ప్రముఖ దర్శకుడు విక్రమ్ భట్, అతని భార్య అరెస్ట్- 200 కోట్ల ఆదాయం, 47 కోట్ల డీల్, 30 కోట్ల స్కామ్- బయోపిక్‌తో వివాదం!
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత విక్రమ్ భట్, ఆయన భార్య శ్వేతాంబరి భట్‌ను ఉదయ్‌పూర్ పోలీసులు ముంబైలో అరెస్ట్ చేశారు. ఒక సినిమా నిర్మాతకు రూ. 30 కోట్ల స్కామ్ చేశారనే ఆరోపణలపై రాజస్థాన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో మరికొంత మంది కూడా నిందితులుగా ఉన్నట్లు సమాచారం.
బాలీవుడ్‌లో హారర్, రొమాంటిక్ సినిమాలకు పేరుగాంచిన ప్రముఖ దర్శకుడు విక్రమ్ భట్, ఆయన భార్య శ్వేతాంబరి భట్‌ను ఉదయ్‌పూర్ పోలీసులు ఆదివారం ముంబైలో అరెస్ట్ చేశారు. తమ సినిమాను నిర్మించిన ఒక వ్యాపారవేత్త దాఖలు చేసిన మోసం, చీటింగ్ కేసుతో సంబంధం ఉన్న నేపథ్యంలో వీరిద్దరి అరెస్ట్ జరిగింది.

విక్రమ్ భట్‌పై ఉన్న ఆరోపణలు ఏమిటి?
రాజస్థాన్‌లో నమోదైన రూ. 30 కోట్ల స్కామ్ కేసులో భట్ దంపతులను అరెస్ట్ చేశారు. విక్రమ్, శ్వేతాంబరి భట్‌తో పాటు మరో ఆరుగురు నిందితులుగా ఉన్నారు. ఉదయ్‌పూర్‌కు చెందిన డాక్టర్ అజయ్ ముర్దియా (ఇందిరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు) ఫిర్యాదు మేరకు ఈ అరెస్ట్ జరిగింది.
పోలీస్ అధికారి ఒకరు వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ, "ఇందిరా ఐవీఎఫ్ ఆసుపత్రి యజమాని అయిన డాక్టర్ ముర్దియా తన దివంగత భార్య బయోపిక్‌ను తీయాలని అనుకున్నారు. ఈ ప్రాజెక్ట్ భట్ దంపతుల వద్దకు చేరింది. ఈ బయోపిక్ సినిమా ద్వారా సుమారు రూ. 200 కోట్ల ఆదాయం వస్తుందని నిందితులు ముర్దియాకు హామీ ఇచ్చారు" అని తెలిపారు.
"అయితే, ఆ హామీ నెరవేరకపోవడంతో ఉదయ్‌పూర్‌లోని భోపాల్‌పురా పోలీస్ స్టేషన్‌లో ముర్దియా చీటింగ్, ఇతర నేరాలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు" అని కేసు గురించి వివరించారు పోలీస్ అధికారి.
అసలు ఏం జరిగింది?
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. డాక్టర్ ముర్దియాకు డైరెక్టర్ విక్రమ్ భట్‌ను ఒక పరిచయస్తుడు ఇంట్రడ్యూస్ చేశారు. ముర్దియా తన దివంగత భార్య బయోపిక్ తీయాలనే ప్రతిపాదనతోనే ఈ పరిచయం ఏర్పడింది. మే 2024లో వీరిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం, బయోపిక్‌తో సహా మొత్తం నాలుగు సినిమాలను ముర్దియా నిర్మించాలి.
ఈ మొత్తం డీల్ విలువ రూ. 47 కోట్లుగా నిర్ణయించారు. ఒప్పందంలో ఉన్న మొదటి రెండు సినిమాలు పూర్తయ్యాయి. అయితే, మిగిలిన చిత్రాలను మాత్రం భట్ దంపతులు తీయలేదు. దీంతో, డాక్టర్ ముర్దియా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
ఉదయ్‌పూర్ పోలీసులు జరిపిన విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఫిర్యాదు దారుడి నుంచి కోట్లాది రూపాయలు మోసం చేయాలనే దురుద్దేశంతోనే నిందితులు నకిలీ పత్రాలు (నకిలీ విక్రేతల బిల్లులు) తయారు చేశారని పీటీఐ నివేదించింది.
ఈ విధంగా నిందితులు అంటే భట్ దంపతులు డాక్టర్ ముర్దియా నుంచి సుమారు రూ. 30 కోట్లు కాజేశారని ఆరోపణలు వచ్చాయి. గతంలోనే విక్రమ్ భట్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.
విక్రమ్ భట్ లాయర్లు ఏమంటున్నారు?
తాజాగా, భట్ దంపతుల తరఫు న్యాయవాదులు రాకేష్ సింగ్, సంజయ్ సింగ్ ఆదివారం మాట్లాడుతూ.. తమ క్లయింట్స్‌ను సరైన ప్రక్రియ లేకుండా అరెస్ట్ చేశారని ఆరోపించారు. అంతేకాకుండా, వారిని బెదిరించి, బలవంతంగా ఒక డాక్యుమెంట్‌పై సంతకం చేయించుకున్నారని వారు పేర్కొన్నారు.
అరెస్ట్ తర్వాత భట్ దంపతులను కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. ఈ క్రమంలో భట్ దంపతులను పోలీసులు దురుసుగా, దారుణంగా చూశారని కోర్టుకు తెలిపారు నిందితుల తరఫు లాయర్లు.
"మేము చెప్పినట్లుగా ఆ పత్రంపై సంతకం చేయకపోతే రాజస్థాన్‌లో చిత్రహింసలకు గురిచేస్తామని పోలీసులు బెదిరించారు" అని లాయర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం భట్ దంపతులకు డిసెంబర్ 9 వరకు ట్రాన్సిట్ రిమాండ్‌ను మంజూరు చేసింది.














