మా సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల రూ.50 కోట్లు నష్టపోయాం.. 35 కట్స్ చెప్పారు.. నేను ఒప్పుకోలేదు: కూలీ డైరెక్టర్
ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ‘కూలీ’ సినిమా విడుదల సమయంలో ఎదుర్కొన్న సెన్సార్ సమస్యల గురించి బయటపెట్టాడు. సెన్సార్ బోర్డు సూచించిన కట్స్ కు తాను ఒప్పుకోకపోవడం వల్ల ‘ఎ’ సర్టిఫికెట్ తీసుకోవాల్సి వచ్చిందని, దీనివల్ల భారీగా నష్టపోయామని అతడు వెల్లడించాడు.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ బ్లాక్‌బస్టర్ అయిన సంగతి తెలుసు కదా. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకుపైగా వసూలు చేసింది. కానీ ఈ మూవీకి వచ్చిన ‘ఎ’ సర్టిఫికెట్ వల్ల తాము మరో రూ.50 కోట్లు కోల్పోయినట్లు తాజాగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వెల్లడించాడు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) మొదట 35 కట్స్ చెప్పిందని, తర్వాత సినిమాకు 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చిందని చెప్పాడు.

‘కూలీ’ సినిమాకు సెన్సార్ చిక్కులు
దళపతి విజయ్ నటిస్తున్న 'జన నాయగన్' సినిమా సెన్సార్ సర్టిఫికెట్ కోసం ఇబ్బందులు పడుతున్న వార్తల నేపథ్యంలో.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మీడియాతో మాట్లాడుతూ తన సినిమా 'కూలీ' కూడా సెన్సార్ బోర్డుతో పడ్డ ఇబ్బందులను వివరించాడు.
సెన్సార్ బోర్డు మొదట 35 కట్స్ సూచించిందని లోకేష్ చెప్పాడు. కానీ ఈ మార్పులు చేస్తే సినిమా ఇంపాక్ట్ దెబ్బతింటుందని తాను భావించినట్లు తెలిపాడు. మరోసారి పరిశీలిస్తారనే జరుగుతుందనే ఆశతో.. నిర్మాతలు మళ్లీ సెన్సార్ కోసం దరఖాస్తు చేసినప్పుడు కూడా ఫలితం మారలేదట.
"వారు అడిగిన 9 పదాలను మ్యూట్ చేయడానికి నేను ఒప్పుకున్నాను. కానీ 35 కట్స్ కి నో చెప్పాను. 'ఎ' సర్టిఫికెట్‌తో పూర్తి సినిమాను విడుదల చేయాలా లేక 'యూ/ఏ' సర్టిఫికెట్‌తో అసంపూర్ణమైన సినిమాను విడుదల చేయాలా అనేదే మా ముందున్న ప్రశ్న. మేము రీ-సెన్సార్ కోసం వెళ్లాము. కానీ వారు మళ్లీ అవే 35 కట్స్ సూచించారు" అని అతడు వెల్లడించాడు.
రాజీపడటం ఇష్టం లేకే..
కూలీ మూవీ కథ విషయంలో రాజీ పడటానికి లోకేష్ ఇష్టపడలేదు. కట్స్ వద్దనుకుంటే సినిమాకు 'ఎ' సర్టిఫికెట్ తీసుకోవచ్చని అవకాశం ఇచ్చారు. సినిమాలో మిగతా అన్నింటికంటే.. ఎలక్ట్రిక్ క్రిమేషన్ చూపించడమే సినిమాకు 'యూ' లేదా 'యూ/ఏ' సర్టిఫికెట్ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణమని దర్శకుడు వెల్లడించాడు.
సినిమాలోని సీన్స్ కత్తిరించకూడదని నిర్ణయించుకున్న లోకేష్.. సెన్సార్ బోర్డు ఇచ్చిన 'ఎ' సర్టిఫికెట్‌తోనే సినిమాను విడుదల చేశాడు. అయితే దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. పరిమిత ప్రేక్షకులు మాత్రమే సినిమాను చూడగలిగారు కాబట్టి.. దీనివల్ల సినిమాకు రూ. 40 నుంచి 50 కోట్ల నష్టం వాటిల్లిందని దర్శకుడు పేర్కొన్నాడు.
‘కూలీ’ సినిమా విశేషాలు
రజనీకాంత్ కాకుండా 'కూలీ' సినిమాలో నాగార్జున అక్కినేని, సౌబిన్ సాహిర్, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, రచితా రామ్ నటించారు. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్, పూజా హెగ్డే కూడా అతిథి పాత్రల్లో కనిపించారు. గతేడాది ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేయగలిగింది.
లోకేష్ కనగరాజ్ త్వరలో అల్లు అర్జున్‌తో ఇంకా పేరు పెట్టని సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అలాగే కార్తీతో చేయబోయే 'ఖైదీ 2' సినిమా కూడా అల్లు అర్జున్ మూవీ తర్వాతే పట్టాలెక్కుతుందని అతడు స్పష్టం చేశాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


