శ్రీకృష్ణుడు జన్మించిన చోట నేను నివసించాను, ఇప్పుడు ఆయనలాగే కొత్త యుద్ధం చేయాలి: డైరెక్టర్ విక్రమ్ భట్ షాకింగ్ కామెంట్స్

సుమారు రూ. 30 కోట్ల మోసం కేసులో అరెస్టయిన బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ ఉదయ్‌పూర్ జైలు నుంచి బెయిల్‌పై నిన్న విడుదలయ్యారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, జైలు అనుభవం తనను మరింత రాటుదేల్చిందని ఈ సందర్భంగా విక్రమ్ భట్ పేర్కొన్నారు.

Published on: Feb 21, 2026, 16:51:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ ఎట్టకేలకు జైలు నుంచి నిన్న (ఫిబ్రవరి 20) బయటకు వచ్చారు. రూ. 30 కోట్ల ఆర్థిక మోసం కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం ఆయన ఉదయ్‌పూర్ సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యారు. గతేడాది డిసెంబర్‌లో రాజస్థాన్ పోలీసులు ముంబైలో ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

శ్రీకృష్ణుడు జన్మించిన చోట నేను నివసించాను, ఇప్పుడు ఆయనలాగే కొత్త యుద్ధం చేయాలి: డైరెక్టర్ విక్రమ్ భట్ షాకింగ్ కామెంట్స్ (ANI Video Grab)
శ్రీకృష్ణుడు జన్మించిన చోట నేను నివసించాను, ఇప్పుడు ఆయనలాగే కొత్త యుద్ధం చేయాలి: డైరెక్టర్ విక్రమ్ భట్ షాకింగ్ కామెంట్స్ (ANI Video Grab)

సత్యం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ..

జైలు వెలుపల వేచి ఉన్న మీడియాతో విక్రమ్ భట్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కొంత తాత్విక ధోరణిలో డైరెక్టర్ స్పందించారు.

"గత రెండున్నర నెలలుగా నేను జైలు జీవితం గడిపాను. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందని నాకు మొదటి నుంచీ నమ్మకం ఉంది. జైలులో నాకు ఒక స్నేహితుడు పరిచయమయ్యాడు. మేవార్ మట్టిలో నిజం కొంతకాలం ఇబ్బందులు పడవచ్చు కానీ, అది ఎప్పటికీ ఓడిపోదు అని అతను నాకు చెప్పాడు. అదే మేవార్ మట్టిని తిలకంగా దిద్దుకుని ఇక్కడి నుంచి వెళ్తున్నాను" అని విక్రమ్ భట్ తెలిపారు.

కృష్ణుడి జన్మస్థలంతో పోలిక

తన జైలు అనుభవాన్ని వివరిస్తూ విక్రమ్ భట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "జైలు అనేది ఒక ఐదవ ధామం లాంటిది. నేను శ్రీకృష్ణుడి భక్తుడిని. ఆ భగవంతుడు జన్మించిన ప్రదేశంలోనే నేను కూడా గడిపాను. జైలుకు వెళ్లకముందు కంటే ఇప్పుడు రెట్టింపు శక్తితో, మరింత మంచి వ్యక్తిగా బయటకు వస్తున్నాను. కృష్ణుడిలాగే నేను కూడా ఇప్పుడు కొత్త యుద్ధం చేయాలి. మన దేశ న్యాయవ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. అందరికీ మేలు జరిగే తీర్పు వస్తుందని ఆశిస్తున్నాను" అని విక్రమ్ భట్ వివరించారు.

అసలు కేసు ఏంటి?

ఉదయ్‌పూర్‌కు చెందిన ఇందిరా ఐవీఎఫ్ (Indira IVF) అధినేత డాక్టర్ అజయ్ ముర్డియా ఫిర్యాదు మేరకు 2025 నవంబర్‌లో విక్రమ్ భట్, ఆయన భార్య శ్వేతాంబరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. నాలుగు సినిమాల నిర్మాణానికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకుని, తమ నుంచి తీసుకున్న రూ. 30 కోట్లను విక్రమ్ భట్ దంపతులు దారి మళ్లించారని ముర్డియా ఆరోపించారు.

కోర్టులో సవాలు చేస్తా

నకిలీ బిల్లులు, పత్రాలను సృష్టించి ఈ నిధులను దుర్వినియోగం చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. అయితే, విక్రమ్ భట్ మాత్రం ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుతానికి బెయిల్‌పై బయటకు వచ్చిన విక్రమ్ భట్, త్వరలోనే తనపై ఉన్న ఆరోపణలను కోర్టులో సవాలు చేస్తానని స్పష్టం చేశారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More