Dibyendu Bhattacharya: నల్లగా ఉన్నానని వద్దన్నారు.. యాడ్ చేయనివ్వలేదు.. బాలీవుడ్ వివక్షపై నటుడు దివ్యేందు షాకింగ్ నిజాలు

Dibyendu Bhattacharya: సినీ పరిశ్రమలో వేళ్లూనుకున్న వర్ణ వివక్షపై నటుడు దివ్యేందు భట్టాచార్య షాకింగ్ నిజాలు బయటపెట్టాడు. కేవలం రంగు కారణం చూపి షూటింగ్‌కు మూడు రోజుల ముందు తనను యాడ్ నుంచి తొలగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

Published on: May 7, 2026, 05:57:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Dibyendu Bhattacharya: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రతిభ కంటే రంగుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తాజాగా వెర్సటైల్ యాక్టర్ దివ్యేందు భట్టాచార్య చేసిన వ్యాఖ్యలు ఈ చర్చను మరోసారి తెరపైకి తెచ్చాయి. బాలీవుడ్‌లో వర్ణ వివక్ష (Racism) అనేది చాలా లోతుగా పాతుకుపోయిన సమస్య అని, ఇది నటీనటుల ఎంపికపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన కుండబద్దలు కొట్టాడు.

దివ్యేందు భట్టాచార్య (x/debu_dibyendu)
దివ్యేందు భట్టాచార్య (x/debu_dibyendu)

నల్లగా ఉన్నానని

కేవలం నలుపు రంగులో ఉన్నాననే కారణంతో ఒక పెద్ద యాడ్ ఫిల్మ్ నుంచి తనను అర్ధాంతరంగా తొలగించారని దివ్యేందు భట్టాచార్య వెల్లడించాడు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సినిమా రంగంలో ఇప్పటికీ చర్మం రంగును బట్టే అవకాశాలు ఇస్తున్నారని బాలీవుడ్ గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టాడు.

చేదు అనుభవం

తనకు ఎదురైన చేదు అనుభవాన్ని దివ్యేందు వివరిస్తూ.. "ఇది చాలా కాలంగా కొనసాగుతున్న సమస్య. కొన్ని రోజుల క్రితమే ఒక యాడ్ షూటింగ్ కోసం నన్ను ఎంపిక చేశారు. దాదాపు నాలుగైదు రోజుల పాటు చర్చలు జరిగాయి. షూటింగ్‌కు కేవలం మూడు రోజుల సమయం ఉందనగా, అసలు షూట్ ఉందో లేదో అని నేను వారిని అడిగాను’’ అని తెలిపాడు.

దానికి వారు స్పందిస్తూ.. ‘‘లేదు దాదా, మిమ్మల్ని మార్చేస్తున్నాం. ఎందుకంటే మీరు నల్లగా ఉన్నారు. మాకు నల్లగా ఉండే నటుడు వద్దు’’ అని ముఖం మీదే చెప్పారని దివ్యేందు సంచలన విషయాలు వెల్లడించాడు.

విద్యా వ్యవస్థలోనే లోపం

ఈ వివక్షకు మూలకారణం మన పెంపకం, విద్యా వ్యవస్థలోనే ఉందని దివ్యేందు పేర్కొన్నాడు. "ఇది చాలా దురదృష్టకరం, కానీ మనం ఏమీ చేయలేం. ప్రాథమిక విద్యలోనే సామాజిక నైతికత, విలువలను బోధించకపోతే ఎలాంటి మార్పు రాదు. జపాన్, కొరియా వంటి దేశాల్లో పిల్లలకు చిన్నతనం నుంచే క్రమశిక్షణ, ఎదుటివారి పట్ల సానుభూతిని నేర్పిస్తారు. మన దగ్గర ఆ బాధ్యత కేవలం ఇంటికే పరిమితమైంది. ఇంట్లో మంచి విలువలు నేర్పిస్తేనే పిల్లలు సభ్యతతో పెరుగుతున్నారు. కానీ సమాజం ఆ పాత్రను పోషించడం లేదు" అని దివ్యేందు అభిప్రాయపడ్డాడు.

దివ్యేందు భట్టాచార్య కెరీర్

ఇటీవలే దివ్యేందు 'ఉందేఖి' (Undekhi) సీజన్ 4లో కనిపించారు. మే 1న సోనీ లివ్‌లో విడుదలైన ఈ సిరీస్‌కు ఆశిష్ ఆర్ శుక్లా దర్శకత్వం వహించాడు. ఇందులో హర్ష్ ఛాయా, సూర్య శర్మ, గౌతమ్ రోడే వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. దీనికి ముందు నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన 'మామ్లా లీగల్ హై 2' సిరీస్‌లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు దివ్యేందు. రవి కిషన్, కుషా కపిల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More