చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.
Vetrimaaran Dhanush: ఆ క్లాసిక్ సినిమాతో ధనుష్ మూవీని పోల్చడం అవమానించడమే.. డైరెక్టర్ వెట్రిమారన్ కామెంట్స్
Vetrimaaran About Dhanush Polladhavan: ధనుష్‌తో తెరకెక్కించిన తన తొలి సినిమా 'పొల్లాదవన్'ను ఇటాలియన్ క్లాసిక్ హిట్ మూవీతో పోల్చడంపై తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ ఘాటుగా స్పందించారు. ఆ మహా కావ్యంతో తన సినిమాను పోల్చడం దాన్ని అవమానించడమేనని ఆయన స్పష్టం చేశారు.
Vetrimaaran About Dhanush Polladhavan: భారతీయ సినీ పరిశ్రమలో వాస్తవికతకు అద్దం పట్టే దర్శకుడిగా వెట్రిమారన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆయన సినిమాలకు విపరీతమైన ఆదరణ లభిస్తుంటుంది.

24 ఏళ్ల కుర్రాడైన ధనుష్ హీరోగా
2007లో అప్పటికి 24 ఏళ్ల కుర్రాడైన ధనుష్ హీరోగా వెట్రిమారన్ తెరకెక్కించిన తొలి చిత్రం 'పొల్లాధవన్' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. తెలుగులో వరుణ్ సందేశ్ హీరోగా 'కుర్రాడు' పేరుతో రీమేక్ అయిన ఈ చిత్రం విడుదలైన నాటి నుంచి ఒక చర్చ నడుస్తూనే ఉంది.
1948 నాటి ప్రపంచ ప్రఖ్యాత ఇటాలియన్ క్లాసిక్ సినిమా 'బైసికిల్ థీవ్స్' ఆధారంగానే వెట్రిమారన్ ఈ కథ రాసుకున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. తాజాగా ఈ విమర్శలపై వెట్రిమారన్ కుండబద్దలు కొట్టినట్లు సమాధానమిచ్చారు.
ఆ క్లాసిక్ సినిమాతో పోల్చడం నేరమే: వెట్రిమారన్
ఇటీవల జరిగిన '#IFP16' వేడుకలో రౌనక్ మంగోట్టిల్‌తో జరిగిన సంభాషణలో వెట్రిమారన్ ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'బైసికిల్ థీవ్స్' సినిమాతో తన తొలి చిత్రాన్ని పోల్చడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
"నేను ఈ కథ రాయడం మొదలుపెట్టినప్పుడే, ఇది 'బైసికిల్ థీవ్స్' నుంచి కాపీ కొట్టారని జనం అంటారని నాకు ముందే తెలుసు. దానికి నా దగ్గర ఎప్పుడూ ఒకే సమాధానం ఉంటుంది. 'పొల్లాధవన్' సినిమాను 'బైసికిల్ థీవ్స్'తో పోల్చడం ఆ కళాఖండాన్ని అవమానించడమే అవుతుంది. దయచేసి ఎవరూ అలా పోల్చవద్దు. నేను అందరికీ ఇదే చెబుతాను, ఇప్పుడు ఇక్కడా అదే మాట చెబుతున్నాను" అని వెట్రిమారన్ స్పష్టం చేశారు.
విట్టోరియో డి సికా దర్శకత్వం వహించిన 'బైసికిల్ థీవ్స్' కంటే తన సినిమాలో వాదోపవాదాలు, ఘర్షణ ఎక్కువగా ఉంటాయని ఆయన వివరించారు. నిజానికి తన స్నేహితుడు ఆండ్రూ బైక్ దొంగతనానికి గురైన నిజ జీవిత ఘటనే తనకు 'పొల్లాధవన్' కథ రాయడానికి అసలైన స్ఫూర్తినిచ్చిందని వెట్రిమారన్ వెల్లడించారు.
ధనుష్ ఇమేజ్ కోసం కథలో మార్పులు
తొలుత ఈ కథను వేరే కోణంలో అనుకున్నప్పటికీ, ధనుష్ వయసు, అప్పటి ఆయన స్క్రీన్ ఇమేజ్‌కు తగ్గట్లుగా స్క్రిప్ట్‌లో కీలక మార్పులు చేసినట్లు వెట్రిమారన్ తెలిపారు. మొదట ఒక పెద్ద వయసు హీరో తన తమ్ముడికి బైక్ కొనిచ్చి చిక్కుల్లో పడేలా కథ అనుకున్నారు.
కానీ ధనుష్ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాక, ఒక గ్యాంగ్‌స్టర్‌కు సామాన్యుడికి మధ్య జరిగే పోరాటాన్ని కాస్తా.. గ్యాంగ్‌స్టర్ తమ్ముడికి, ఒక సామాన్య యువకుడికి మధ్య పోరుగా మార్చారు. "అప్పటి ధనుష్ స్క్రీన్ ఇమేజ్ ప్రకారం ఒక పెద్ద గ్యాంగ్‌స్టర్‌తో తలపడి గెలవడం ప్రేక్షకులకు నమ్మశక్యంగా అనిపించదు. నాకు కూడా అది సహజంగా అనిపించలేదు" అని వెట్రిమారన్ పేర్కొన్నారు.
అందుకే పొల్లాధవన్ సినిమా క్లైమాక్స్ నాటికి ఆ గ్యాంగ్‌స్టర్ తమ్ముడి పాత్రను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దే మార్గాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు. కథానాయకుడు, ప్రతినాయకుడు ఇద్దరూ తమ తమ కుటుంబ పెద్దల మెప్పు పొందడానికి ప్రయత్నించే కోణంలో ఈ కథను నడిపించినట్లు వివరించారు.
రెండు సినిమాల కథాంశం ఇదే..
రెండు సినిమాల్లోనూ చోరీకి గురైన వాహనం చుట్టూనే కథ తిరగడం వల్లే ఈ పోలికలు వస్తుంటాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రోమ్ నగర నేపథ్యంలో 'బైసికిల్ థీవ్స్' సాగుతుంది. తీవ్ర పేదరికంలో ఉన్న ఆంటోనియో రిక్కీ అనే తండ్రి, తన భార్య వస్తువులను తాకట్టు పెట్టి పోస్టర్లు అంటించే ఉద్యోగం కోసం ఒక సైకిల్ కొంటాడు.
ఉద్యోగంలో చేరిన మొదటి రోజే ఆ సైకిల్ చోరీకి గురవడంతో, తన చిన్నారి కొడుకుతో కలిసి ఆ తండ్రి పడే ఆవేదన, వెతుకులాట హృదయాలను పిండేస్తుంది. ఇక 'పొల్లాధవన్' విషయానికొస్తే.. మధ్యతరగతి యువకుడు ప్రభు శంకర్ (ధనుష్) తన తండ్రి (మురళి)తో గొడవపడి తీసుకున్న డబ్బుతో బైక్ కొంటాడు.
ఆ రెండు సినిమాలు చూసిన వారికి
కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయినా, ఆ బైక్ వచ్చాకే తనకు ఉద్యోగం దొరికిందని ప్రభు బలంగా నమ్ముతాడు. తన ప్రియురాలితో డేట్‌కు వెళ్లిన సమయంలో ఆ బైక్ దొంగతనానికి గురవడంతో, దాన్ని వెతికే క్రమంలో గ్యాంగ్‌స్టర్లతో వైరం పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఏమైందనేది పొల్లాధవన్, కుర్రాడు సినిమాలు చూసిన వారికి తెలిసిందే.
ప్రస్తుతం వెట్రిమారన్ తమిళ స్టార్ హీరో శింబు (సిలంబరసన్) ప్రధాన పాత్రలో 'అరసన్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సూపర్ హిట్ చిత్రం 'వడ చెన్నై' యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

E-Paper
