026 నుంచి జియోహాట్‌స్టార్‌లో ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను స్ట్రీమింగ్ చేసుకోవచ్చు.

3. పాకిస్తాన్‌లో నెట్‌ఫ్లిక్స్ సర్వర్ క్రాష్ అవ్వడానికి కారణం ఏంటి?

నెట్‌ఫ్లిక్స్‌లో అంతర్జాతీయంగా ధురంధర్ 2 సినిమా విడుదలవ్వగానే, పాకిస్థాన్ లోని నెటిజన్లు ఏకకాలంలో పెద్ద సంఖ్యలో సినిమా చూడటానికి లాగిన్ అవ్వడం వల్ల అక్కడి సర్వర్లపై ఒత్తిడి పెరిగి తాత్కాలికంగా బఫరింగ్ సమస్యలు తలెత్తాయని స్థానిక కంటెంట్ క్రియేటర్లు తెలిపారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More