అతడి చూపు నన్ను మార్చేసింది.. నాలుగేళ్లు బ్రేక్ తీసుకున్నాను.. గడ్డం పెంచుకొని దేశమంతా తిరిగాను: మాధవన్ కామెంట్స్
ప్రముఖ నటుడు మాధవన్ తన కెరీర్లో నాలుగేళ్ల బ్రేక్ తీసుకోవడంపై స్పందించాడు. తాను చేస్తున్న పనిపై విరక్తితో ఆ నిర్ణయం తీసుకున్నానని, తిరిగి వచ్చిన తర్వాతే అసలు జనాలకు తన నుంచి ఏం కావాలో తెలుసుకున్నట్లు వెల్లడించాడు.
ప్రేక్షకులను అలరించడానికి ఏదో ఒక కొత్తదనంతో ముందుకొచ్చే నటుడు ఆర్. మాధవన్. 'విక్రమ్ వేద', 'రాకెట్రీ', 'సైతాన్' వంటి విలక్షణ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాధవన్.. త్వరలో ‘ధురంధర్: ది రివెంజ్’తో మరోసారి రాబోతున్నాడు. అయితే 2016లో 'సాలా ఖడూస్' (తెలుగులో గురు) సినిమాకు ముందు అతడు దాదాపు నాలుగేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తాజాగా 'అన్‌ఫిల్టర్డ్ ఎంటర్‌టైన్‌మెంట్' షోలో మాధవన్ బయటపెట్టాడు.

ఆ స్విస్ రైతు చూపు నన్ను మార్చేసింది
ఆ సమయంలో తాను చేస్తున్న పనుల పట్ల తనకు అసంతృప్తి ఉండేదని మాధవన్ తెలిపాడు. "ఒకసారి స్విట్జర్లాండ్‌లో ఓ తమిళ పాట షూటింగ్ జరుగుతోంది. నేను డ్యాన్స్ చేస్తున్నాను. అక్కడ ఒక స్విస్ రైతు టీ తాగుతూ నన్ను చాలా ఈసడింపుగా చూశాడు. 'వీళ్ళేంటి ఇలా గెంతుతున్నారు' అన్నట్టుగా ఉంది ఆయన చూపు. మొదట నాకు చాలా కోపం వచ్చింది. కానీ వెంటనే నా బుర్రలో లైట్ వెలిగింది" అని మాధవన్ గుర్తు చేసుకున్నాడు.
"నిజమే కదా.. నేను ఇతరుల ట్యూన్స్ కు అనుగుణంగా ఆడుతున్నాను. నాకు గుర్రపు స్వారీ వచ్చు, తుపాకులు వాడటం వచ్చు, పబ్లిక్ స్పీకింగ్ వచ్చు, రిమోట్ విమానాలు నడపగలను.. ఇన్ని నైపుణ్యాలు ఉండి కూడా సినిమాల్లో అవేవీ చూపించకుండా కేవలం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికే ప్రయత్నిస్తున్నాను. సూపర్ స్టార్ అవ్వాలనే తాపత్రయంలో నేను చేస్తున్న తప్పు నాకు అప్పుడే అర్థమైంది" అని మాధవన్ నిజాయితీగా అంగీకరించాడు.
భార్య అడిగిన ఆ ఒక్క ప్రశ్న..
తనలోని అసంతృప్తిని తన భార్య సరిత ముందే గుర్తించిందని మాధవన్ చెప్పాడు. "ఒకరోజు నా భార్య నన్ను అడిగింది.. 'అసలు నీకేమైంది? షూటింగ్ నుంచి ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేద్దామా అన్నట్టుగానే పనికి వెళ్తున్నావ్' అని. ఆ మాటలో నాకు చాలా అర్థం కనిపించింది. అందుకే బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను" అని అతడు వివరించాడు.
నాలుగేళ్లు దేశమంతా తిరిగి..
ఆ నాలుగేళ్ల బ్రేక్ లో తాను ఏం చేశానో మాధవన్ వెల్లడించాడు. "నేను యాడ్స్ చేయడం ఆపేశాను. గడ్డం పెంచాను. చెన్నైతో పాటు దేశవ్యాప్తంగా సామాన్యుడిలా తిరిగాను. ఆటోవాలాలతో మాట్లాడేవాడిని. వాళ్లకు నిజంగా ఏది ముఖ్యం? ఏ ఖర్చులు వాళ్ళని భయపెడుతున్నాయి? దేశం ఎటు వెళ్తోంది అన్నది తెలుసుకున్నాను. ఆ నాలుగేళ్ల అనుభవమే ఇప్పుడు నన్ను నటుడిగా నిలబెట్టింది" అని అతడు అన్నాడు.
ఆ బ్రేక్ తర్వాతే తనకు అర్థమైంది.. తాను అప్పటివరకు పనిచేసిన దర్శకుల ఆలోచనా విధానం కన్నా తన ఆలోచనలు ఇంకాస్త ముందున్నాయని, అందుకే కొత్తవారితో ప్రయాణం మొదలుపెట్టానని తెలిపాడు.
'టాక్సిక్'తో తలపడనున్న ‘ధురంధర్ 2’
ఇక మాధవన్ సినిమాల విషయానికి వస్తే.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో 2025లో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'ధురంధర్'కు సీక్వెల్‌గా 'ధురంధర్: ది రివెంజ్' రాబోతోంది. ఇందులో మాధవన్ ఐబీ డైరెక్టర్ అజయ్ సన్యాల్ (అజిత్ దోవల్ పాత్ర ఆధారంగా) పాత్రలో మరోసారి కనిపించనున్నాడు.
రణ్‌వీర్ సింగ్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి స్టార్లు ఉన్న ఈ మూవీ మార్చి 19న విడుదల కానుంది. యశ్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమాతో ఇది బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. మొదటి భాగం కేవలం హిందీలో విడుదలవ్వగా.. ఈ సీక్వెల్ మాత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


