అల్లు అర్జున్‌తో మూవీ తర్వాత నేను చేసేది ఖైదీ 2నే.. ఆ 3 సినిమాలను కచ్చితంగా పూర్తి చేస్తా: లోకేష్ కనగరాజ్
డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన ఖైదీ 2 ప్రాజెక్ట్ తోపాటు ఇతర మచ్ అవేటెడ్ సినిమాల గురించి మాట్లాడాడు. తాను అనుకున్న ఆ మూడు సినిమాలను కచ్చితంగా పూర్తి చేస్తానని స్పష్టం చేశాడు. అతడు ఇంకా ఏమన్నాడో చూడండి.
లోకేష్ కనగరాజ్, కార్తీ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ఖైదీ. ఈ సినిమాకు సీక్వెల్ కూడా రావాల్సి ఉంది. అయితే దీనిని పక్కన పెట్టేసినట్లుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ తాజాగా దీనిపై లోకేష్ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. అల్లు అర్జున్ తో మూవీ తర్వాత తాను చేయబోయేది ఖైదీ 2నే అని స్పష్టం చేశాడు.

ఖైదీ 2తోపాటు ఆ మూడు సినిమాలు చేస్తా
'ఖైదీ 2' సినిమాను పక్కన పెట్టేసినట్లే అని వస్తున్న పుకార్లను లోకేష్ కనగరాజ్ పూర్తిగా ఖండించాడు. తన నెక్ట్స్ మూవీ అల్లు అర్జున్‌తోనే ఉంటుందని, ఆ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే 'ఖైదీ' సీక్వెల్ పనులు మొదలవుతాయని అతడు చెప్పాడు. కేవలం రెమ్యునరేషన్ కోసమే తాను 'ఖైదీ 2'ను ఆపేశానన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కూడా లోకేష్ వివరణ ఇచ్చాడు. ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న తన సినిమాటిక్ యూనివర్స్ గురించి మాట్లాడుతూ.. ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ సినిమాలు కచ్చితంగా ఉంటాయని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తానని అతడు తేల్చి చెప్పాడు.
అందుకే ఆ మూవీ చేయలేదు
అంతేకాకుండా మొదట తన దర్శకత్వంలో అనుకున్న రజనీకాంత్ - కమల్ హాసన్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ గురించి, తర్వాత ఆ సినిమాకు దర్శకుడు మారడం వెనుక అసలు కారణం గురించి కూడా లోకేష్ వెల్లడించాడు. 'కూలీ' సినిమా తర్వాత వీరిద్దరి కలయికలో ఓ సినిమా చేయాలని వారు కోరడంతో, ఆ ఇద్దరు దిగ్గజ నటుల కోసం పూర్తి స్థాయి యాక్షన్ కథను సిద్ధం చేశానని లోకేష్ చెప్పాడు.
"నేను నెలన్నర పాటు చాలా చిత్తశుద్ధితో ఆ కథపై పనిచేశాను. అది వారిద్దరికీ చాలా బాగా నచ్చింది. కానీ వారి సినీ ప్రయాణంలో ఇప్పటివరకు అనేక యాక్షన్ సినిమాలు చేసి ఉండటంతో, వారు ఈసారి సింపుల్, ఎంటర్టైనింగ్ సినిమాను ఆశించారు. నాకు అలాంటి సినిమాలు తీయడం రాదు. ఆ విషయాన్ని వారికి నిజాయితీగా చెప్పి ఆ ప్రాజెక్ట్ నుంచి గౌరవంగా తప్పుకున్నాను" అని అతడు తెలిపాడు.
లోకేష్ ఇంకా ఏమన్నాడంటే?
తాను ఆ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో హీరో కార్తీ వేరే సినిమాలకు ఒప్పుకోవడం వల్లే 'ఖైదీ 2' ఆలస్యం అయిందని లోకేష్ అన్నాడు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో అల్లు అర్జున్‌తో సినిమా చేస్తానని తాను ముందే మాట ఇచ్చానని, ఆ మాట ప్రకారమే ఇప్పుడు సినిమా చేస్తున్నానని చెప్పాడు.
అల్లు అర్జున్ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే తన ఎల్.సి.యు సినిమాలను మొదలుపెడతానని చెప్పాడు. 'కూలీ' విడుదలకు ముందు కూడా లోకేష్ ఫలితంపై చాలా నమ్మకంతో ఉన్నాడు. కానీ అది భారీ అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ఖైదీ 2 ఆగిపోలేదన్న భరోసాతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈమధ్యే కార్తీ కూడా ఖైదీ 2 మూవీపై స్పందించిన విషయం తెలిసిందే. తన వా వాతియార్ మూవీ గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఈ ప్రశ్న అడగ్గా.. దీనిపై లోకేషే స్పందిస్తాడని చెప్పాడు.

E-Paper












